International Kite Festival in Hyderabad: హైద‌రాబాద్: మరో అంత‌ర్జాతీయ వేడుక‌కు హైద‌రాబాద్ మహా నగరం సిద్ధమ‌వుతోంది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జ‌న‌వ‌రి 13 నుంచి 15వ తేదీ వ‌ర‌కు మూడు రోజులపాటు అంత‌ర్జాతీయ కైట్ ఫెస్టివ‌ల్ & స్వీట్  ఫెస్టివ‌ల్ ను నిర్వహించేందుకు ప‌ర్యాట‌క శాఖ‌ ఏర్పాట్లు చేస్తుంది. ఈ సంద‌ర్బంగా  బేగంపేట్ హ‌రిత ప్లాజాలో ప‌ర్యాట‌క శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు  ఇంట‌ర్నేష‌న్ కైట్ ఫెస్టివ‌ల్  పోస్టర్ ను ఆవిష్కరించారు. 


తెలంగాణ సంస్కృతి, సంప్ర‌దాయాల‌ను ప్ర‌తిబింభించేలా ఫెస్టివ‌ల్ 
అనంత‌రం మంత్రి జూప‌ల్లి కృష్ణారావు మాట్లాడుతూ... తెలంగాణ సంస్కృతి, సంప్ర‌దాయాల‌ను ప్ర‌తిబింభించేలా ఫెస్టివ‌ల్ నిర్వహిస్తాం అన్నారు. జనవరి 13 నుంచి 3 రోజుల పాటు  జరిగే ఈ ఉత్సవాలలో 16  దేశాల నుంచి  40 మంది అంతర్జాతీయ కైట్ ఫ్లైయర్స్, 60 దేశవాళీ కైట్ క్లబ్ సభ్యులు, పాల్గొననున్నారు. పలు డిజైన్లలో రూపోందించిన పతంగులను ఎగుర వేస్తారని తెలిపారు. వీటితో పాటు  జాతీయ‌, అంతర్జాతీయ స్వీట్లను అక్కడి స్టాళ్ల‌లో అందుబాటులో ఉంచుతార‌ని పేర్కొన్నారు. 


సాంస్కృతిక కార్యక్రమాలకు ఏర్పాట్లు 
అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ లో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వ‌హించనున్నారు. వాటితో పాటు హ‌స్త‌క‌ళ‌లు, చేనేత వ‌స్త్రాల స్టాల్స్ ఏర్పాటు చేస్తున్న‌ట్లు ప‌ర్యాట‌క శాఖ అధికారులు వెల్లడించారు. ప్రదర్శన తిలకించటానికి వచ్చే సందర్శకులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా జీహెచ్ఎంసీ, పోలీసు, ఇతర శాఖల అధికారులు సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పారు. ఇక్కడికి వచ్చే సంద‌ర్శ‌కుల‌కు ఉచిత ప్ర‌వేశం ఉంటుంద‌ని తెలిపారు. ఈ కార్యక్రమంలో యువజన సర్వీసులు, పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్‌, ప‌ర్యాట‌క శాఖ  డైరెక్ట‌ర్ కె.నిఖిల‌, అసిస్టెంట్ డెరెక్ట‌ర్ లు కే. మ‌హేశ్, ఓం ప్ర‌కాష్, త‌దిత‌రులు పాల్గొన్నారు.