తెలంగాణ హైకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అలోక్ ఆరాధే ప్రమాణం చేశారు. రాజ్ భవన్ లో గవర్నర్ తమిళిసై జస్టిస్ అలోక్ తో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ కూడా హాజరయ్యారు. సీఎంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా రాజ్ భవన్‌కు వెళ్లారు.


ఇటీవల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతిపై వెళ్లడంతో ఆయన స్థానంలో జస్టిస్‌ అలోక్‌ అరాధే తెలంగాణకు వచ్చారు. కొలీజియం సిఫార్సులకు కేంద్ర న్యాయ శాఖ గత వారం ఆమోదం తెలుపుతూ గెజిట్‌ నోటిఫికేషన్‌ వెలువరించిన విషయం తెలిసిందే. తెలంగాణ హైకోర్టు ఏర్పాటైన తర్వాత 6వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ అలోక్‌ బాధ్యతలు చేపట్టారు. 



తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్‌ ఆలోక్‌ అరాధే 1964 ఏప్రిల్ 13న రాయ్‌పుర్‌లో జన్మించారు. 1988 జులై 12న న్యాయవాదిగా తన ప్రస్థానం ప్రారంభించారు. 2009 డిసెంబరు 29న మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులు అయ్యారు. 


జమ్మూకశ్మీర్‌ లో న్యాయమూర్తిగా 2016 సెప్టెంబరు 16న ట్రాన్స్‌ఫర్ అయ్యారు. ఆ రాష్ట్రానికే జ్యుడీషియల్‌ అకాడమీకి, లీగల్ సర్వీసెస్ అథారిటీకి ఛైర్మన్‌గా పని  చేశారు. జస్టిస్ ఆలోక్ అరాధే 2018లో మూడు నెలల పాటు జమ్మూకశ్మీర్‌ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా కూడా పని చేశారు. తర్వాత కర్ణాటక హైకోర్టు జడ్జిగా వెళ్లారు. 2018 నవంబరు 17 నుంచి కొనసాగుతున్న జస్టిస్ ఆలోక్ ఆరేధే.. కొంతకాలం క్రితం కర్ణాటక తాత్కాలిక సీజేగా అయ్యారు. తాజాగా కొలీజియం సిఫార్సు మేరకు రాష్ట్రపతి ఆమోదం తర్వాత తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఆయన నియమితులు అయ్యారు.