MLA Lasya Nanditha Died: చిన్నపాటి నిర్లక్ష్యం విలువైన ప్రాణాలను బలి తీసుకుంటుంది. అందుకే కారు నడిపేప్పుడు, కారులో ప్రయాణిస్తున్నప్పుడు తప్పనిసరిగా సీటు బెల్టు పెట్టుకోవాలని, హెల్మెట్ ధరించి బైక్ నడపాలని పదేపదే చెబుతుంటారు. ఇటీవలే పెను ప్రమాదాల నుంచి త్రుటిలో తప్పించుకున్న ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రాణాలు కాపాడుకున్నారు. వారు ప్రయాణిస్తున్న కారు పల్టీలు కొట్టినా సీటు బెల్టు పెట్టుకుని ఉండటంతో ప్రాణాలు కాపాడుకున్నారు. సీటు బెల్టు పెట్టుకోకపోవడం వల్లే కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య(Lasya Nanditha) రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు తెలుస్తోంది.


అజాగ్రత్తే అసలు కారణం..?


హైదరాబాద్(HYD) బాహ్య వలయ రహదారి(ORR)పై జరిగిన రోడ్డు ప్రమాదంలో కంటోన్మెంట్ యువ ఎమ్మెల్యే లాస్య నందిత( Lasya Nanditha) కన్నుమూశారు. సుల్తాన్ పూర్ వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారు డివైడర్ ను ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. లాస్య నందితతో పాటు ఆమె పీఏ, డ్రైవర్ సికింద్రాబాద్ నుంచి సదాశివపేట వెళ్తుండగా కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టింది. కారు అతివేగంతో వెళ్తూ ప్రమాదానికి గురైంది. ప్రమాదం జరిగిన సమయంలో లాస్య నందిత సీటు బెల్టు పెట్టుకోలేదని సమాచారం. అందువల్లే ఆమె తీవ్రంగా గాయపడి కన్నుమూసినట్లు తెలుస్తోంది. అయితే ఇటీవలే ఒకేరోజు జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు ఎమ్మెల్యేలు సురక్షితంగా బయటపడ్డారు.


త్రుటిలో తప్పించుకున్నారు


గత ఆదివారం రాత్రి జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల నుంచి తెలంగాణ ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్(Adluri Laxman) తోపాటు, ఏపీలోని అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్(Gottipati Ravi) ప్రాణాలతో బయటపడ్డారు. వారిరువురు సీటు బెల్టు పెట్టుకోవడంతో వెంటనే కారులోని ఎయిర్ బ్యాగ్ లు ఓపెన్ అవ్వడంతో ప్రాణాలు రక్షించుకున్నారు. తెలంగాణ ప్రభుత్వ విప్‌, ధర్మపురి(Dharmapuri) ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌ (Adluri Laxman)కుమార్‌కు జనగామ జిల్లా ఎండపల్లి మండలం అంబారిపేట వద్ద ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయే క్రమంలో ఆయన ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఎమ్మెల్యేకు స్వల్ప గాయాలయ్యాయి. వారిని వెంటనే కరీంనగర్(Karimnagar) తరలించి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందించారు. ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ హైదరాబాద్ లో పనులు ముగించుకుని ఆదివారం అర్థరాత్రి ధర్మపురి వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఆయన ప్రయాణిస్తున్న కారు లారీని ఢీకొట్టిన తర్వాత పల్టీలు కొడుతూ బోల్తా పడింది. ఆ సమయంలో ఆయన సీటు బెల్టు పెట్టుకుని ఉండటంతో స్వల్ప గాయాలతో బతికపోయారు. అదే రోజు ఏపీకి చెందిన అద్దంకి తెలుగుదేశం ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్(Gottipati Ravi) ప్రయాణిస్తున్న కారు సైతం ప్రమాదానికి గురైంది. ఈ సమయంలో ఆయన కూడా సీటు బెల్టు ధరించి ఉండటంతో ఎయిర్ బ్యాగ్ లు ఓపెన్ అయ్యాయి. దీంతో స్వల్ప గాయాలతో ఆయన కూడా ప్రాణాలు కాపాడుకున్నారు. ఈ రెండు ఘటనల్లోనూ వారు సీటు బెల్టులు ధరించి ఉండటం వల్లే ప్రాణాలు కాపాడుకోగలిగారు. కానీ లాస్య నందిత మాత్రం సీటు బెల్టు పెట్టుకోకపోవడం వల్ల ప్రమాదం జరిగినప్పుడు ఆమె బలంగా కారుకు ఢీకొని రక్తస్రావంతో మృతి చెందారని తెలుస్తోంది. సరిగ్గా పదిరోజుల క్రితమే నల్గొండలో జరిగిన బీఆర్ఎస్ మీటింగ్ కు వెళ్లి వస్తూ ఆమె ప్రమాదానికి గురయ్యారు. ఆ సమయంలో కారు స్వలంగా దెబ్బతిన్నా..ఆమె ప్రాణాలతో బయటపడ్డారు. కానీ పది రోజుల వ్యవధిలోనే మరో ప్రమాదంలో ఆమెను మృత్యువు వెంటాడింది.