Mamata Banerjee on Cow Hug Day:



రూ.10 లక్షలు పరిహారం ఇవ్వండి: మమతా బెనర్జీ 


ఫిబ్రవరి 14న కౌ హగ్ డే జరుపుకోవాలని కేంద్రం ప్రకటించటం ఆ తరవాత ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇదే క్రమంలో విమర్శలూ వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఇప్పటికే ప్రతిపక్ష నేతలు కౌంటర్‌లు వేయగా..ఇప్పుడు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి కూడా సెటైర్లు వేశారు. ఆవుని కౌగిలించుకోడానికి ఎలాంటి అభ్యతరం లేదని, కానీ అది కొమ్ములతో దాడి చేసి గాయపరిస్తే బీజేపీ పరిహారం ఇస్తుందా..? అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గాయమైతే కచ్చితంగా బీజేపీ రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని అన్నారు. అంతే కాదు. గేదెల్ని కౌగిలించుకుని గాయపడినా రూ.20 లక్షలు పరిహారం ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. 2024లో జరగనున్న ఎన్నికల్లో బీజేపీని ఓడించి నియంతృత్వ పాలనకు స్వస్తి పలకాలని పిలుపునిచ్చారు. ప్రజా ప్రభుత్వం ఏర్పాటయ్యేలా అందరూ కలిసి రావాలని సూచించారు. ఇదే సమయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాపైనా విమర్శలు గుప్పించారు. బెంగాల్‌లో హింస, అవినీతి పెరిగిపోతున్నాయన్న నడ్డా వ్యాఖ్యల్ని ఖండించారు. దేశంలోనే ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా బెంగాల్‌లో శాంతి భద్రతల్ని అదుపులో ఉన్నాయని స్పష్టం చేశారు. సరిహద్దు ప్రాంతాల్లో కొందరు అమాయకుల్ని BSF బలగాలు హతమార్చుతున్నాయని ఆరోపించారు. దీనిపై కేంద్రం ఎలాంటి విచారణ జరిపించడం లేదని మండి పడ్డారు. 


థరూర్ సెటైర్..


ఈ మొత్తం వ్యవహారంపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ కూడా తనదైన స్టైల్‌లో సెటైర్లు వేశారు. ప్రతి అంశానికీ ఫన్నీ టచ్ ఇస్తూ ట్వీట్‌లు చేయడం శశి థరూర్‌కు అలవాటు. ఈ విషయంలోనూ అదే చేశారు. 


"నాకు తెలిసి కౌ హగ్ డే విషయంలో తప్పు దొర్లింది. కొందరు దీన్ని అపార్థం చేసుకున్నారు. అందరూ తమ పార్ట్‌నర్స్‌ని (Guy)ని కౌగిలించుకోవాలని చెప్పి ఉంటారు. కానీ కొందరు దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. Guy కిగా బదులుగా Gaay(ఆవు)అని పొరపడి ఉంటారు" 


శశి థరూర్,కాంగ్రెస్ ఎంపీ 


కౌ హగ్ డే విషయంలో కేంద్రం వెనక్కి తగ్గిందా అని ప్రశ్నించగా...ఇలా ట్వీట్‌లో ఫన్నీగా రెస్పాండ్ అయ్యారు. ఇప్పటికే సోషల్ మీజియాలో కౌ హగ్ డేపై బోలెడన్ని మీమ్స్ వచ్చాయి. కొందరు సపోర్ట్ చేస్తూ పోస్ట్‌లు పెడుతుండగా మరి కొందరు మీమ్స్ షేర్ చేస్తున్నారు. మొత్తానికి మాటల యుద్ధానికి దారి తీసింది. ఇది గమనించిన కేంద్ర పశుసంక్షేమ శాఖ కీలక ప్రకటన చేసింది. కౌ హగ్‌ డే జరుపుకోవాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు వెల్లడించింది.