HYDRA submits report to Telangana Govt over demolitions in Hyderabad | హైదరాబాద్: హైదరాబాద్ పరిధిలో చెరువులు, ఇతర జలాశయాల పరిధిలోని భూముల రక్షణకు తెలంగాణ ప్రభుత్వం హైడ్రా అనే వ్యవస్థను ఏర్పాటు చేయడం తెలిసిందే. ఎవరైనా చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో నిర్మాణాలు చేపట్టినట్లయితే ఇప్పుడే స్వచ్ఛందంగా కూల్చివేతలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించడం తెలిసిందే. సీఎం ప్రకటన చేసిన కొన్ని గంటల్లోనే నగరంలో అక్రమ కట్టడాల కూల్చివేతలపై హైడ్రా కీలక ప్రకటన చేసింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఇప్పటివరకూ మొత్తం 23 ప్రాంతాల్లో 262 అక్రమ నిర్మాణాలను హైడ్రా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఈ కూల్చివేతల ద్వారా 111.72 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నట్లు స్పష్టం చేసింది.
అత్యధికంగా అమీన్ పూర్‌లో భూమి స్వాధీనం
జీహెచ్ఎంసీ పరిధిలో చెరువులు, ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాలను గత రెండు నెలల నుంచి కూల్చివేస్తోంది. సామాన్యులు, సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు అనే వ్యత్యాసం లేకుండా నిబంధనలు అతిక్రమించి చేపట్టిన కట్టడాలను ఒక్కొక్కటిగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ నేతృత్వంలో సిబ్బంది కూల్చివేస్తున్నారు. గగన్ పహాడ్ అప్పా చెరువులో 14, అమీన్‌పూర్ పెద్ద చెరువు పరిధిలో 24, మాదాపూర్ సున్నం చెరువులో 42, దుండిగల్ కత్వా చెరువు పరిధిలో 13, రామ్‌నగర్ మణెమ్మ కాలనీలో 3 అక్రమ నిర్మాణాలను కూల్చివేసినట్లు హైడ్రా బుధవారం నాడు వెల్లడించింది. మాదాపూర్ సున్నం చెరువు పరిధిలో 10 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకోగా, అత్యధికంగా అమీన్‌పూర్‌లో 51 ఎకరాలు స్వాధీనం చేసుకుని ప్రభుత్వానికి అప్పగించినట్లు నివేదికలో హైడ్రా పేర్కొంది.
హైడ్రా పనితీరు, భవిష్యత్ కార్యచరణపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. చేసిన తప్పు ఒప్పుకుంటే ఇక్కడితో పోతుందని, లేకపోతే ఆక్రమణదారులపై ప్రభుత్వం మరింతగా ఉక్కుపాదం మోపుతుందని.. అవసరమైతే జైలుకు పంపుతామని హెచ్చరించారు. ప్రభుత్వం చర్యలు చేపట్టకముందే మేల్కొంటే మాత్రం మీకు మంచిదంటూ ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో నిర్మాణాలు ఉన్న వారికి సూచించారు.
వరదలకు కారణం అదే
హైదరాబాద్‌లోని సర్దార్ పటేల్ పోలీస్ అకాడమీలో పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ హైడ్రాపై క్లారిటీ ఇచ్చారు. కొందరు గిట్టని వారు హైడ్రా వ్యవస్థపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని.. అయితే చెరువులు, కుంటలు, నాలాల పరిధిలోని భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేశారు. కాలువలు, నాలాలు, చెరువుల భూములు ఆక్రమణల వల్లే హైదరాబాద్ లో వరదలు వస్తున్నాయని.. దాంతో ఎందరో పేదల జీవితాలు అతలాకుతలం అవుతున్నాయని చెప్పారు. ఆక్రమణలు తొలగించి మూసీని ప్రక్షాళన చేస్తాం, మూసీ నాలాల్లో ఉన్న శాశ్వత నివాసదారులకు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. నిర్వాసితులకు ప్రభుత్వం పునరావాసం కల్పిస్తుందని సీఎం రేవంత్ భరోసా కల్పించారు. అయితే ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలో నిర్మాణాలను క్రమబద్ధీకరణ చేసే ప్రసక్తే లేదన్నారు.