Fish Prasadam: మృగశిర కార్తె రానుండటంతో హైదరాబాద్(Hyderabad)లో చేప మందు ప్రసాదం అందించేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఆస్తమా సహా శ్వాసకోస సంబంధిత ఇబ్బందులు ఉన్నవారికి బత్తినసోదరుల(Bathini Brothers) ఆధ్వర్యంలో కొన్నేళ్లుగా ఈ చేపమందును ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. అందులో భాగంగానే ఈఏడాది సైతం చేపప్రసాదం అందించనున్నారు.
చేప ప్రసాదం పంపిణీ
మృగశిరకార్తె ప్రారంభం కానుండటంతో ఈనెల 8 నుంచి నాంపల్లి(Nampally)లోని ఎగ్జిబిషన్ మైదానంలో చేపమందు ప్రసాదం(Fish Medicine) పంపిణీ చేయనున్నారు. బత్తిన కుటుంబం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏటా పెద్దఎత్తున నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది కూడా చేపమందు అందించనుండటంతో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఆస్తమా ఉన్న రోగులకు ఈ చేపమందు దివ్య ఔషధంలా పనిచేస్తుందన్న ప్రచారం నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల నుంచేగాక...మహారాష్ట్ర, కర్ణాటక నుంచీ పెద్దఎత్తున ప్రజలు తరలివస్తుంటారు. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానం(Nampally Exhibition Ground)లో కౌంటర్లు ఏర్పాటు చేసి వరుస క్రమంలో ఈ మందు అందజేస్తారు. మృగశిరకార్తె రోజు అందించే ఈ చేపమందు ప్రసాదం కోసం ముందురోజు రాత్రికే వచ్చి క్యూలైన్‌లోనే వేచి ఉంటారు. అందుకు అనుగుణంగా అధికారులు లైట్లు,బారీకేడ్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. బత్తిన కుటుంబం(Bathini Family) కొన్ని దశాబ్దాలుగా ఈ చేపమందును ఉచితంగా అందజేస్తోంది. బత్తిన శంకర్‌గౌడ్ వాళ్ల తాతకు ఓ సాధువు ఈ మందు తయారీ విధానం నేర్పించి ఉచితంగా అందజేస్తే కుటుంబానికి మేలు జరుగుతుందని చెప్పడంతో అప్పటి నుంచి ఈ చేపప్రసాదం అందజేస్తున్నారు. ఇటీవలే హరినాథ్‌గౌడ్ మరణించినా... ఆయన కుటుంబ సభ్యులు ఈ ఏడాది చేపమందు పంపిణీ చేయనున్నారు.
సహజసిద్ధ మూలికలతో ప్రసాదం
ఈ చేపప్రసాదాన్ని ఆయుర్వేద మూలికలతోపాటు పాలపిండి, ఇంగువా, బెల్లం, పసుపు మిశ్రమంతో తయారు చేస్తారు. కేవలం బావిలో ఊరిన నీటినే ఇందులో వినియోగిస్తారు. ఈ మిశ్రమాన్ని బతికి ఉన్న కొర్రమీను చేపపిల్లల నోటిలో పెట్టి ఉబ్బసం రోగం ఉన్న వారితో వాటిని నేరుగా మింగిస్తారు. అయితే తొలుత దీన్ని చేపమందుగా ప్రచారం చేసేవారు. దీనిపై ఎన్నో వివాదాలు నడిచాయి. అసలు ఇది మందే కాదని...ఉబ్బసం వ్యాధి తగ్గిస్తుందని చెప్పడానికి ఎలాంటి శాస్త్రీయ కారణాలు లేవని జనవిజ్ఞాన సంస్థ వంటివి ఆందోళనలు నిర్వహించాయి. అయినప్పటికీ బత్తిన కుటుంబం అందించే ఈ చేపమందు కోసం జనం తండోపతండాలుగా తరలివచ్చేవారు. కొన్నిసార్లు తోపులాటలు చోటుచేసుకుని పలువురు మృతిచెందిన ఘటనలు కూడా ఉన్నాయి. వ్యవహారం కోర్టు మెట్లెక్కింది. ఈ మందులో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేకపోవడంతో దీన్ని చేపమందుగా పిలవకూడదంటూ ఆదేశాలు జారీ చేసింది. కోర్టు సూచన మేరకు అప్పటి నుంచి దీన్ని చేపప్రసాదంగా అందజేస్తున్నారు.
వేలాది మంది రాక
హైదరాబాద్(Hyderabad) ఎగ్జిబిషన్ మైదానంలో పంపిణీ చేసే ఈ చేపప్రసాదం కోసం ఏటా వేలాది మంది తరలివస్తుంటారు. అయితే చేపప్రసాదంలో వాడే మిశ్రమాన్ని మాత్రం బత్తిన కుటుంబం ఉచితంగానే అందిస్తున్నా...చేపలను మాత్రం ఎవరికి వారే సొంతంగా తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ఎగ్జిబిషన్ మైదానం ఆవరణలోనే ప్రత్యేక స్టాళ్లలో కొర్రమీను చేపపిల్లలను విక్రయిస్తుంటారు. మృగశిరకార్తె నుంచి వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటాయి. వర్షాలు పడుతుండటంతో పాటు చల్లగాలులకు ఆస్తమా రోగులు ఇబ్బందిపడుతుంటారు. అందుకే మృగశిరకార్తె ప్రారంభం రోజే ఈ మందు పంపిణీ చేస్తుంటారు.