Rains In Telangana: అల్పపీడనం వాయుగుండంగా మారి, తీవ్ర వాయుగుండంగా ఉత్తర ఒడిశా వైపు కదులుతోంది. మరికొన్ని గంటల్లో తీరాన్ని దాటే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణతో పాటు యానాం, ఒడిశాలో వర్షాలు కురుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం సైతం పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. భారీ వర్షాలు కురుస్తాయని కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, వర్ష సూచన ఉన్న మరిన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ సైతం జారీ చేశారు. ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని, కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించారు. ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉంది.
తెలంగాణలో భారీ వర్షాలు
అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారుతోంది. దీని ప్రభావంతో సోమవారం, మంగళవారం సైతం తెలంగాణలో కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్నిచోట్ల తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. అతి భారీ వర్షాలు కురుస్తాయని కొమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. ఆదిలాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. రాష్ట్రంలో కొన్నిచోట్ల గాలులు గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో వీచనున్నాయి. ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే చోట ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. 






ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..
తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో మరో రెండు రోజులపాటు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ 5 జిల్లాలకు వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. తీరంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. మత్స్యకారులు వేటకు వెళ్లడం అంత క్షేమదాయకం కాదని అధికారులు హెచ్చరించారు. 






దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో నేడు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. భారీ వర్ష సూచనతో ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, కృష్ణా, నెల్లూరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం. ఒకట్రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయి.  రాయలసీమకు ఎలాంటి వర్ష సూచన లేదు. అయితే ఉమ్మడి కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలలో ఒకంట్రెండు చోట్ల తేలికపాటి జల్లులు పడతాయి.  


హెచ్చరిక: భారీ వర్షం కురుస్తున్న సమయంలో ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలకు హెచ్చరించారు. అరటితోటలకు నష్టం వాటిల్లుతుంది. కోతకు సిద్ధంగా ఉన్న పంటలకు నష్టం జరుగుతుందన్నారు. వర్షపు నీళ్లు నిలిచిపోయే చోట ఉండకూడదు. వైర్లు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని సూచించారు. అరటి తోటలకు నష్టం కలిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. చెట్ల కింద నిల్చోకుండా సురక్షిత మైన చోట ఉండాలని ప్రజలను హెచ్చరించారు.