తెలంగాణలో ఎన్నికల కసరత్తు మొదలైంది. మరో మూడు నెలల్లో ఎన్నికలు జరగబోతుండటంతో... రాష్ట్ర ఎన్నికల సంఘం.. ఏర్పాట్లకు రెడీ అయ్యింది. శాసనసభ ఎన్నికల కోసం అధికారులు కసరత్తు వేగవంతం చేస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్‌... అన్ని జిల్లాల ఎస్పీలు, సీపీలతో సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి డీజీపీతో ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. పోలింగ్‌ నిర్వహణ, శాంతిభద్రతలకు సంబంధించిన అంశాలపై చర్చించారు. ఈ ఏడాది ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా.. ఎవరికీ ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని వికాస్​రాజ్ తెలిపారు. అధికార యంత్రాంగాన్ని అన్ని విధాలా సన్నద్ధం చేస్తున్నట్లు చెప్పారాయన. ఇప్పటికే రాష్ట్రస్థాయిలో శిక్షణ పూర్తయిందని.. జిల్లాల్లోనూ సిబ్బందికి ట్రైనింగ్‌ ఇస్తున్నామని చెప్పారు. 


ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలకు సన్నాహాలు కూడా జరుగుతున్నట్టు తెలుస్తోంది. వచ్చే నెలలో ఎన్నికల నోటిఫికేషన్‌ కూడా వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఓటర్ల జాబితాపై దృష్టిపెట్టిన ఎన్నికల సంఘం... ముసాయిదా ఓటర్ల జాబితా సిద్ధం చేసింది. దొంగఓట్ల తొలగింపునకు చర్యలు తీసుకుంటున్నారు. తెలంగాణలో 10 లక్షల బోగస్ ఓటర్లను తొలగించినట్లు సీఈవో వికాజ్‌రాజ్‌ తెలిపారు. ఇందులో సగానికిపైగా గ్రేటర్‌ హైదరాబాద్ పరిధిలోనే ఉన్నట్టు చెప్పారు. 


ఓటర్ల జాబితాలో సవరణకు గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి 21 లక్షల దరఖాస్తులు వచ్చాయని చెప్పారు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్‌. మార్పులు, చేర్పుల కోసం 9 లక్షలకుపైగా దరఖాస్తులు వచ్చాయన్నారు. అభ్యర్థులు నామినేషన్ల దాఖలుకు పది రోజుల ముందువరకు... ఓటరు జాబితాలో మార్పులు చేర్పులు చేస్తామన్నారు. ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటించడంతో.. మార్పులు, చేర్పులు, అభ్యంతరాలపై సెప్టెంబరు 19వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చని.. అక్టోబరు 4వ తేదీన తుది ఓటర్ల జాబితాప్రకటిస్తామన్నారు. 


ఒకే వ్యక్తికి రెండు.. అంతకు మించి ఓట్లు ఉండడం, డూప్లికేట్ ఎంట్రీలు వంటి బోగస్‌ ఓట్లు తొలగించినట్లు తెలిపారు. అలాగే ఫాం-8 ద్వారా అడ్రస్‌ మార్చుకున్నప్పుడు పాత అడ్రెస్‌లో ఉన్న పేర్లను తొలగిస్తామన్నారు. అలాగే, ఓటరు నమోదు చేసిన చిరునామాలో నివసించనట్లు తెలిస్తే ఓటు డిలీట్ అవుతుందని చెప్పారు. డూప్లికేట్ ఓట్ల తొలగింపుపై విధివిధానాలు పాటించాలన్నారు సీఈవో వికాస్‌రాజ్‌. ఓటర్ల దగ్గర నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదును సీరియస్‌గా తీసుకోవాలని ఆదేశించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచేలా ప్రయత్నించాలన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని నియోజకవర్గాల్లో ఓటింగ్‌ శాతం బాగా తగ్గిందని.. ఈసారి అలా జరగకుండా ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. ఓటింగ్‌ పెరిగేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. తొలిసారి ఓట్లు నమోదు చేసుకునే వారి సంఖ్య ఈసారి భారీగా నమోదైందని చెప్పారు. 
ఓటర్ల సంఖ్య పెరగడంతో పోలింగ్‌ కేంద్రాలు కూడా భారీగా పెరుగుతున్నాయన్నారు.  ప్రతి పోలింగ్‌ కేంద్రంలో 15 వందల మంది ఓటర్లు మాత్రమే ఉండేలా చూస్తున్నామని చెప్పారు. ఒకే కుటుంబంలోని ఓటర్లు వేర్వేరు పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లే పరిస్థితి రాకుండా... కసరత్తు చేస్తున్నామన్నారు. 


ఈ ఏడాది ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా..  అధికార యంత్రాంగాన్ని అన్ని విధాలా సన్నద్ధం చేస్తున్నామన్నారు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్​రాజ్ తెలిపారు. శాంతి భద్రతల విషయంలోనూ అప్రమత్తంగా ఉంటామన్నారు. మొత్తంగా... తెలంగాణలో ఎన్నికల హడావుడి మొదలైపోయింది.