CPI Leaders meets CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిని సీపీఐ నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళవారం (జనవరి 2) సచివాలయంలో సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఆ పార్టీ నేతలు నారాయణ, చాడ వెంకట్ రెడ్డి, ఇతర నేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు వివిధ అంశాలపై చర్చించుకున్నారు. ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని ప్రభుత్వం చెప్పడం సంతోషంగా ఉందని సీపీఐ నేతలు తెలిపారు. ఈ సందర్భంగా సీపీఐ కార్యదర్శి నారాయణ రేవంత్ రెడ్డితో సరదా వ్యాఖ్యలు చేశారు. నీకోసమే కేసీఆర్ కొత్త సెక్రటేరియట్ కట్టించినట్లు ఉందని అన్నారు. కలిసొచ్చే కాలానికి నడిచివచ్చే కొడుకు పుడతాడంటే ఇదేనేమో అని నారాయణ సరదాగా అన్నారు.
ఇంకా నేతలు మాట్లాడుకుంటూ రేవంత్ రెడ్డికి కీలక సూచనలు చేశారు. రిటైర్డ్ ఐఏఎస్‌లకు తిరిగి బాధ్యతలు ఇవ్వొద్దని సీపీఐ నేతలు కోరారు. దీనిపై స్పందించిన సీఎం మాట్లాడుతూ.. ఉన్నవారందరినీ తొలగించామని మళ్లీ తీసుకునే ఆలోచన లేదని చెప్పినట్లు తెలుస్తోంది. సింగరేణి అవకతవకలపై విచారణ చేయించాలని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సీఎం రేవంత్ ను కోరారు. సింగరేణికి సీఎండీగా ఓ స్ట్రిక్ట్ ఆఫీసర్ ఉండాలని సూచించారు.
కాంగ్రెస్ - సీపీఐ పొత్తు
గత నెలలో ముగిసిన తెలంగాణ ఎన్నికల్లో సీపీఐ కాంగ్రెస్ పార్టీ పొత్తుతో ఎన్నికలకు వెళ్లిన సంగతి తెలిసిందే. సీపీఐకి కొత్తగూడెం సీటు, ఎమ్మెల్సీ పదవి ఇవ్వడానికి కాంగ్రెస్ అంగీకరించింది. కొత్తగూడెం ఎమ్మెల్యేగా పోటీ చేసిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆ పార్టీ నుంచి గెలుపొందారు.