Telangana Rains News: హైదరాబాద్: జూన్ నెల 1న నైరుతి ఋతుపవనాలు కేరళలోని మరికొన్ని ప్రాంతాలకు, తమిళనాడులోకి ప్రవేశించాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సాధ్యమైనంత త్వరగా నైరుతి పవనాలు వచ్చే అవకాశం ఉందని అందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదివారం (జూన్ 2న) హైదరాబాద్ లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. సాయంత్రం దాటిన తరువాత కొన్ని ప్రాంతాల్లో లేకపోతే రాత్రివేళ నగరంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది. ఐఎండీ ప్రకటన వచ్చిన కొన్ని గంటలకే హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు ప్రారంభమయ్యాయి. ఒక్కసారిగా పగటి ఉష్ణోగ్రతలు దిగి రావడంతో ప్రజలకు ఎండల నుంచి ఉపశమనం కలగనుంది.
తెలంగాణలో కొన్ని జిల్లాలకు వర్ష సూచన ఉండటంతో ఇదివరకే ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం. ఉపరితల ఆవర్తనం ఏపీలో సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో కేంద్రీకృతమై ఉంది. దాని ప్రభావంతో పశ్చిమ, వాయువ్య దిశల నుంచి బలమైన గాలులు వీచనున్నాయి. ఉత్తర తెలంగాణ ప్రాంతం మినహా మిగిలిన జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.
హైదరాబాద్‌కు ఐఎండీ ఎల్లో అలర్ట్
హైదరాబాద్‌కు వర్ష సూచన ఉండటంతో జూన్ 4, జూన్ 5వ తేదీల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఉత్తర తెలంగాణ మినహా ఇతర జిల్లాలకు జూన్ 6 వరకు ఎల్లో అలర్ట్ ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. కాగా, ఆదివారం నాడు నగరంలోని ఎల్‌బీ నగర్, సికింద్రాబాద్, శేరిలింగంపల్లి, చార్మినార్, ఖైరతాబాద్, కూకట్‌పల్లి, జోన్‌లో సాయంత్రం దాటిన తరువాత ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గత నాలుగైదు రోజులుగా తీవ్రమైన ఎండలతో తల్లడిల్లిపోతున్న హైదరాబాద్ వాసులకు వర్షాలతో ఉపశమనం కలగనుంది.
హైదరాబాద్ లోని దమ్మాయిగూడ, కాప్రా, ఏఎస్ రావ్ నగర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో వర్షం పడుతోందని స్థానికులు వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. జిల్లాలు చూస్తే.. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ములుగు, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయి. ఇదివరకే ఉమ్మడి ఆదిలాబాద్, నల్గొండ జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి.
జూన్ 6 తర్వాత హైదరాబాద్ సహా తెలంగాణలోని ఇతర జిల్లాల్లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నాయని ఐఎండీ అంచనా వేసింది. జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య కురిసే వర్షాలు నైరుతి రుతుపవనాల కారణంగా పడతాయని తెలిసిందే. వీటి ప్రభావంతో అక్టోబర్ లోనూ కొంతమేర వర్షాలు కురవనున్నాయి. వేసవి ఎండ కష్టాలు తొలగిపోయాయని, వర్షాకాలం మొదలవుతుందని హైదరాబాద్ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చిరుజల్లుల కోసం ఆశగా ఎదరుచూస్తున్నారు.