Rohit Sharma Forgets Name Of Player At Toss During IND vs IRE : టీ 20 ప్రపంచకప్(T20 World Cup 2024)లో జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా(Team India) కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) మరోసారి గజినీలా మారిపోయాడు. ఐర్లాండ్(IRE)తో జరిగిన మ్యాచ్‌లో టాస్ కోసం వెళ్లిన సారధి రోహిత్‌శర్మ... జట్టులోని ఆటగాడి పేరు మర్చిపోయాడు. దీంతో ఈ వీడియో.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గతంలోనూ టాస్‌కు వెళ్లిన సందర్భంలో రోహిత్ జట్టులోని ఆటగాడి పేరును మర్చిపోయిన ఘటనలను అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి సరదగా నవ్వుకుంటున్నారు.
అసలు ఏమైందంటే...
టీ 20 ప్రపంచకప్‌లో ఐర్లాండ్‌తో జరిగిన తొలి పోరులో టాస్ గెలిచిన రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. అయితే టాస్ సందర్భంగా రోహిత్ మరోసారి తన మతిమరుపు ప్రదర్శించాడు. జట్టులో ఎవరెవరు ఉన్నారన్న దానిపై మాట్లాడుతూ రోహిత్ ఒకరి పేరును మర్చిపోయాడు. ఇలా పేరు మర్చిపోవడంపై రోహిత్ గట్టిగా నవ్వేశాడు. తాము తొలుత బౌలింగ్ చేయబోతున్నామని.. ఈ మ్యాచ్ కోసం బాగానే సన్నద్ధమయ్యామని ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన తర్వాత రోహిత్ తెలిపాడు. న్యూయార్క్‌లోని కొత్త పరిస్థితులకు తాము అలవాటు పడుతున్నామని... సవాళ్లను స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నామని హిట్ మ్యాన్ వెల్లడించాడు. తాము అలవాటుపడిన పిచ్‌ల కంటే ఈ పిచ్ కాస్త భిన్నంగా ఉంటుందని తమకు తెలుసన్నాడు. కుల్‌దీప్, సంజు శాంసన్, జైస్వాల్‌లతో పాటు మరొకరిని జట్టులోకి తీసుకోలేదని రోహిత్ తెలిపాడు. ఇలా ఒక వ్యక్తి పేరు భారత సారధి మర్చిపోవడంతో నెటిజన్లు ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. రోహిత్ మరో గజినీలా మారాడని ఒకరు... హిట్ మ్యాన్‌కు ఇది అలవాటే అని మరొకరు పోస్ట్‌లు పెడుతున్నారు.
శుభారంభం
టీ 20 ప్రపంచకప్‌లో టీమిండియా శుభారంభం చేసింది. పసికూన ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘన విజయం సాధించి.. టీ 20 ప్రపంచకప్ వేటను ఘనంగా ఆరంభించింది. తొలుత బంతితో ఐర్లాండ్‌ను బౌలర్లు వణికించగా... ఆ తర్వాత బ్యాటర్లు మిగిలిన పనిని పూర్తి చేశారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ భారత బౌలర్ల ధాటికి 16 ఓవర్లలో కేవలం 96 పరుగులకే కుప్పకూలింది. అనంతరం 97 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 12.2 ఓవర్లలో కేవలం రెండే వికెట్లు కోల్పోయి సునాయసంగా లక్ష్యాన్ని ముద్దాడింది. రోహిత్ శర్మ అర్ధ శతకంతో చెలరేగగా... రిషభ్ పంత్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అయితే ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ భుజం నొప్పితో రిటైర్డ్‌గా వెనుదిరగడం అభిమానుల్లో ఆందోళనను పెంచింది. జాషువా లిటిల్ వేసిన బంతి అనూహ్యంగా స్వింగ్ అయి రోహిత్ ఎడమ మోచేయిపై బలంగా తాకింది. రోహిత్‌ను ఫిజియో పరీక్షించిన తర్వాత రోహిత్ మైదానాన్ని వీడాడు. అయితే రోహిత్ శర్మ మ్యాచ్ పూర్తయిన తర్వాత స్పష్టత ఇచ్చాడు. బంతి తగిలిన తర్వాత భుజం కాస్త నొప్పిగా అనిపించిందని అందుకే ముందు జాగ్రత్తగా రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగానని రోహిత్ క్లారిటీని ఇచ్చాడు.