Rave Party in Hyderabad: హైదరాబాద్ లో రేవ్ పార్టీ దురాచారం ఇంకా కొనసాగుతూనే ఉంది. రాత్రంగా మత్తులో ఊగి తేలడం కోసం సంపన్నులైన యువత ఈ రేవ్ పార్టీలకు విరివిగా హాజరవుతున్నారు. ఇందులో మందుతో పాటు మగువ, మత్తు పదార్థాలు కూడా విచ్చలవిడిగా వాడుతుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. తాజాగా గచ్చిబౌలిలో ఓ రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు.
ఓ గెస్ట్ హౌస్‌లో రేవ్ పార్టీ నిర్వహిస్తున్న వారిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ రేవ్ పార్టీ నిర్వాహకులు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు అని గుర్తించారు. మాదాపూర్ ఎస్‌ఓటీ (స్పెషల్ ఆపరేషన్స్ టీమ్) పోలీసులు ఈ రేవ్ పార్టీని భగ్నం చేశారు. దాదాపు 26 మంది యువత ఈ రేవ్ పార్టీలో పాల్గొన్నట్లుగా పోలీసులు చెబుతున్నారు. వీరిలో 8 మంది అమ్మాయిలు, 18 మంది అబ్బాయిలను పోలీసులు అరెస్టు చేశారు. గంజాయితో పాటు భారీ స్థాయిలో మద్యం కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
వీరు పెద్ద ఎత్తున గంజాయి, మద్యం సేవిస్తున్నట్లుగా పోలీసులు చెబుతున్నారు. ఈ రేవ్ పార్టీ ఎవరు నిర్వహించారు.. గంజాయి ఎక్కడి నుంచి వచ్చింది.. వీరు ఇంకా గతంలో ఎన్నిసార్లు ఇలా రేవ్ పార్టీలు నిర్వహించారు.. అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ పార్టీ వెనుక ఉన్న వారిని పోలీసులు గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.