నందమూరి నటసింహం బాలకృష్ణ రీసెంట్ గా ‘వీరసింహారెడ్డి’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా వసూళ్ల సునామీ సృష్టించింది. గోపీ చంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. తాజాగా బాలయ్యతో ప్రగ్యా జైస్వాల్ మరోసారి జోడీ కడుతోందట. అయితే, మూవీ కోసం కాదట. ప్రగ్యా ఇప్పటికే బాలయ్యతో కలిసి ‘అఖండ’ మూవీలో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించింది. ఇప్పుడు మరోసారి వీరిద్దరు కలిసి నటించబోతున్నారనే వార్త తెలియడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వీరిద్దరు కలిసి నటిస్తే తప్పకుండా బొమ్మ బ్లాక్ బస్టర్ కావాల్సిందేనని అభిప్రాయపడుతున్నారు. కానీ, వీరు నటించేది సినిమాలో కాదని తెలిసింది.
యాడ్ కోసం జోడీ కట్టిన బాలయ్య, ప్రగ్యా జైస్వాల్
కానీ, అందరూ అనుకుంటున్నట్లు ఈసారి వీరిద్దరు సినిమా కోసం కాకుండా ఓ యాడ్ కోసం కలిసి నటిస్తున్నారట. గతంలో సాయి ప్రియా కన్‌స్ట్రక్షన్ గ్రూప్ కోసం బాలయ్య కొన్ని యాడ్స్ చేశారు. ఇప్పుడు మరో కమర్షియల్ బ్రాండ్ కు ఆయన యాడ్స్ చేస్తానని ఒప్పుకున్నారట. ఇప్పటికే ఈ యాడ్స్ కు సంబంధించిన షూటింగ్ సాగుతున్నట్లు తెలుస్తోంది. రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ యాడ్ షూటింగ్ జరుపుతున్నారట. ఈ యాడ్ షూటింగ్ లో ప్రగ్యా జైస్వాల్‌తో కలిసి బాలయ్య పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ యాడ్ కు సంబంధించిన ఫోటో ఒకటి నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఇందులో బాలకృష్ణ, ప్రగ్యా ట్రెడిషనల్ డ్రెస్సుల్లో అందంగా కనిపిస్తున్నారు. ప్రగ్యా ఆకుపచ్చ పట్టు చీరలో కళకళలాడుతూ కనిపించింది. ఈ యాడ్ కు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో అధికారికంగా వెల్లడికానున్నాయి.
బుల్లితెరపై సందడి, యాడ్స్ కు గ్రీన్స్ సిగ్నల్
బాలయ్య ప్రస్తుతం సినిమాలతో పాటు బుల్లితెర షోలు, యాడ్స్ లోనూ నటిస్తున్నారు. గతంలో యాడ్స్ చేయడం తనకు ఇష్టం ఉండదని చెప్పిన బాలయ్య ఇప్పుడిప్పుడే మనసు మార్చుకుంటున్నారు. తన తరం హీరోలంతా యాడ్స్ ద్వారా బాగా డబ్బు సంపాదించినా, తను మాత్రం యాడ్స్ వైపు అడుగు పెట్టలేదు. కానీ, ఇప్పుడు అందరి మాదిరిగానే ఆయన కూడా యాడ్స్ చేస్తున్నారు. బాలయ్య ఆహా ఓటీటీ కోసం చేస్తున్న టాక్ షో బాగా పాపులరైన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఓ సీజన్ పూర్తి చేసుకున్న ఈ షో, ఇప్పుడు రెండో సీజన్ కూడా కంప్లీట్ చేసుకుంది. ఈ టాక్ షోకు ప్రేక్షకుల నుంచి ఓ రేంజిలో రెస్పాన్స్ వచ్చింది.
అనిల్ రావిపూడితో సినిమా చేస్తున్న బాలయ్య
ఇక బాలయ్య సినిమాల విషయానికి వస్తే ‘వీరసింహారెడ్డి’ సినిమా విజయం తర్వాత, అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘NBK108’వ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో అందాల తార కాజల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ శ్రీలీల బాలయ్య కూతురుగా కనిపించనుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కొనసాగుతోంది.
Read Also: కియారా దంపతులకు ‘RC15’ టీమ్ అదిరిపోయే విషెష్, శంకర్ ప్లాన్ మామూలుగా లేదుగా!