Hyderabad News: బోధన్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత షకీల్ కుమారుడు రహీల్ ఇరుక్కున్న ప్రజా భవన్ యాక్సిడెంట్ కేసులో ఆయనకు ఊరట లభించింది. రహీల్‌కు నాంపల్లి కోర్టు బెయిల్ ఇచ్చింది. ప్రజా భవన్ వద్ద పోలీసులు ఉంచిన బారీకేడ్లను ఢీకొట్టిన కేసులో అరెస్టు అయి రహీల్ ప్రస్తుతం చంచల్‌గూడ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా రహీల్ కు నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. రెండు రూ.20 వేల షూరిటీలు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. అలాగే హైకోర్టు ఆదేశాలను పాటించాలని రహీల్ కు నిర్దేశించింది. మరోవైపు ఈ కేసులో తదుపరి విచారణ కోసం రహీల్‌ను తమ కస్టడీలోకి తీసుకోవాలని పోలీసులు ప్రయత్నించారు. వారు దాఖలు చేసిన పిటిషన్‌ను నాంపల్లి కోర్టు కొట్టేసింది.


తెలంగాణ ఎన్నికల ఫలితాలు విడుదలైన మరుసటి రోజే సోమాజీగూడ సర్కిల్ సమీపంలో ఉన్న ప్రజా భవన్‌ వద్ద రహీల్ కారుతో బీభత్సం చేశాడు. ప్రజా భవన్ ముందు భద్రత కోసం ఉంచే బారీకేడ్లను వేగంగా తన కారుతో రహీల్ ఢీకొన్నాడు. ఈ ప్రమాదం కేసులో రహీల్‌ నిందితుడిగా ఉన్నాడు. ప్రమాదం తర్వాత మాజీ ఎమ్మెల్యే షకీల్ తన కుమారుడ్ని కేసు నుంచి తప్పించే ప్రయత్నం చేశారని ఆరోపణలు వచ్చాయి. రహీల్ బదులు మరొకరు పంజాగుట్ల పోలీస్ స్టేషన్ లో లొంగిపోవడం.. పోలీసులు కూడా రహీల్ ను తప్పించారన్న ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంలో ఇద్దరు పోలీసులు కూడా సస్పెండ్ అయ్యారు. 


అయితే, ఈలోపే రహీల్ దుబాయ్ పారిపోయినట్లుగా వార్తలు వచ్చాయి. మాజీ ఎమ్మెల్యే షకీల్ కూడా దుబాయ్ కు వెళ్లిపోయినట్లుగా ప్రచారం జరిగింది. వారి కోసం గత కొంత కాలం గాలించిన పోలీసులు లుక్‌ అవుట్‌ నోటీసులు కూడా జారీ చేశారు. అనంతరం తనపై ఉన్న లుక్ అవుట్ నోటీసులు కొట్టేయాలని రహీల్ తరపు న్యాయవాదులు కోర్టులో పిటిషన్ కూడా వేశాడు. ఈ మధ్యే రహీల్‌ దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌కు తిరిగి వస్తుండగా (ఏప్రిల్‌ 8న) పంజాగుట్ట పోలీసులు అతడిని అరెస్ట్‌ చేశారు. అనంతరం న్యాయమూర్తి ఎదుట హాజరు పరచగా ఈ నెల 22 వరకు రిమాండ్‌ విధించారు. ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్నారు. తాజాగా నాంపల్లి కోర్టు బెయిల్ ఇచ్చింది.