ప్రమాదాలు ఏ వైపు నుంచి వచ్చి ఎవర్ని బలితీసుకుంటాయో చెప్పలేం. రోడ్లపై ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎదుటి వారు చేసే తప్పిదాల వల్ల వీరి ప్రాణాలు పోయిన సందర్భాలు గతంలో ఎన్నో వెలుగు చూశాయి. ఇప్పుడు కూడా అలాంటి ఘటనే జరిగింది. మరో వ్యక్తి అజాగ్రత్తగా చేసిన పని వల్ల ఓ గవర్నమెంట్ టీచర్ చనిపోయాడు. అతని కుమారుడు చావుబతుకుల్లో కొన ఊపిరితో ఉన్నాడు.
ఓ క్యాబ్ డ్రైవర్ డోరు తీయడం ప్రభుత్వ ఉపాధ్యాయుడి ప్రాణాన్ని బలిదీసుకుంది. డ్రైవర్ ముందు, వెనకా చూడకుండా నిర్లక్ష్యంగా డోర్ తెరవడంతో బైక్‌పై వస్తున్న తండ్రీకుమారులు డోర్ తగిలి కిందపడ్డారు. అదే సమయంలో వెనకనుంచి వచ్చిన టిప్పర్ తండ్రి మీదుగా వెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. అతని కుమారుడు అదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన ప్రగతి నగర్ రోడ్డులో ఆదివారం జరిగింది.
బాచుపల్లి పోలీసులు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. మెదక్ పట్టణానికి చెందిన పెంటయ్య అనే 45 ఏళ్ల వ్యక్తి గవర్నమెంట్ టీచర్. ఆదివారం (ఫిబ్రవరి 12) మధ్యాహ్నం ప్రగతి నగర్ నుంచి కొండాపూర్‌కు కుమారుడితో కలిసి బైక్‌పై బయలుదేరాడు. మార్గ మధ్యలో ఓ క్యాబ్ డ్రైవర్ రోడ్డుకు పక్కనే కారు ఆపాడు. ముందూ వెనకా చూసుకోకుండా నిర్లక్ష్యంగా కారు డోర్‌ను ఒక్కసారిగా తెరిచేశాడు. దాంతో కారు పక్కగా వెళ్తున్న తండ్రీ కొడుకులు ఆ డోరు తగిలి కింద రోడ్డుపై పడిపోయారు.
వారి దురదృష్టవశాత్తు అదే సమయంలో వెనక నుంచి వేగంగా వస్తున్న టిప్పర్ పెంటయ్య మీది నుంచి వెళ్లింది. ఆ టిప్పర్ డ్రైవర్ కింద పడి ఉన్న అతణ్ని చూసినప్పటికీ ఆ క్షణంలో అంత భారీ వాహనాన్ని అదుపు చేయలేకపోయాడు. ఈ ప్రమాదంలో గవర్నమెంట్ టీచర్ పెంటయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న బాచుపల్లి పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. పెంటయ్య అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుమారుడు శ్రీసాయి చరణ్ అదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. క్యాబ్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లుగా ఎస్‌ఐ మహేష్ తెలిపారు. క్యాబ్, టిప్పర్ డ్రైవర్లను అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.