హైదరాబాద్ లో ఓ ట్రాఫిక్ పోలీసు అధికారి స్పందించిన తీరు ఓ నిండు ప్రాణాన్ని నిలబెట్టింది. ఆయన సమయానికి స్పందించి క్షణాల వ్యవధిలో సీపీఆర్ (Cardiopulmonary Resuscitation) చేయడంతో ఓ పెద్దాయన బతికాడు. సమయానికి స్పందించి స్ట్రోక్ గురైన వ్యక్తికి సీపీఆర్ చేసి కాపాడిన పోలీసులను స్థానికులు, ఉన్నతాధికారులు అభినందిస్తున్నారు. 


హైదరాబాద్ బేగంపేట హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ వద్ద గుండెపోటు వచ్చి కిందపడిన వ్యక్తికి ఉత్తర మండల ట్రాఫిక్ అదనపు కమిషనర్ మధుసూదన్ రెడ్డి వెంటనే స్పందించి సీపీఆర్ (హృదయ శ్వాస పునరుజ్జీవనం) చేసి ప్రాణాలు కాపాడారు. రహదారిపై నడుచుకుంటూ వెళుతున్న వ్యక్తి హఠాత్తుగా గుండెపోటుతో కిందపడిపోయాడు. ఆ వ్యక్తిని వెంటనే మారేడ్ పల్లి పోలీసులు పక్కకు తరలించడంతో పాటు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా మధుసూదన్ రెడ్డి స్వయంగా సీపీఆర్ చేసి ప్రాణాలు రక్షించారు. 


దాదాపు పది నిమిషాల పాటు సీపీఆర్ చేసి హృదయ శ్వాసను మెరుగుపరిచి ప్రాథమిక చికిత్స ద్వారా ఆయన ప్రాణాన్ని రక్షించారు. వెను వెంటనే అంబులెన్స్ ద్వారా హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. సకాలంలో ఆయన ప్రాణాలను సీపీఆర్ చేసి కాపాడిన ఉత్తర మండల ట్రాఫిక్ అదరపు కమిషనర్ మధుసూదన్ రెడ్డిని, పోలీసులను పలువురు అభినందించారు. ప్రాణాపాయం నుంచి బయట పడిన వ్యక్తి శ్రీకాకుళానికి చెందిన గుజ్జల్ల రాముగా గుర్తించారు. ఇతను హైదరాబాద్ లో మేస్త్రీ పని చేస్తున్నట్లుగా గుర్తించారు. ప్రాణాపాయం నుంచి బయట పడడంతో అతని కుటుంబ సభ్యులు పోలీసులకు, అడిషనల్ ఏసీపీ మధుసూదన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.


మంత్రి హరీశ్ రావు స్పందన


ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ మధుసూధన్ రెడ్డి సీపీఆర్ చేసిన తీరుపై మంత్రి హరీశ్ రావు అభినందనలు తెలిపారు. ఆ క్షణంలో మధుసూధన్ రెడ్డి స్పందించిన తీరు అద్భుతమని మంత్రి కొనియాడారు. కుప్పకూలిన వ్యక్తి రాముగా గుర్తించామని, సీపీఆర్ తర్వాత అతణ్ని గాంధీ హాస్పిటల్‌కు తరలించారని మంత్రి హరీశ్ రావు ‘ఎక్స్‌’ లో పోస్ట్ చేశారు.