KCR Flag Hosting: స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రం అంతా త్రివర్ణ శోభితంగా మారిందని సీఎం కేసీఆర్ తెలిపారు. గోల్కొండ కోటపై జాతీయ జెండాను ఎగుర వేసి జెండా వందనం చేశారు. ఈ సందర్భంగా పోలీసుల నుంచి గౌరవ వందనం స్కీరచించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తి అవుతున్న సందర్భంగా ప్రతి ఇంటిపై జెండా ఎగుర వేయాలని ప్రభుత్వం పిలుపునిచ్చిందని.. ఈ క్రమంలోనే ఉచితంగా జెండాలు పంపిణీ చేసిందని తెలిపారు. అలాగే ప్రతీ భారతీయుడి హృదయం ఉప్పొంగే సమయం ఇది అని సీఎం కేసీఆర్ వివరించారు. తెంలగాణ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.25 కోట్ల జెండాలను ప్రతీ ఇంటికి ఇచ్చినట్లు వివరించారు. మహనీయుల త్యాగాల వల్లే స్వాతంత్ర్య ఫలాలు అనుభవిస్తున్నట్లు పేర్కొన్నారు. 


అన్ని రంగాల్లో అగ్రగామిగా తెలంగాణ..


మహనీయుల పోరాటాలు భారతీయుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతాయని సీఎం కేసీఆర్ అభివర్ణించారు. రాష్ట్ర ప్రజలంతా కలిసి అహింసా తెలంగాణను సాధించుకున్నామని.. రాష్ట్రం ప్రగతి పథంలో పయనిస్తుందని తెలిపారు. కొట్లాడి సంపాదించుకున్న తెలంగాణ పలు రాష్ట్రాలకు దిక్సూచిగా మారింది. ఎన్నో అపూర్వ విజయాలను సొంతం చేసుకుంటోందని వివరించారు. రాష్ట్రం బలీయమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతోందని వివరించారు. గ్రామీణ జీవన విధానంలో కూడా అగ్ర స్థానంలో నిలిచినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్ అందిస్తున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. సాగులో 11.6 శాతం వృద్ధి రేటు సాధించినట్లు వివరంచారు. అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిచిందన్నారు. 11.1 శాతం వృద్ధి రేటుతో పారిశ్రామిక ప్రగతిలో అగ్ర స్థానంలో ఉన్నామని వివరించారు. గొర్రెల పెంపకంలో కూడా నెంబర్ వన్ గా నిలిచామని హర్షం వ్యక్తం చేశారు. 


నేటి నుంచి మరో 10 లక్షల మందికి పింఛన్లు.. 
ప్రజా సంక్షేమమే ప్రభుత్వాల ప్రధాన బాధ్యత అని సీఎం కేసీఆర్ వివరించారు. తెలంగాణ ప్రభుత్వం సంక్షేమానికి పెద్ద పీట వేసిందన్నారు. ప్రతి వర్గాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నామని తెలిపారు. నేటి నుంచి మరో 10 లక్షల మందికి ఆసరా పథకం కింద పింఛన్లు అందేస్తున్నామని వివరించారు. దీంతో రాష్ట్రంలో ఆసరా పింఛన్ దారుల సంఖ్య 46 లక్షలకు చేరుకుంటుందని వెల్లడించారు. దేశం ఎస్సీ వర్లం పట్ల నేటికీ వివక్ష కొనసాగిస్తోందని.. కానీ రాష్ట్రంలో మాత్రం ఎస్సీల అభివృద్ధే ధ్యేయంగా దళిత బంధు పథకం తెచ్చినట్లు పేర్కొన్నారు. దళిత బంధు పథకం దేశానికే దిశానిర్దేశం చేస్తుందని వివరించారు. దళిత బంధు లబ్ధిదారుల భాగస్వామ్యంతో దళిత రక్షణ నిధి ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. 


గొర్రెల పంపీణీ వల్లే పెంపకంలో నెంబర్ వన్ గా.. 
రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంత ప్రజలు, వ్యవసాయ రంగం మీద కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. దాని అనుబంధ రంగాల్లో అత్యధిక అభివృద్ధి సాధ్యం అయిందని వివరించారు. కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ ద్వారా ఆడ పిల్లల పెళ్లిళ్లకు ఆర్థిక సాయం అందజేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ పథకాల కింద ఇప్పటి వరకు 11.24 లక్షల మందికి రూ.9,176 కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు. గొల్ల, కుర్మలకు పెద్ద ఎత్తున గొర్రెలు పంపీణీ చేయడం వల్ల దేశంలోనే గొర్రెల పెంపకంలో నెంబర్ వన్ గా నిలిచినట్లు వివరించారు.   



ప్రగతి భవన్ లో జెండా ఎగురవేసిన సీఎం కేసీఆర్..


గోల్కొండ కోటలో కంటే ముందు ప్రగతి భవన్ లో జెండా ఎగుర వేశారు. జెండా వందనం చేసి ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.