హైదరాబాద్‌లో ఐసీస్ - ఇస్లామిక్‌ స్టేట్‌ ఆఫ్‌ ఇరాక్‌ అండ్‌ సిరియా (ISIS - Islamic State of Iraq and Syria) కార్యకలాపాలు కలకలం రేపాయి. హైదరాబాద్‌లోని పాత బస్తీకి చెందిన 18 ఏళ్ల యువకుడు సులేమాన్‌కు ఐసీస్‌తో సంబంధాలు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. హైదరాబాద్‌ కేంద్రంగా కొద్ది నెలల నుంచి ఐసీస్‌ సానుభూతిపరులను తయారు చేసేందుకు అతను సోషల్ మీడియాను బాగా ఉపయోగిస్తున్నట్లుగా పోలీసుల విచారణలో తేలింది. ఫలక్ నుమాకు చెందిన సులేమాన్ అమెరికాకు వ్యతిరేకంగా హైదరాబాద్ నుంచి వెళ్లి యుద్ధం చేయాలని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు. తొలుత ఇంటెలిజెన్స్ బ్యూరో (Intelligence Bureau) సమాచారంతో అప్రమత్తమైన హైదరాబాద్ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అతణ్ని పట్టుకొని విచారణ జరుపుతున్నారు. అతని ఐపీ అడ్రస్ ద్వారా సులేమాన్ ఆచూకీని పోలీసులు గుర్తించారు.


కేసు నమోదు చేసి శుక్రవారం రాత్రి నుంచి ఓ రహస్య ప్రాంతంలో ఉంచి విచారణ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇరాక్‌ కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా యువతను పథకం ప్రకారం రెచ్చగొట్టి జిహాద్‌ సైనికులుగా తయారుచేస్తున్న ఐసిస్‌ ఉగ్రవాద సంస్థతో సులేమాన్ సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. సోషల్ మీడియా, ప్రత్యేక యాప్‌ల ద్వారా తన స్నేహితుల్ని జిహాద్‌ వైపు మళ్లించేందుకు యత్నిస్తున్నాడని పోలీసులు గుర్తించారు. అవసరమైన సమాచారాన్ని, వీడియోలను ఆ యాప్ ల ద్వారా ఐసిస్ ఉగ్రవాదులకు పంపుతున్నాడని పోలీసులు గుర్తించారు. ఇందుకోసం హవాలా ద్వారా నిధులు కూడా సేకరిస్తున్నాడని సమాచారం. అతని ఉగ్రవాద కార్యకలాపాల తీవ్రత ఆధారంగా చట్టపరమైన చర్యలు చేపడతామని పోలీసులు తెలిపారు.


దేశంలో విధ్వంసాలకు కుట్ర..
సులేమాన్ ల్యాప్‌ టాప్‌ను పరిశీలించిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి. దేశంలోని మెట్రో నగరాల్లో అరాచకం సృష్టించేందుకు ఐసిస్‌ ప్రణాళిక రచిస్తోందని వారు తెలుసుకున్నారు. గుళ్లు, మసీదులు, జనాలు ఎక్కువుండే చోట్ల బాంబు దాడులకు పథకం రచించినట్టు గుర్తించారు. నిందితుడు ఎప్పటి నుంచి ఐసిస్‌ సానుభూతిపరుడిగా మారాడు, కుటుంబ నేపథ్యంపై పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు.