Former Telangana Minister Jagadish Reddy : విద్యుత్ కొనుగోళ్ల అంశంపై తెలంగాణ సమాజానికి నిజాలు తెలియజేసేందుకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ రాశారని మాజీ మంత్రి జి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ భవన్‌లో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశలో ఆయన మాట్లాడారు. విద్యుత్ కొనుగోళ్ల అంశంపై విచారణకు తెలంగాణ ప్రభుత్వం జస్టిస్ నరసింహరెడ్డి నేతృత్వంలో కమిషన్‌ను ఏర్పాటు చేసిందని, అయితే, ఈ కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని ఆయన ఆరోపించారు.
ఏ విచారణకు అయినా మేం సిద్ధం
బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనే విద్యుత్ కొనుగోళ్ల అంశంపై కాంగ్రెస్, బీజేపీ నేతలకు అసెంబ్లీలో సమాధానం ఇచ్చామని, ఈఆర్‌సీ ముందు కాంగ్రెస్, బీజేపీ నేతలు తమ వాదనలు వినిపించారన్నారు. ఏ విచారణకు అయినా తాము సిద్ధమని ఎప్పుడో చెప్పామన్నారు. కమిషన్ పాత్రపైనా కేసీఆర్ అనుమానాలను వ్యక్తం చేశారన్న జగదీష్ రెడ్డి.. అందుకే విచారణ చేసే అర్హత కమిషన్ చైర్మన్ కోల్పోయారంటూ లేఖ రాశారన్నారు. కమిషన్ జ్యుడిషియరీ కమిషన్ కాదన్న విషయాన్ని గుర్తించాలన్నారు. కమిషన్ చైర్మన్ ఎల్ నరసింహరెడ్డిపై తమకు సంపూర్ణ గౌరవం ఉందని, తెలంగాణ వాదిగా ఆయనకు పేరుందన్నారు. అయితే, చైర్మన్ అయిన తరువాత నర్సింహరెడ్డి అభిప్రాయాలు మారాయన్నారు. కాంగ్రెస్, బీజేపీ నేతల అభిప్రాయాలను మీడియా సమావేశంలో నరసింహరెడ్డి చెప్పారని, ఆయనపై ఉన్న తమకు ఉన్న సదాభిప్రాయం పోయిందన్నారు. విచారణ పూర్తికాక ముందే ఆయన తీర్పు ఎలా చెప్పారని జగదీష్ రెడ్డి ప్రశ్నించారు.
న్యాయబద్ధంగా వ్యవహరించని కమిషన్ చైర్మన్
విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంపై నియమితులైన జస్టిస్ నరసింహరెడ్డి కమిషన్ న్యాయబద్ధంగా ఉంటారని తాము భావించామని, కానీ, ఆయన అలా వ్యవహరించలేదన్నారు. ఈఆర్‌సీ స్వతంత్ర కమిషన్ అని, అది ఇచ్చిన తీర్పే ఫైనల్ అని జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. కోర్టు తీర్పు ఫైనల్ అవుతుందే తప్పా.. కమిషన్ ఇచ్చిన తీర్పు ఫైనల్ కాదన్న విషయాన్ని గుర్తించాలని ఈ సందర్భంగా జగదీష్‌రెడ్డి గుర్తు చేశారు. ఈఆర్‌సీ తీర్పు ఇచ్చిన తరువాత కమిషన్ ఎలా వేస్తారన్న విషయం నరసింహరెడ్డికి తెలియదా..? అని ప్రశ్నించారు. విద్యుత్ కొనుగోళ్ల అంశంపై సమాధానాలు ఇచ్చేందుకు 15వ తేదీ వరకు సమయం ఇచ్చారని, కానీ, నరసింహరెడ్డి ఈ నెల 11న మీడియా సమావేశం ఎలా ఏర్పాటు చేస్తారని ప్రశ్నించారు. కమిషన్ బాధ్యతలు నుంచి ఆయన తప్పుకుంటారని తాము భావిస్తున్నామన్నారు. విచారణ కమిషన్ అసంబంద్ధమైనదిగా ఉందన్నారు. ఛత్తీస్ గఢ్ విద్యుత్ ఒప్పందం, భద్రాద్రి, యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణం, అన్ని ప్రభుత్వ రంగ సంస్థలతోనూ ఒప్పందం చేసుకున్నామన్న జగదీష్‌రెడ్డి.. ఛత్తీస్ గఢ్ రాష్ట్ర ప్రభుత్వంతో బహిరంగంగానే విద్యుత్ ఒప్పందం చేసుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
రమణ్‌సింగ్‌కు లంచం ఇచ్చారా..?
విద్యుత్ కొనుగోలులో కేసీఆర్ మాజీ సీఎం రమణ్‌సింగ్‌కు ఏమైనా లంచం ఇచ్చారా..? అన్న దానికి బీజేపీ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కమిషన్ ఏర్పాటు కుట్రపూరితంగా జరిగిందన్న జగదీష్ రెడ్డి.. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థతోనూ ఒప్పందం చేసుకున్నామని, ఏమైనా అవినీతి జరిగితే కేంద్రం నిజానిజాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు ఎక్కువ రేటుకు విద్యుత్ కొనుగోలు చేశారని, తెలంగాణ మాత్రం రూ.3.90 పైసలకు మాత్రమే కొనుగోలు చేసిందన్నారు. కేసీఆర్ వివరణ తీసుకున్నాకే ఛత్తీస్ గఢ్ వాళ్లను పిలిస్తే బాగుండేదని స్పష్టం చేశారు. దేశంలో ఏ కమిషన్ మధ్యలో లీకులు ఇవ్వలేదని, కానీ, ఈ కమిషన్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందన్నారు.
800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశామని, ఇప్పటికీ రామగుండం, భూపాలపల్లి, కొత్తగూడెం, విజయవాడ, ఆర్టీపీసీ నుంచి క్రిటికల్ టెక్నాలజీ ద్వారానే విద్యుత్ ఉత్పత్తి అవుతోందని స్పష్టం చేశారు. పారదర్శకతతోనే ప్రభుత్వ రంగ సంస్థ బీహెచ్‌ఈఎల్‌కు భద్రాద్రి, యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణాలను అప్పగించామని జగదీష్ రెడ్డి వెల్లడించారు. కేసీఆర్‌పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని, ఈ తరహా చర్యలను మానుకోవాలని హితవు పలికారు.