Hyderabad Traffic Police: కాసింత వాన చినుకులు కురిస్తే ఇంట్లో నుంచి బయటకు వెళ్లరు. కొద్దిపాటి వర్షం వస్తే జబులు చేస్తుందని, జ్వరం వస్తుందని భయపడిపోతారు చాలా మంది. కానీ ఒక వైపు వర్షం కురుస్తున్నా.. రోడ్లపై నీళ్లు నిలిచి ఇబ్బంది ఎదురవుతున్నా తన విధిని సక్రమంగా నిర్వర్తిస్తూ ఔరా అనిపించాడో ట్రాఫిక్ పోలీసు అధికారి. రోడ్లపై వాహనదారులు ఇబ్బందులు పడకుండా చూసుకోవడానికి ఆ అధికారి చూపిస్తున్న  అంకితభావానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఒక వైపు వాన కురుస్తుంటే మరోవైపు ట్రాఫిక్ సరిచేస్తూ ఉన్నాడు ఆ అధికారి. ఇదంతా కారులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి వీడియో తీసి ట్విట్టర్ లో పోస్టు చేయగా అది కాస్త వైరల్ గా మారి నెటిజన్లు విపరీతంగా ఆకట్టుకుంటోంది. 






హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతంలోని మొజంజాహీ కూడలి అత్యంత రద్దీ ఉండే ప్రాంతాల్లో ఒకటి. ఇక్కడ సాధారణంగానే ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. అందులోనూ ఇరుకు రోడ్లు కావడంతో ట్రాఫిక్ చాలా నెమ్మదిగా కదులుతుంది. ఇక వర్షం పడితే అక్కడ రోడ్డు కనిపించకుండా నీరు నిలిచిపోతుంది. అలాంటి కూడలిలో విధులు నిర్వహిస్తున్నారు ఓ పోలీసు అధికారి. అక్కడ ఏమాత్రం ట్రాఫిక్ జామ్ అవ్వకుండా వర్షాన్ని సైతం లెక్కచేయకుండా నిబద్ధతతో, అంకితభావంతో డ్యూటీ చేస్తున్నారు. అదే దారిలో కారులో వెళ్తున్న ఓ వ్యక్తి ఆ అధికారి విధులను వీడియో తీశాడు. 40 సెకన్ల పాటు ఉన్న ఆ వీడియోను అర్బాజ్ ది గ్రేట్ అనే యూజర్ ట్విట్టర్ లో పోస్టు చేయగా.. అది కాస్త వైరల్ గా మారింది. ఆ ట్రాఫిక్ పోలీసు అధికారి అంకితభావానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సెల్యూట్ అంటూ స్పందిస్తున్నారు. ఈ 40 సెకన్ల వీడియోను జూన్ 24 రాత్రి 9.53 గంటలకు పోస్టు చేయగా.. ఇప్పటి వరకు 82.4K వ్యూస్ వచ్చాయి.


'అంత వర్షంలో సిన్సియర్ గా డ్యూటీ చేస్తున్న మీలాంటి అధికారికి సెల్యూట్ సర్' అని ఓ యూజర్ కామెంట్ పెట్టారు. 'ఇలాంటి అధికారులు లేకపోతే ట్రాఫిక్ జామ్ అయిపోయి వాహనాలు కదలకుండా పోతాయి' అని మరో యూజర్ కామెంట్ చేశారు. 'ఆ అధికారి అంకితభావానికి సెల్యూట్.. కానీ వర్షంలో డ్యూటీ చేసే అధికారులకు రెయిన్ గేర్ ఇవ్వాల'ని ఓ యూజర్ సూచించారు. 






రిక్షావాలాకు సాయం చేస్తూ అంకితభావాన్ని చాటిన అధికారి


అదే మొజంజాహీ కూడలి ప్రాంతంలో విధుల్లో ఉన్న మరో పోలీసుల అధికారి వీడియో కూడా వైరల్ అవుతోంది. అందులో ఆ అధికారి రోడ్డుపై నెమ్మదిగా వెళ్తున్న ఓ రిక్షావాలాకు సాయం చేస్తూ కనిపించారు. వెనక వస్తున్న వాహనాలకు దారి ఇచ్చేలా రిక్షా వెనక నుంచి పరుగెడుతూ దానిని నెడుతూ ఉన్నారు. ఈ 2 సెకన్ల వీడియోను సయ్యద్ రెహమత్ అనే యూజర్ ట్విట్టర్ లో పోస్టు చేశారు. రోడ్లపై ఇతరులకు సాయం చేస్తూ తన డ్యూటీని అంకితభావంతో నిర్వహిస్తున్న ఇలాంటి అధికారులకు గుర్తింపు దక్కాలంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోపైనా నెటిజన్లు స్పందిస్తూ ఆ వీడియోలో కనిపిస్తున్న అధికారిపై పొగడ్తలు కురిపిస్తున్నారు.






నిద్రమత్తులో రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి


నిద్రమత్తు, రాంగ్ రూట్, ఓవర్ స్పీడ్.. రోడ్డు ప్రమాదాలకు ఎలా కారణాలు అవుతాయో చెబుతూ సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఓ వీడియోను పోస్టు చేశారు. అందులో బొలెరో వాహన డ్రైవర్ నిద్రమత్తులో.. రాంగ్ రూట్ లో అతివేగంగా ఎదురుగా వస్తున్న ఓ లారీని బలంగా ఢీకొట్టాడు. ఈ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు నిద్రమత్తు, రాంగ్ రూట్, ఓవర్ స్పీడ్ తో జరిగే ప్రమాదాలపై అవగాహన కోసం సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఈ వీడియోను ట్వీట్ చేశారు.