Hyderabad Crime News: ఫుల్లుగా మద్యం సేవించారు. ఆపై ద్విచక్రవాహనంపై ఇంటికి బయలుదేరారు. మార్గమధ్యంలో ట్రాఫిక్ పోలీసులు వాహన తనిఖీలు చేస్తూ కనిపించారు. దీంతో ఎక్కడ తమను పట్టుకుంటారోనన్న భయంతో పోలీసులను ఢీకొట్టి మరీ పారిపోయారు. అయితే ఈ ఘటన ఎప్పుడు, ఎలా జరిగిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
హైదరాబాద్ లోని హిమాయత్ నగర్ మెక్ డోనాల్డ్స్ సమీపంలో ఎస్ఐ గౌనిగాని నరేష్ తన సిబ్బందితో కలిసి అర్ధరాత్రి 2 గంటలకు వాహన తనిఖీలు నిర్వహించారు. అదే సమయంలో ఫుల్లుగా తాగి ఇద్దరు వ్యక్తులు రాయల్ ఎన్ ఫీల్డ్ బైకుపై వస్తూ కనిపించారు. అయితే వారి మీద అనుమానం రావడంతో పోలీసులు ఆపే ప్రయత్నం చేశారు. మద్యం మత్తులో ఉన్న సదరు యువకులు పోలీసులకు పట్టుబడతామనే భయంతో బైక్ వేగం పెంచారు. ఎదురుగా వస్తున్న ఎస్ఐ నరేష్ ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఎస్ఐ తీవ్రంగా గాయపడ్డాడు. విషయం గుర్తించిన సిబ్బంది వెంటనే అతడిని హైదర్ గూడలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం ఆ తర్వాత నాంపల్లి కేర్ ఆసుపత్రికి తరలించారు. మోకాలి కాలి నుంచి పాదం వరకు ఉన్న ప్రధాన ఎముక విరగడంతో సర్జరీ చేసిన వైద్యులు స్టీల్ రాడ్డును అమర్చారు.
అయితే ఎస్ఐని ఢీకొట్టి పరారైన నిందితులను పోలీసులు వెంబడించి మరీ పట్టుకున్నారు. బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు నిర్వహించగా.. ఇద్దరికీ 190 కంటే ఎక్కువ మోతాదులో ఆల్కాహాల్ సేవించినట్లు నిర్ధారణ అయింది నిందితులు రాంనగర్ రామాలయ ప్రాంతానికి చెందిన చంద్ర శేఖర్, న్యూ నల్లకుంటకు చెందిన యశ్వంత్ గా గుర్తించిన పోలీసులు శనివారం ఉదయం వారిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.
లంగర్ హౌస్ లో యువకుడి కిడ్నాప్ - నగ్నంగా చేసి చిత్ర హింసలు
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో దారుణం జరిగింది. లంగర్‌హౌస్‌లో గ్యాంగ్‌వార్ పడిగ విప్పింది. లంగర్‌హౌస్ లో ఉండే ఇర్ఫాన్ అనే ఓ యువకుడిని ముగ్గురు నిందితులు కిడ్నాప్ చేశారు. అనంతరం రాజేంద్ర నగర్ లోని ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అతడి బట్టలన్నీ తీసేసి నగ్నంగా మార్చి ఇష్టం వచ్చినట్లుగా దాడి చేశారు. వద్దు భయ్యా, వద్దు భయ్యా అంటున్నా వినకుండా విపరీతంగా కొట్టారు. అంతేకాకుండా ఈ రాక్షస క్రీడను వీడియో తీశారు. అనంతరం వాటిని వాట్సాప్ లో స్టేటస్ గా పెట్టుకున్నారు. తమ మాట వినకుంటే అందరి గతి ఇంతేనంటూ హెచ్చరికలు కూడా జారీ చేశారు.
ఎలాగోలా వారి నుంచి తప్పించుకున్న ఇర్ఫాన్.. రాజేంద్ర నగర్ పోలీసులు ఆశ్రయించాడు. అయితే ఈ దాడి ఘటనలో ఇర్ఫాన్ ఒళ్లంతా వాతలు వచ్చాయి. వాటిని ఇర్ఫాన్ పోలీసులకు చూపించాడు. అతడిని చితక బాదినప్పుడు తీసిన వీడియోలు, వారు పెట్టిన స్టేటస్ లను కూడా పోలీసులకు చూపించాడు. తనను కిడ్నాప్ చేసి అనుక్షణం నరకం చూపించిన నిందితులను కఠినంగా శిక్షించాలని పోలీసులను వేడుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇర్ఫాన్ ను ఆస్పత్రికి తరలించారు. వైద్యులతో చికిత్స ఇప్పించిన తర్వాత ఇంజురీ సర్టిఫికేట్ ను కూడా తీసుకొని.. ఇర్ఫాన్ ఇచ్చిన ఫిర్యాదుకు జత చేశారు.