Telangana News: ఈసారి నీట్ (NEET) పరీక్షా పేపర్ చాలా ఈజీగా రావడంతో పెద్దసంఖ్యలో ర్యాంకులు సాధించారు. టాప్‌ ర్యాంకులన్నీ తెలుగు విద్యార్థుల ఖాతాలోనేపడ్డాయి. అయితే మంచి ర్యాంకు వచ్చిందని అప్పుడే సంబరపడిపోకండి...ఎందుకంటే ఎక్కువ మందికి మంచి ర్యాంకులు రావడంతో ఎంబీబీఎస్‌(MBBS) ప్రవేశాలకు పోటీ విపరీతంగా పెరిగిపోయింది. దాంతో కన్వీనర్‌ కోటా సీట్లు అంత ఈజీగా దక్కేట్లు కనిపించడం లేదు.


వైద్య సీట్లకు పెరిగిన పోటీ
నీట్‌ ర్యాంకు సాధించిన ఆనందం అప్పుడే ఆవిరైపోతోంది.పేపర్ కొంచెం ఈజీగా రావడంతో విద్యార్థులు మంచి మార్కులే సాధించారు. అయితే పోటీ పరీక్షల్లో పేపర్ ఈజీగా వస్తే పోటీ కూడా పెరుగుతుందన్న ఆలోచన ఉండాలి. అందరూ మంచి మార్కులు,ర్యాంకులు సాధించడంతో MBBS సీట్లకు పోటీ పెరిగింది. ఫలితంగా కన్వీనర్ కోటా (Convenor Quota)  సీట్లు అంతా ఈజీగా వచ్చే సూచనలు కనిపించడం లేదు. గతేడాది 450 మార్కులు ఉన్నా వైద్య కళాశాలల్లో కన్వీనర్ కోటా సీటు దక్కింది. కానీ ఈసారి 490 మార్కులు వస్తే తప్ప సీటు దక్క సూచనలు కనిపిచండం లేదు. ఏటా నీట్‌ రాసే వారి సంఖ్య పెరుగుతోంది. ఒక్క తెలంగాణ నుంచే 47,371 మంది ఉత్తీర్ణత సాధించారు. అంటే పరీక్షకు హాజరైన వారిలో దాదాపు 60శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. గతేడాది ఇది 58 శాతం మాత్రమే ఉంది. అలాగే గతేడాది వందశాతం పర్సంటైల్ సాధించిన వారు ఇద్దరే ఉండగా..ఈసారి ఆ సంఖ్య 67కు చేరిందంటే పోటీ ఏస్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆలిండియా టాప్ ర్యాంకర్లలో తెలంగాణ(Telangana)కు చెందిన వారు ఒక్కరే ఉన్నా...700 మార్కులకు పైగా వచ్చిన వారు వందమంది ఉన్నారు. అలాగే 600 మార్కులకు పైగా వచ్చిన వారి సంఖ్య వెయ్యి దాటేసింది. దీంతో కన్వీనర్ కోటాకు విపరీతమైన పోటీ ఏర్పడింది.


తెలంగాణలో కళాశాలలు, సీట్లు
తెలంగాణ (Telangana)లో మొత్తం ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య కళాశాలన్నీ కలిపి 56 ఉండగా...వీటిల్లో 8,490 వైద్య సీట్లు ఉన్నాయి. మరో వారం రోజుల్లో స్టేట్‌ ర్యాంకులు రానున్నాయి. ఆ తర్వాత కాళోజీ యూనివర్సిటీ ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ప్రభుత్వ కళాశాలల్లో 15 సీట్లను ఆలిండియా కోటాకు ఇవ్వనున్నారు. మిగిలినవరి కన్వీనర్ కోటా పరిధిలోకి వస్తాయి. ప్రైవేట్ కళాశాలల్లో(Private Colleges) మాత్రం 50 సీట్లనే కన్వీనర్ కోటా కింద భర్తీ చేయనున్నారు. అయితే ఈసారి 490 నుంచి 500 మధ్య మార్కులు వస్తే తప్ప కన్వీనర్ కోటా దక్కే అవకాశాలు కనిపించడం లేదు. గతేడాదితో పోలిస్తే దేశవ్యాప్తంగా 16.85శాతం అధికంగా ఉత్తీర్ణత సాధించారు. ఈసారి 480 మార్కులు వచ్చిన విద్యార్థికి ఆలిండియాస్థాయిలో రెండున్నర లక్షల ర్యాంకు వచ్చింది. అదే గతేడాది అయితే 1.30 లక్షల ర్యాంకే వచ్చింది. ఇది విద్యార్థుల్లో ఆందోళన కలిగిస్తోంది.


ఫలితాలపై అనుమానాలు
ఒకే సెంటర్‌లో పరీక్షలు రాసిన ఆరుగురికి టాప్‌-1తోపాటు మరో ఇద్దరికి ఆ తర్వాత ర్యాంకులు రావడం అనుమానాలకు తావిస్తోంది. పైగా 67 మంది వందపర్సంటైల్ ర్యాంకు రావడంపైనా విమర్శలు వినిపిస్తున్నాయి. నీట్ పరీక్ష రద్దు చేసి మళ్లీ నిర్వహించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయితే సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారమే గ్రేస్ మార్కులు ఇచ్చినట్లు ఎన్‌టీఏ స్పష్టం చేసింది. అయితే నీట్ పరీక్ష రద్దు చేయాలంటూ  కొందరు విద్యార్థులు సుప్రీంను ఆశ్రయించారు. దీనిపై త్వరలోనే విచారణ జరగనుంది.