Hyderabad News : మేడ్చల్ జిల్లా పీర్జాధిగూడలోని ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సర చదువుతున్న నిమ్మల రమాదేవి(17) అనే విద్యార్థిని ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయాన్ని బయటకు రాకుండా విద్యార్థిని మృతదేహాన్ని కళాశాల యాజమాన్యం ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించింది. విద్యార్థిని ఎక్కడ ఉందో కుటుంబ సభ్యులకు పూర్తి సమాచారం ఇవ్వలేని ఆరోపణలు వస్తున్నాయి. నాగర్ కర్నూల్ జిల్లా చెంచుగూడ గ్రామానికి చెందిన రమాదేవి  పీర్జాధిగూడలో ఉన్న కళాశాలలో బైపీసీ ప్రథమ సంవత్సరం చదువుతుంది. విద్యార్థిని ఆత్మహత్య గురించి తెలుసుకున్న ఏబీవీపీ విద్యార్థులు కళాశాలకు చేరుకుని ఆందోళనకు దిగారు. విద్యార్థిని ఆత్మహత్యపై విచారణ చేపట్టాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న  మేడిపల్లి పోలీసులు కళాశాలకు చేరుకుని వివరాలు సేకరిస్తు్న్నారు.  కళాశాల ముందు ధర్నా చేస్తున్న విద్యార్థి నాయకులను మేడిపల్లి పోలీసులు అరెస్టు చేశారు. 


ఎగ్జామ్ బాగా రాయకపోవడంతో మందలించిన సిబ్బంది! 


బోటనీ ఫ్రీ ఫైనల్ ఎగ్జామ్ బాగా రాయకపోవడంతో కళాశాల సిబ్బంది మందలివ్వడంతో విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. కాలేజీ హాస్టల్ మూడో ఫ్లోర్ లో తన బెడ్ పక్కన ఉన్న కిటికీకి ఉరివేసుకొని విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయం గమించిన తోటి విద్యార్థులు, సిబ్బంది యాజమాన్యానికి తెలపడంతో విద్యార్థిని హుటాహుటినా స్థానిక హాస్పిటల్ కు తరలించారు. అప్పటికే విద్యార్థిని మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. 


విద్యార్థులపై దాడి


కళాశాల వద్ద ఆందోళన చేస్తున్న విద్యార్థి నాయకులపై పోలీసుల దాడికి పాల్పడ్డారు. కళాశాల ముందు బైఠాయించిన విద్యార్థి నాయకులపై పిడి గుద్దులు కురిపించారు. విద్యార్థి సంఘాల నేతలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో కళాశాల వద్దకు చేరుకుంటున్నారు. మృతిచెందిన విద్యార్థిని తల్లిదండ్రులను లోపలికి కళాశాలలోపలికి అనుమతించలేదు. దీంతో వాళ్లు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  


తల్లిదండ్రులు రాలేదని మనస్థాపంతో విద్యార్థిని ఆత్మహత్య


కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలపై నుంచి దూకి 10వ తరగతి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది. కరీంనగర్  కేంద్రానికి చెందిన విద్యార్థిని తల్లిదండ్రులు రాలేదని మనస్థాపంతో భవనంపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలిస్తోంది. విద్యార్థినిని హుటాహుటిన పోలీస్ వాహనంలో కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు.  


స్కూల్లో సమస్యలు చూసి తట్టుకోలేక విద్యార్థి మృతి 


 డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం గోడి బాలుర గురుకుల పాఠశాలలో సమస్యలను చూసి తట్టుకోలేక ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడని ప్రజాసంఘాల నాయకులు, విద్యార్థులు తల్లిదండ్రులు ఆరోపించారు. గురుకుల పాఠశాలలో దుర్భరమైన పరిస్థితుల వల్లే తట్టుకోలేక అతి చిన్న వయసులో అఘాయిత్యానికి పాల్పడ్డాడని ఆవేదన వ్యక్తం చేశారు.  సోహిత్ రాజవర్ధన్ మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని విద్యార్థుల తల్లిదండ్రుల కమిటీ, ప్రజా, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. గోడి గురుకుల పాఠశాల వద్ద విద్యార్థి ఆత్మహత్యపై విద్యార్థి సంఘ నాయకులు, తల్లిదండ్రులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థి తండ్రి శ్రీహరి మాట్లాడుతూ తన కుమారుడు రాజవర్ధన్ గురుకుల పాఠశాలలో ఉండగానే అనారోగ్యానికి గురవడంతో  ఇంటికి తీసుకువెళ్లానని గురుకుల పాఠశాలలో కనీసం తాగడానికి మంచినీళ్లు, నాణ్యమైన ఆహారం లేకపోవడం పారిశుద్ధ్యం లోపించడంతో విద్యార్థులు తరచూ అనారోగ్యానికి గురవుతున్నారని తెలిపారు. ఈ సందర్భంలో ఇంటికి తీసుకువెళ్లిన తన కుమారుడు తనను మళ్లీ గురుకుల పాఠశాలకు తీసుకువెళతానని చెప్పడంతో అక్కడ నెలకొని ఉన్న సమస్యలు వల్ల తలెత్తుతున్న ఇబ్బందులను తట్టుకోలేనని భయంతో ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు.