TRS Kavitha : తెలంగాణ రాష్ట్ర సేన పేరుతో పార్టీ ప్రకటించిన కవిత తన లక్ష్యాలను స్పష్టంగా ప్రజలకు వివరించారు. వచ్చే ఎన్నికల్లో భారీ విజయం సాధించబోతున్నామని వెల్లడించారు. దీని కోసం ప్రజల్లోకి వెళ్లేందుకు తాను ఐదు కీలక హామీలు ఇస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రైవేటు స్కూళ్లలో అందరికీ ఉచిత విద్యను అందిస్తామని కవిత సెన్సేషనల్ ప్రకటన చేశారు. అంతే కాకుండా రాష్ట్రంలో ఏ రోగానికైనా ఏ ఆసుపత్రి అయినా సరే ఉచితంగా వైద్యం అందిస్తామని ప్రకటించారు. రైతే రాజు అన్న నినాదంతో తమ ప్రభుత్వం పని చేస్తుందని పేర్కొన్నారు. ఏ ఆఫీస్‌కు వెళ్లినా రైతు అని చెబితే ప్రత్యేక మర్యాదులు ఉంటాయని పేర్కొన్నారు. వారికి ప్రత్యేకంగా చూసి వారి పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని చట్టం తీసుకొస్తామని ప్రామిస్ చేశారు.
ఉద్యోగాలా, వ్యాపారమా? యువతే నిర్ణయించుకునే వెసులుబాటు
స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ప్రతి ప్రభుత్వం మీకు ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తామని చెబుతున్నారే తప్ప మీ ఆలోచన ఏంటని ఎవరైనా అడిగారా అని కవిత ప్రశ్నించారు. తమ ప్రభుత్వంలో మాత్రం అలాంటి నిర్ణయాలు ఉంటాయని వెల్లడించారు. ఉద్యోగం చేయాలో, వ్యాపారం చేయాలో ఆ దిశగానే వారికి చేయూత అందిస్తామని వెల్లడించారు. వచ్చిన మొదటి ఏడాదే ఒకే దెబ్బతో నాలుగు లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వబోతున్నట్టు తెలిపారు. అంతే కాకుండా ఉద్యమకారులకు ప్రత్యేకంగా ఉద్యోగాలు కేటాయించి వారికి ఇస్తామని ప్రకటించారు. వ్యాపారాలు చేసుకుంటామని మంచి ప్రతిపాదనలతో వచ్చిన యువతను ప్రోత్సహించేందుకు ప్రభుత్వమే రుణాలు ఇస్తుందని వెల్లడించారు. దీనికి ఎలాంటి ష్యూరిటీలు ఉండవి, ప్రభుత్వమే వారికి అండగా ఉంటుందన్నారు.
పన్నెండేళ్లుగా తెలంగాణ పాలకు మరిచిపోయిన సామాజిక న్యాయ తెలంగాణ ధ్యేయంగా పని చేస్తామన్నారు కవిత. ఎస్సీ, ఎస్టీ, బీసీలు, అగ్రవర్ణపేదలకు, ముస్లీంలు, క్రిస్టియన్లకు న్యాయంచేసేలా వారికి విద్య, వైద్యం, ఇల్లు ఇవ్వడంతోపాటు వారు అభివృద్ధి చెందేందుకు కావాల్సిన అన్ని వెసులుబాట్లు ప్రభుత్వం తరఫున అందిస్తామని మాట ఇచ్చారు.
Also Read: కవిత టీఆర్‌ఎస్‌పై బీఆర్‌ఎస్ కౌంటర్ అటాక్! పార్టీ పేరు చెప్పకుండానే ట్రోలింగ్!
బీజేపీ నేతలకు సవాల్
ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చేసిన ముంపు ప్రాంతాల విషయంపై కూడా కొట్లాడతామన్నారు కవిత. అక్రమంగా ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా ఏపీలో కలిపిన ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణలో కలుపుతామని వివరించారు. సత్తా ఉంటే ఆ గ్రామాలను తెలంగాణలో కలిపేలా కేంద్రాన్ని ఒప్పించాలని బీజేపీ ఎంపీలకు సవాల్ చేశారు. అసలు తెలంగాణ ఏర్పాటే బీజేపీకి ఇష్టం లేదని ఎద్దేవా చేశారు. "తల్లిని చంపి బిడ్డను తీశారని బీజేపీ పెద్దలు అంటారు. మెడకాయ మీద తలకాయ లేని ఒక ఎంపీ తెలంగాణను భారత్ పాక్ విభజనతో పోల్చుతారు. అగ్రనాయకత్వం అలా మాట్లాడితే బీజేపీ బానిస ఎంపీలు ఒక్క మాట్లాడరు. మనకు ఒక్క రూపాయి ఇవ్వకపోయిన సరే మన బీజేపీ ఎంపీలు మాట్లాడరు. సామాజిక న్యాయం అనే దానికే బద్ద వ్యతిరేకి బీజేపీ. మహిళ బిల్లు పక్కన పెట్టారు. బీసీ బిల్లు, కులగణన బిల్లు తొక్కి పెట్టారు. పేదలకు కూడు పెట్టే ఉపాధి హామీని పక్కన పెట్టారు. ఫెడరల్ స్ఫూర్తిని పక్కన పెట్టి మన మండలాలు తీసుకున్నారు. అయిన సరే ఈ బీజేపీ బానిస ఎంపీలు పెదవులు తెరవరు. ఈ బీజేపీ బానిస ఎంపీలకు నేను సవాల్ చేస్తున్నా, మీరు తెలంగాణ బిడ్డలైతే భద్రాచలం వద్ద ఐదు గ్రామాలను తెలంగాణకు పట్టుకురండి. పోలవరం పూర్తయితే ఆ గ్రామాలు మునిగిపోతాయి. " అని సవాల్ చేసారు.
