Hyderabad News: హైదరాబాద్ లో ఓ మెయిల్ యాంకర్ ను ఓ యువతి కిడ్నాప్ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. యువకుడ్ని ఆమె బంధించగా.. అక్కడి నుంచి తప్పించుకున్న బాధితుడు హైదరాబాద్ లోని ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. త్రిష అనే యువతి ప్రణవ్ అనే యువకుడ్ని కిడ్నాప్ చేయించింది. తనను వివాహం చేసుకోవాలని డిమాండ్ చేసింది. నిందితురాలైన సదరు యువతి డిజిటల్ మార్కెటింగ్ బిజినెస్‌ను నడుపుతున్నట్లు తెలుస్తోంది. స్టార్టప్ కంపెనీలకు సీఈవోగా ఉందని తెలుస్తోంది.


ప్రణవ్ అనే యువకుడి ఫోటోలను త్రిష అనే యువతి ఓ ఆన్ లైన్ మ్యాట్రిమోనీ సైట్ లో చూసింది. అనంతరం అతణ్నే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయింది. అయితే, ప్రణవ్ ఫోటోలతో ఉన్న ఆ ప్రొఫైల్ నిజంగా అతనిది కాదని తర్వాత తెలిసింది. సైబర్ కేటుగాళ్లు ప్రణవ్ ఫోటోలతో నకిలీ ప్రొఫైల్ ను క్రియేట్ చేశారు. ఆ ప్రొఫైల్ పిక్ నిజంగానే ప్రణవ్ ది అనుకొని త్రిష అతనిపై ఇష్టం పెంచుకుంది. అలా అతణ్నే పెళ్లి చేసుకోవాలని మనసుపడి ఈ కిడ్నాప్ డ్రామా ఆడినట్లు పోలీసులు చెబుతున్నారు.


ప్రణవ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన ఉప్పల్‌ పోలీసులు త్రిషను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు. త్రిష ఐదు స్టార్ట్ అప్ కంపెనీలకు ఎండీగా ఉంది. ఆమెకు కోట్ల కొద్దీ ఆస్తి ఉందని.. అలాంటిది ప్రణవ్‌ను ఇష్టపడి.. పెళ్లి చేసుకోవాలనుకున్నట్లు పోలీసులు చెప్పారు. అతను నిరాకరించడంతో కిరాయి రౌడీలతో కిడ్నాప్ చేసినట్లు పోలీసులు తెలిపారు.