జూబ్లీహిల్స్ లో బాలికపై సామూహిక అత్యాచారం ఘటనకు సంబంధించి బాలిక వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఇతను పాతబస్తీకి చెందిన సుభాన్ అనే యువకుడిగా పోలీసులు గుర్తించారు. అయితే, ఈ కేసుకు సంబంధించిన వీడియోలను బహిర్గతం చేసిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావుపై కూడా కేసు పోలీసులు కేసు నమోదు చేయనున్నట్లు తెలుస్తోంది. సంబంధిత వీడియోలను రఘునందన్ రావు ప్రెస్ మీట్‌లో ప్రదర్శించిన సంగతి తెలిసిందే.


సుప్రీం కోర్టు మార్గదర్శకాల ప్రకారం అత్యాచారానికి గురైన బాధితురాలి వివరాలు, చిత్రాలు బయటికి వెల్లడించడానికి వీల్లేదు. చివరికి బాధితురాలి ఆచూకీ తెలిపే ఏ వివరాలను కూడా ఎవరూ బహిర్గత పర్చకూడదు. ఈ క్రమంలోనే వీడియోలు వైరల్ చేసిన వ్యక్తిపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. ప్రెస్ మీట్‌లో ఆ చిత్రాలు ప్రదర్శించినందుకే రఘునందన్ రావు పై కూడా కేసు నమోదు చేసే యోచనలో పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది.


రంగంలోకి మహిళా కమిషన్
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో అమ్నేసియా పబ్ కేసు విషయంలో తెలంగాణ మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది. 17 ఏళ్ల బాలికపై జరిగిన గ్యాంగ్ రేప్ కేసును మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది. ఈ కేసుకు సంబంధించి సమగ్రమైన నివేదిక ఇవ్వాలని డీజీపీ మహేందర్ రెడ్డికి మహిళా కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు నివేదిక పరిశీలించిన అనంతరం తమ తరపున చర్యలు ఉంటాయని మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ సునీతా లక్ష్మా రెడ్డి వెల్లడించారు. అంతేకాక, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తమ పిల్లల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి సూచించారు.


ఇన్నోవా కారులో వీర్య అవశేషాలు
ఈ గ్యాంగ్ రేప్ ఘటనలో నిందితులు ఉపయోగించిన కార్లలో ఒకటి ఇన్నోవా కారు. మరో బెంజి కారును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కార్లలో క్లూస్ టీం, ఫోరెన్సిక్ నిపుణులు తనిఖీ చేయగా, మెర్సిడిస్ బెంజి కారులో బాలికకు సంబంధించిన కొన్ని వస్తువులు దొరికాయి. బాధిత బాలిక జుట్టు, చెప్పు, కమ్మను క్లూస్‌ టీమ్‌ నిపుణులు గుర్తించారు. ఇన్నోవా కారులోనూ బాలిక జుట్టుతో పాటు నిందితుల వీర్య నమూనాలను కూడా ఫోరెన్సిక్‌ నిపుణులు గుర్తించారు. వాటిని సేకరించి ఫోరెన్సిక్ లేబొరేటరీకి పోలీసులు పంపించారు. అయితే, ఈ కేసులో ఓ ఎమ్మెల్యే కొడుకు పాత్ర కూడా ఉందని వాదనలు వస్తున్నాయి. కానీ, అతనికి సంబంధం లేదని వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డేవిస్ స్పష్టం చేశారు. కానీ, అతను ఎమ్మెల్యే కొడుకే అని బీజేపీ నేతలు నొక్కి చెబుతున్నారు. ఈ ఫోరెన్సిక్ నివేదికలు వస్తే అసలు విషయం తేలనుంది. అదే నిజమైతే ఎమ్మెల్యే కొడుకు పేరు కూడా ఎఫ్ఐఆర్ లో ఏ-6గా పెట్టే అవకాశం ఉంది.