MS Dhoni vs Virat Kohli in IPL 2024: ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(Indian Premier League) షెడ్యూల్ విడుదలైంది. మార్చి 22న ఐపీఎల్ మహా సమరం ప్రారంభం కానుంది. దేశంలోనే పూర్తిగా ఐపీఎల్ నిర్వహించనున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఐపీఎల్ 17వ ఎడిషన్ మొదటి 15 రోజుల షెడ్యూల్‌ను మాత్రమే ప్రకటించారు. మార్చి 22 నుంచి ఏప్రిల్ 7వ తేదీ వరకు జరిగే మ్యాచ్‌లను తెలిపారు. చెన్నై సూపర్ కింగ్స్... రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది. ధోనీ, కోహ్లీ మధ్య జరిగే ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా.. ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
ధోనీ వర్సెస్ కోహ్లీ..
చెన్నై చెపాక్ స్టేడియంలో కోహ్లీ టీంకు చాలా చెత్త రికార్డు ఉంది. ఇక్కడ ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు జరిగిన 8 మ్యాచులు ఆడగా కేవలం ఒక్క మ్యాచ్‌లో మాత్రమే బెంగళూరు గెలుపొందింది. ఇక్కడ మొత్తం ధోనీ జట్టు మానియానే నడుస్తుంది. మైదానమంతా పసుపుమయంగా మారుతుంది. 2008లో మాత్రమే బెంగళూరు.. చెన్నైని ఓడించింది. ఆ తర్వాత జరిగిన ఏడు మ్యాచుల్లోనూ చెన్నైపై ఆర్సీబీ గెలవలేదు. ఈ రికార్డే ఆర్సీబీ అభిమానులను సీజన్ ప్రారంభానికి ముందు కలవరపెడుతుంది.
ధోనినే అసలైన సారథి
ఐపీఎల్ ఆల్‌టైమ్ అత్యుత్తమ జట్టు సారథిగా ధోనీ ఎంపికయ్యాడు. 2008లో మొదలై బ్లాక్‌బాస్టర్ లీగ్‌గా మారిన ఐపీఎల్‌లో ఇప్పటిదాకా ఆడిన ఆటగాళ్లతో అత్యుత్తమ జట్టును వసీం అక్రమ్, మాథ్యూ హేడెన్, టామ్ మూడీ, డేల్ స్టెయిన్‌తో కూడిన సెలక్షన్ ప్యానల్.. 70 మంది పాత్రికేయులతో కలిసి ఎంపిక చేసింది. ఈ జట్టులో ధోనితో పాటు సురేశ్ రైనా, ఏబీ డివిలియర్స్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, పొలార్డ్, సునీల్ నరైన్, రషీద్‌ఖాన్, చాహల్, మలింగ, బుమ్రా ఉన్నారు. ఫిబ్రవరి 20, 2024 నాటికి ఐపీఎల్ 16 ఏళ్లు పూర్తి చేసుకోనుంది. ధోని అసలైన సారథి అని. అతడు అందుకోలేని విజయాలు లేవని స్టెయిన్ అన్నాడు. ఐపీఎల్‌లో చెన్నైని ధోనీ నడిపించిన తీరు అద్భుతమని ఈ సెలక్షన్ కమిటీ కొనియాడింది. మెరుగైన జట్టుతోనూ.. సాధారణ జట్టుతోనూ టైటిళ్లు సాధించిపెట్టిన కెప్టెన్ ధోనీ మాత్రమే అని టామ్ మూడీ గుర్తు చేశాడు. రోహిత్ శర్మ కూడా మంచి సారథే కానీ ముంబయి జట్టులో నాణ్యమైన ఆటగాళ్లు చాలామంది ఉన్నారన్నాడు.
చివరి ఐపీఎల్ కాదట
ఇక ధోనీ తన కెరీర్‌లో చివరి ఐపీఎల్‌కు కూడా సిద్ధమైపోయాడని ఊహాగానాలు చెలరేగాయి. అయితే ధోనీకిది చివరి ఐపీఎల్ కాదని టీమిండియా మాజీ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ వ్యాఖ్యానించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఎంఎస్ ధోనికి కొన్నిరోజుల కిందట కలిశానని. పొడవాటి జుట్టు పెంచుతూ కెరీర్ తొలినాళ్లలతో ఉన్న ధోనిలా తయారవుతున్నాడని ధోనీ తెలిపాడు. 40 ఏళ్లు దాటినా పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నాడని... ఫ్రాంఛైజీ కోసం, అభిమానుల కోసం ఇంకొన్ని సీజన్లు ఆడేలా అతడు కనిపిస్తున్నాడని పఠాన్ వ్యాఖ్యానించాడు. ఐపీఎల్ 2023 తరువాత ధోనీ ఐపీఎల్ నుంచి తప్పుకుంటారని ప్రచారం జరిగింది. గతేడాది టోర్నీ సమయంలో ధోనీ మోకాలి గాయంతో తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. ఐపీఎల్ 2024 టోర్నీలో ఎంఎస్ ధోనీ పాల్గొనడంపై సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే ధోనీ ఫిట్ గా ఉన్నాడని, రాబోయే సీజన్ లో ఐదుసార్లు విజేతగా నిలిచిన సీఎస్కే జట్టుకు నాయకత్వం వహిస్తాడని చెన్నై సూపర్ కింగ్స్ సీఈఓ కాశీ విశ్వనాథన్ స్పష్టం చేశాడు. ఇప్పుడు ధోనీ ప్రాక్టీస్ మొదలెట్టడంతో అనుమానాలన్నీ పటాపంచలు అయిపోయాయి.