హైదరాబాద్ మెట్రో రైలు వేగం పంచనుంది. కమిషనర్‌ ఆఫ్‌ మెట్రో రైల్వే సేఫ్టీ (సీఎంఆర్‌ఎస్‌) అనుమతులతో వేగం పెంచుతున్నట్టు మెట్రో యాజమాన్యం ప్రకటించింది. దీనివల్ల నగరంలో దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణీకుల సమయం ఆదా అవ్వనుందని తెలిపింది. 


నాగోల్‌ రాదుర్గం స్టేషన్ల మధ్య దూరం ఆరు నిమిషాలు తగ్గనుంది. మియాపూర్‌ ఎల్బీనగర్‌ మధ్య దూరం నాలుగు నిమిషాలు తగ్గనుంది. జేబీఎస్‌ - ఎంజీబీఎస్‌ల మధ్య నిమిషం యాభై సెకన్లు కాలం ఆదా అవుతుంది. 


ఇప్పటి వరకు మెట్రో రైలు గంటకు 70 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది. స్టేషన్ నుంచి స్టేషన్‌కు మధ్య రెండు నిమిషాలు సమయం తీసుకోనుంది. ఇప్పుడు మెట్రో రైలు వేగాన్ని 80 కిలోమీటర్లకు పెంచనున్నట్టు హైదరాబాద్‌ మెట్రో ప్రకటించింది. సీఎంఆర్ఎస్ ఆమోదందో ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది.






ఉగాది సందర్భంగా హైదరాబాద్ వాసులకు మెట్రో మరో అద్భుత అవకాశాన్ని కూడా ఇచ్చింది. సెలవు దినాల్లో ఎటు నుంచి ఎటైనా ప్రయాణం చేసేందుకు తక్కువ ధరకు టికెట్ ఇస్తున్నట్టు పేర్కొంది. 57 మెట్రో స్టేషన్ల మధ్య ఎన్నిసార్లైనా తిరిగేందుకు ఈ విధానం తీసుకొచ్చింది. ఏడాదిలో వంద సెలవు దినాల్లో మాత్రమే ఈ ఆఫర్ వర్తించనుంది. మొదట యాభై రూపాయలతో కార్డు తీసుకొని 59 రూపాయలతో రీఛార్జ్ చేయాలి. అప్పుడు ఆఫర్ ప్రారంభమవుతుంది. ప్రతి ఆదివారం, రెండో, నాల్గో శనివారంతోపాటు ముఖ్యమైన పండగలప్పుడు ఈ ఆఫర్ వర్తిస్తుంది.