తెలంగాణలో నిర్వహిస్తున్న పోలీస్ రిక్రూట్‌మెంట్ ఫిజికల్ ఈవెంట్స్‌లో విషాదం చోటుచేసుకుంది. హైదరాబాదులో శనివారం జరిగిన పోలీస్ ఈవెంట్లలో పాల్గొని కుప్పకూలిన యువకుడు ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దాంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో విషాదం నెలకొంది. ప్రభుత్వ కొలువు, అందులోనూ పోలీస్ జాబ్ కొట్టాలని నగరానికి వచ్చిన యువకుడి కథ విషాదాంతమైంది. పోలీస్ జాబ్ ప్రిలిమినరీ పరీక్షలో పాసయ్యాడు. ఈవెంట్లు పూర్తి చేయాలని హైదరాబాద్ లోనే శిక్షణ తీసుకుంటూ ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ అయ్యాడు. కానీ ప్రభుత్వ కొలువు కల కోసం ప్రయత్నించిన యువకుడు 26 ఏళ్లకే ప్రాణాలు కోల్పోయాడు. కొన్ని నెలల్లో కొడుకు ఖాకీ డ్రెస్ లో కనిపిస్తాడని, తమకు ఆసరాగా ఉంటాడని భావించిన కుటుంబానికి ఊహించని షాక్ తగిలింది.


అసలేం జరిగిందంటే.. 
ఉమ్మడి కరీంనగర్ జిల్లా మహాముత్తారం మండలానికి చెందిన లింగమల్ల మహేష్ అనే యువకుడు హైదరాబాదులో నేడు జరిగిన పోలీస్ ఈవెంట్లలో పాల్గొని 1600 మీటర్లు కంప్లీట్ చేశాడు. ఈ వెంటనే ఛాతీలో నొప్పి రావడంతో ఆకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. మహేష్ ను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. డాక్టర్ల ప్రయత్నాలు ఫలించలేదు. చికిత్స పొందుతూ మహేష్ ప్రాణాలు కోల్పోయాడు. ఇప్పటికే  ప్రిలిమ్స్ లో అర్హత సాధించిన మహేష్ చివరికి  ఈవెంట్స్ కంప్లీట్ చేసి ప్రాణాలు కోల్పోవడం అందరిని విషాదంలోకి నెట్టేసింది. మొదటినుండి మండలంలో జరిగే పలు క్రీడా, సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే మహేష్ మృతిని కుటుంబ సభ్యులు బంధువులు స్నేహితులు నమ్మలేకపోతున్నారు.


ఈవెంట్స్ ప్రాక్టీస్ చేస్తూ గుండెపోటుతో ఎస్ఐ అభ్యర్థి మృతి
గవర్నమెంట్ జాబ్, అందులోనూ ప్రజలకు నిత్యం సేవలు అందించే పోలీస్ శాఖలో కొలువు సాధించాలని కలలు కన్నాడు. అందుకోసం ఆ యువకుడు నిరంతరం శ్రమించాడు. సబ్ ఇన్‌స్పెక్టర్ జాబ్ కొట్టి తల్లిదండ్రుల కళ్లల్లో ఆనందం చూడాలనుకున్నాడు. కానీ విధి వక్రించింది. ఈవెంట్స్ ప్రాక్టీస్ చేస్తుంటే గుండెపోటు రావడంతో ఓ యువకుడు మృతి చెందాడు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో నవంబర్ రెండో వారంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
సమర్తపు లక్ష్మయ్య తన కుటుంబంతో సూర్యాపేట పట్టణ కేంద్రంలోని ఇందిరమ్మ కాలనీ‌లో నివాసం ఉంటున్నాడు. లక్ష్మయ్య కుమారుడు శ్రీకాంత్ పోలీస్ కావాలని, సబ్ ఇన్‌స్పెక్టర్ జాబ్ కోసం ప్రయత్నిస్తున్నాడు. తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు కొన్ని నెలల కిందట నిర్వహించిన ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించాడు. ప్రిలిమినరీ పాసైన వారికి శారీరక, దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తారు. ఇది పాసైన వారికి ఎస్ఐ మెయిన్ ఎగ్జామ్ నిర్వహిస్తారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో ప్రతి రోజు ఉదయం ప్రాక్టీస్ చేసేవాడు. 
ఈ క్రమంలో మంగళ‌వారం ఉదయం డిగ్రీ కాలేజీకి వచ్చిన శ్రీకాంత్ ప్రాక్టీస్ చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. తోటి మిత్రులు శ్రీకాంత్ పరిస్థితి గమనించి ఆసుపత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు అప్పటికే శ్రీకాంత్ మృతి చెందినట్లుగా తెలిపారు. కొన్ని నెలల్లో కుమారుడు పోలీస్ అవుతాడని, ప్రయోజకుడు అయ్యి తమ పేరు నిలబెడతాడని భావించిన తల్లిదండ్రులు శ్రీకాంత్ మృతదేహాన్ని చూసి కన్నీరు మున్నీరుగా విలపించారు. సబ్ ఇన్స్‌పెక్టర్ అవుతాడనుకున్న కుమారుడు అకాల మరణం చెందడంతో లక్ష్మయ్య కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.