మంచి మాటలు చెప్పమంటే ఎవరైనా చెబుతారు. కానీ అదే మంచి పని చేయాలంటే మాత్రం కొందరే ముందుకు వస్తారు. 75 మంది దివ్యాంగుల జీవితాల్లో మెరుగైన మార్పు తీసుకురావడం ద్వారా 75 ఏళ్ల స్వాతంత్ర్య వేడుకలను తనదైన రీతిలో జరుపుకుంటోంది ఓ స్వచ్ఛంద సంస్థ. విద్యార్థులు, యువ ఉద్యోగుల సాయంతో ప్రపంచ వ్యాప్తంగా 13 దేశాలు, 350 నగరాల్లో సేవలందిస్తున్న రాబిన్ హుడ్‌ ఆర్మీ... హైదరాబాద్‌లో నిర్వహించిన సేవా కార్యక్రమాలు పలువురి కళ్లల్లో ఆనందం నింపాయి. బధిర విద్యార్థులకు తోడ్పాటునందించే శ్రీనగర్ కాలనీలోని ఆశ్రయ ఆకృతి స్వచ్ఛంద సంస్థలో ఆరుగురికి వినికిడి పరికరాలు అందించారు.


బధిరులకు ఉపయోగపడే ఉపకరణాలు సాయం.. 
ఒక్కోటి 15వేల రూపాయల ఖరీదైన పరికరాలు అందించడం పట్ల లబ్ధిదారులు, స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలు శశికళ సంతోషం వ్యక్తం చేశారు. బధిర విద్యార్థులు ఇతరులతో సమానంగా జీవితంలో ముందుకెళ్లేందుకు ఈ ఉపకరణాలు ఎంతగానో తోడ్పడతాయన్నారు. దేశంలో రాబిన్ హుడ్ ఆర్మీ ఉన్న అన్ని నగరాల్లో 75 మంది చొప్పున దివ్యాంగులను ఎంపిక చేసి అవసరమైన సాయం చేస్తామని రాబిన్ హుడ్‌ ఆర్మీ స్వచ్ఛంద సేవకులు చెప్పారు. 
ప్రపంచవ్యాప్తంగా ఆకలిని నిర్మూలించాలనే ప్రధాన లక్ష్యంతో ఏర్పాటైన రాబిన్ హుడ్ ఆర్మీ.... హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్‌లో పేదలకు అన్నదానం నిర్వహించింది. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఇనిస్టిట్యూట్ అనే సంస్థ తమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఇందుకు అవసరమైన సాయం అందించడం సహా రాబిన్ హుడ్ ఆర్మీ సభ్యులతో కలిసి బస్తీ వాసులకు ఆహారం పంచిపెట్టారు. ఖాళీ కడుపుతో పడుకొనే పరిస్థితి ఎవరికీ రాకూడదనేది తమ లక్ష్యమని రాబిన్ హుడ్ ఆర్మీ సభ్యులు చెప్పారు. 


ఆకలి మరణాలే దారుణం.. 
ఎయిడ్స్, ఉగ్రవాదం కంటే ఆకలి మరణాలే ఎక్కువని చెప్పే రాబిన్ హుడ్ ఆర్మీ పోర్చుగల్ దేశంలో ఆవిర్భవించి తర్వాత 2014లో మన దేశంలోని దిల్లీలోనూ కార్యకలాపాలు ప్రారంభించింది. తర్వాత అనేక పట్టణాలకు విస్తరించింది. శుభకార్యాలు, రెస్టారెంట్లు లాంటి చోట్ల మిగిలిపోయిన ఆహారాన్ని సేకరించి, ఆకలితో ఉన్నవారికి అందేలా చూడటమే ఈ సంస్థ ప్రధాన విధి. అయితే.. స్వాతంత్ర్య దినోత్సవం లాంటి విశిష్టమైన సందర్భాల్లో ప్రత్యేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. అందులో భాగంగానే ఈసారి మిషన్ 75 పేరుతో 75లక్షల మందికి భోజనాలు అందించడం సహా.... ఒక్కో పట్టణంలో 75మంది జీవితాల్లో  మార్పు తీసుకు రావాలని నిర్ణయించుకున్నారు. దివ్యాంగులకు పరికరాలు, కంటి శస్త్ర చికిత్సలు లాంటి కార్యక్రమాలతో అభాగ్యులకు ఆసరాగా నిలిచారు. సాయం కోసం ఎదురుచూసే పేదలు, బధిరులకు ఎంతో అండగా నిలుస్తున్నారు.


మతాలు, రాజకీయాలకు అతీతంగా సేవలందించే రాబిన్ హుడ్ ఆర్మీ... ఎలాంటి విరాళాలూ వసూలు చేయకపోవడం విశేషం. దాతల నుంచి కేవలం లబ్ధిదారులకు అవసరమైన వస్తువుల రూపంలోనే సాయాన్ని స్వీకరిస్తారు. స్వచ్ఛంద సేవకులుగా తమవంతుగా సమయం వెచ్చించాలనే ఉత్సాహం కలిగినవారు... తమ వెబ్‌సైట్‌లో సంప్రదించాలని వారు సూచించారు.
Also Read: TTD: 50 మందితో మంత్రిగారి శ్రీవారి దర్శనం, అంతకుముందు ఏకంగా 140 మంది - భక్తుల ఆగ్రహం

Also Read: Independence Day 2022: వచ్చే 25 ఏళ్లు చాలా కీలకం, పంచప్రాణాలు పెట్టాలి - ఆ ఐదు ఏంటో చెప్పిన ప్రధాని