Ramzan Prayers in Hyderabad: రంజాన్ కారణంగా హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాల్లో ఏప్రిల్ 11న ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ప్రార్థనలు ఉండడం వల్ల ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు. మీర్ ఆలం ఈద్గా, మాసబ్ ట్యాంక్ లోని హాకీ గ్రౌండ్స్ లో ఈద్ ఉల్ ఫితర్ ప్రార్థనలు ఉన్నందున ఆ చుట్టుపక్కల ప్రాంతాల గుండా వెళ్లే వాహనదారులకు ఇబ్బందులు ఉంటాయని చెప్పారు. 


కాబట్టి, రేపు (ఏప్రిల్ 11) ఉదయం 8 గంటల నుంచి 11:30 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. 


మాసాబ్ ట్యాంక్ లోని హాకీ గ్రౌండ్ లో నమాజ్ కోసం భారీగా ముస్లింలు వస్తారని అందుకని మాసాబ్ ట్యాంక్ ఫ్లైఓవర్ కింది నుంచి వాహనాలను అనుమతించబోమని పోలీసులు తెలిపారు. మెహెదీపట్నం వైపు, ఇటు లక్డీకపూల్ నుంచి వచ్చే ట్రాఫిక్ కేవలం ఫ్లైఓవర్ మీదుగా మాత్రమే వెళ్లాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. కింది నుంచి వెళ్లడానికి వీలుండదని చెప్పారు. ఈ ప్రదేశంలో ప్రార్థనలు పూర్తయ్యే వరకు అంటే ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకూ ట్రాఫిక్ సమస్య ఉంటుందని చెప్పారు.


మెహెదీపట్నం నుంచి బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1 వైపు వచ్చే వాహనదారులను మాసాబ్ ట్యాంక్ ఫ్లైఓవర్ మీదుగా మళ్లిస్తామని.. అక్కడి నుంచి అయోధ్య జంక్షన్ (లెఫ్ట్ టర్న్), ఆర్డీఏ ఆఫీస్, ఖైరతాబాద్ (లెఫ్ట్ టర్న్), తాజ్ క్రిష్ణా హోటల్ మీదుగా వెళ్లవచ్చని తెలిపారు.


లక్డీకపూల్ నుంచి మాసబ్ ట్యాంక్ మీదుగా బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1 లేదా 12 వెళ్లాలనుకునేవారిని.. అయోధ్య జంక్షన్ వద్ద మళ్లించనున్నారు. నిరంకారి, ఖైరతాబాద్, వీవీ స్టాట్యూ, ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీస్, తాజ్ క్రిష్ణా హోటల్ మీదుగా వెళ్లొచ్చు.


బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 నుంచి వచ్చే వాహనదారులను మాసాబ్ ట్యాంక్ వైపునకు అనుమతించరు. వారిని రోడ్ నెంబర్ 1, 12 వద్ద మళ్లిస్తారు. వీరిని తాజ్ క్రిష్ణా హోటల్ - రైట్ టర్న్, ఆర్టీఏ ఖైరతాబాద్ వైపు మళ్లిస్తారు. ఎన్ఎఫ్‌సీఎల్ జంక్షన్, పంజాగుట్ట నుంచి వచ్చే వారిని మాసాబ్ ట్యాంక్ వైపు అనుమతించరు. వీరిని తాజ్ క్రిష్ణా వద్ద డైవర్ట్ చేసి ఎర్రమంజిల్ కాలనీ, ఆర్టీఏ ఖైరతాబాద్, నిరంకారీ, లక్డీకపూల్, మాసాబ్ ట్యాంక్ ఫ్లైఓవర్, మెహెదీపట్నం వైపునకు మళ్లిస్తారు.






మీర్ ఆలం ఈద్గా వద్ద జరిగే ప్రార్థనల నేపథ్యంలో ఆ వైపు గుండా వెళ్లే వారు బహదూర్ పూర చౌరస్తా వద్ద కిషన్ బాగ్, కామాటి పురా, పురానా పుల్ వైపు వెళ్లవచ్చు. మరోవైపు ఈద్గా వైపు వెళ్లే వారు శాస్త్రిపురం, ఎన్ఎస్ కుంట తదితర ప్రాంతాల వైపు ట్రాఫిక్ ను మళ్లిస్తున్నారు. 


ఇక కాలపత్తార్ వద్ద మోచీ కాలనీ, బహదూర్ పురా, శంషీర్ గంజ్, నవాబ్ సాహెబ్ కుంట వైపు వాహనాలను ట్రాఫిక్ పోలీసులు మళ్లిస్తారు. ఇక పురానా పూల్ నుంచి బహదూర్ పురా వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులను, ఇతర వాహనాలను జియగూడ వైపు, రాజేంద్ర నగర్ నుంచి బహదూర్ పురా వైపు వెళ్లే భారీ వాహనాలను ఆరాంఘర్ జంక్షన్ వద్ద లేకపోతే శంషాబాద్, రాజేంద్రనగర్, మైలర్ దేవ్ పల్లి వైపు భారీ వాహనాలను మళ్లిస్తామని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు.