Hydraa:చెరువులు,కుంటలు పూడ్చి చేపట్టిన నిర్మాణాలపై ఉక్కుపాదం మోపి ఆక్రమణదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన హైడ్రా(Hydraa) కొంతకాలంగా  స్తబ్ధతగా ఉంది. భారీ యంత్రాలతో పెద్ద పెద్ద భవనాలు కూల్చివేసి హడావుడి సృష్టించడంతో...భూకబ్జాదారులతోపాటు సామాన్య ప్రజల్లోనూ కొంత భయాందోళన నెలకొనడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. పులిదాడి చేసేందుకు రెండడుగులు వెనక్కి తగ్గిననంత మాత్రానా.... చర్యలు ఆపినట్లు కాదని హైడ్రా అడపాదడపా హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంది. నేరుగా చర్యలు తీసుకుంటే అటు న్యాయస్థానాలతోనూ, విపక్షాలతోనూ ఇబ్బందులు ఎదురవుతున్నాయని గమనించిన  హైడ్రా కమిషనర్ రంగనాథ్‌(Ranganath)....ప్రజల నుంచే నేరుగా  ప్రజావాణి ద్వారా  ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. తదనుగుణంగా చర్యలు తీసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

 

హైడ్రా ప్రజావాణి

ఒకప్పుడు చెరువులు,కుంటలతో కళకళలాడిన భాగ్యనగరంలో ఇప్పుడు ఆ చెరువులు కనుమరుగయ్యాయి. ఇక్కడ ఒకప్పుడు  చెరువు ఉండేది అని చెప్పుకోవడమే తప్ప...వాటి ఆనవాళ్లు కూడా ఏమాత్రం లేకుండా పూడ్చివేసి స్థిరాస్తి(Real Estate) వెంచర్లు వేసి నిర్మాణాలు చేపట్టేస్తున్నారు. పార్కులు(Parks),ఖాళీస్థలాలు, ప్రభుత్వ భూములను యథేచ్ఛగా ఆక్రమించడంపై ప్రకృతి ప్రేమికులు, పర్యావరణవేత్తలు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి వారు గతంలో అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇప్పుడు హైడ్రా(Hydraa)రూపంలో వారికి కొత్త వేదిక కనిపించింది. అలాంటి వారి కోసం హైడ్రా సైతం ప్రజావాణి(PrajaVani) పేరిట ఫిర్యాదులు స్వీకరిస్తోంది. సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 71 ఫిర్యాదులు అందాయి. అందులో ముఖ్యంగా  రహదారులు కబ్జా చేశారంటూ వచ్చిన ఫిర్యాదులపై హైడ్రా కమిషనర్  వెంటనే స్పందించారు. తక్షణం  రహదారుల కబ్జాలను తొలగించాలని ఆదేశించారు.

గేటెడ్ కమ్యూనిటీల మాదిరి కాలనీల చుట్టూ రహదారులు నిర్మించిన పక్షంలో వాటిని వెంటనే తొలగించాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్(Ranganath) ఆదేశించారు. లేఔట్‌ల ప్రకారమే రహదారులు ఉండాలని...అలా కాకుండా స్థిరాస్తి వెంచర్ల కోసం ఇష్టానుసారం రోడ్లు నిర్మిస్తే  తొలగిస్తామని హెచ్చరించారు. మొత్తం ఫిర్యాదుల్లో అధికభాగం పార్కులు, రహదారులు కబ్జాలే  ఉన్నాయన్నారు. సోమవారం హైడ్రా నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 71కి పైగా ఫిర్యాదులు వచ్చాయని...వీటిపై అక్కడికక్కడే హైడ్రా అధికారులతో చర్చించి చర్యలు తీసుకోవాలని కమిషనర్ రంగనాథ్ ఆదేశాలు జారీచేశారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా  గూగుల్ మ్యాప్స్‌(Google Maps) పరిశీలించి పదేళ్ల క్రితం ఆ ప్రాంతం ఎలా ఉందో నిర్థారించుకున్న  తర్వాతే చర్యలకు ఆదేశిస్తున్నారు. ఫిర్యాదు దారులకు  కూడా  ఆ ఫొటోలు చూపించి సమస్య పరిష్కారానికి సూచనలు  ఇచ్చారు. ఫిర్యాదుదారులకు హైడ్రా అధికారులను పరిచయం చేసి వారు ఆయా ప్రాంతాలకు విచారణకు  వచ్చినప్పుడు అన్ని వివరాలు అందజేయాలని సూచించారు. 

 

హైడ్రా కమిషనర్ మండిపాటు 

ఒకప్పుడు సెప్టిక్ ట్యాంకుల కోం ప్రభుత్వం కొన్ని స్థలాలను కేటాయించిందని... ఇప్పుడు అవి వినియోగంలో లేకపోవడంతో కొందరు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని హైడ్రా కమిషనర్ మండిపడ్డారు. వినియోగంలో లేకపోయినా...వాటిని ప్రజా అవసరాలకు కేటాయించిన స్థలాలుగానే పరిగణించాలని వాటిని కబ్జా చేస్తే వెంటనే తొలగించాలని అధికారులను కమిషనర్  రంగనాథ్ ఆదేశించారు. 

ఇటీవల ప్రజావాణి ద్వారా ఫిర్యాదులు స్వీకరించిన హైడ్రా...వాటిపై విచారణ జరిపి చర్యలకు ఉపక్రమించింది. రెండు వారాలుగా చెరువులు, పార్కులు, ప్రభుత్వ స్థలాల్లోని ఆక్రమణల్ని నేలమట్టం చేస్తోంది.

అలాగే  చెరువుల పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం, బఫర్‌ జోన్‌ల నిర్థారణపైనా  హైడ్రా అధికారులు దృష్టి సారించారు. సర్వే ఆఫ్‌ ఇండియా, నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌, రెవెన్యూ లెక్కల ఆధారంగా వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేస్తున్నారు.  ముందుగా  ఔటర్‌ రింగ్‌ రోడ్డు వరకు ఉన్న చెరువుల లెక్కలు తేల్చనున్నారు. శాటిలైట్‌ చిత్రాల  ఆధారంగా  గతంలో చెరువు విస్తీర్ణం ఎంత ఉండేది...ఇప్పుడు ఏమేరకు ఉందన్నది అంచనా వేస్తున్నారు. మున్ముందు న్యాయపరమైన చిక్కులు ఎదురుకాకుండా ఈ ప్రక్రియ మొత్తం శాస్త్రీయంగా నిర్వహిస్తున్నారు.