హైదరాబాద్ కేంద్రంగా ఉన్న వసుధ గ్రూప్ సంస్థల ఆఫీస్‌ల్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. వసుధ గ్రూప్ సీఈవో, డైరెక్టర్లు, మేనేజింగ్ డైరెక్టర్ల ఇళ్లలో కూడా తనిఖీలు కొనసాగుతున్నాయి. ఎస్.ఆర్ నగర్‌లో ప్రధాన కార్యాలయంతో పాటు పలు ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్ లోని మాదాపూర్, ఎస్‌ఆర్ నగర్, జీడిమెట్లలోని కంపెనీ కార్యాలయాల్లో 40కి పైగా బృందాలుగా విడిపోయి ఐటీ సోదాల్లో పాల్గొన్నారు.


కొద్ది వారాల క్రితం వరకూ తెలంగాణలో ఈడీ, ఐటీ, సీబీఐ అధికారులు ఢిల్లీ లిక్కర్ కేసు సహా రకరకాల కేసుల్లో వేర్వేరు సందర్భాల్లో మంత్రులు, వ్యాపార వేత్తల ఇళ్లలో సోదాలు చేసిన సంగతి తెలిసిందే. మళ్లీలో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ సోదాల కలకలం రేగింది. మంగళవారం ఉదయం నుంచే తనిఖీలు మొదలయ్యాయి. ప్రముఖంగా హైదరాబాద్‌లోని వసుధ ఫార్మా కెమ్ లిమిటెడ్‌తో పాటు పలు చోట్ల కొనసాగుతున్నాయి. 


వెంగళరావు నగర్ లో రెండు టీమ్ లు, మాదాపూర్ లోని మరో కార్పొరేట్ కార్యాలయంలో నాలుగు టీమ్ లు సోదాలు చేస్తున్నాయి. వసుధ ఫార్మా  ఛైర్మన్ వెంకటరామరాజుతో పాటు డైరెక్టర్ ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. వసుధ ఫార్మా పేరుతోనే ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. సుమారు 15 కంపెనీల పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఫార్మా కంపెనీ నుంచి వచ్చిన లాభాలతో రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టినట్లు తేలింది. గతంలో పలు రియల్ ఎస్టేట్ కార్యాలయాలపై జరిపిన దాడుల్లో చాలా పెట్టుబడులకు సంబంధించిన ఆధారాలు లభించగా వాటిని ఆధారంగా చేసుకొని ఇప్పుడు ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు.