బేగంపేట ప్రాంతంలో ఓ మార్గాన్ని మూడు నెలల పాటు అధికారులు మూసివేయనున్నారు. స్ట్రేటజిక్ నాలా డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (ఎస్‌ఎన్‌డీపీ) కింద రసూల్‌పుర - రాంగోపాల్‌పేట పోలీస్ స్టేషన్ ల మధ్య అండర్ గ్రౌండ్ లోని నాలాను పునరుద్ధరించనున్నందున ఈ మార్గంలో ఇవాల్టి (నవంబరు 24) నుంచి మూడు నెలలపాటు ట్రాఫిక్‌ ను అనుమతించడం లేదు. దీనికి సంబంధించి హైదరాబాద్ పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌ ఒక ప్రకటనలో వెల్లడించారు. నవంబరు 21వ తేదీ నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి నెల వరకూ ఈ ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు.


ఈ మూడు నెలలూ వేరే రోడ్లకు ట్రాఫిక్ మళ్లింపు


బేగంపేట ఫ్లైఓవర్‌ నుంచి కిమ్స్‌ ఆసుపత్రి, మినిస్టర్‌ రోడ్‌, రాణిగంజ్‌, నల్లగుట్ట, వీపీఎన్‌ఆర్‌ మార్గ్‌ వైపు వెళ్లేందుకు రసూల్‌పుర టీ-జంక్షన్‌ వద్ద యూటర్న్‌ తీసుకునేందుకు అనుమతి ఇవ్వరు. కిమ్స్‌ ఆసుపత్రి, మినిస్టర్‌ రోడ్‌, రాణిగంజ్‌, నల్లగుట్ట వైపు రసూల్‌పుర నుంచి వెళ్లే వాహనాలు సీటీఓ ఫ్లైఓవర్‌ వరకు వెళ్లి యూటర్న్‌ తీసుకోవాలి. హనుమాన్‌ టెంపుల్‌ నుంచి ఫుడ్‌ వరల్డ్‌, సింధీ కాలనీ, రాంగోపాల్‌పేట ఠాణా, కిమ్స్‌ ఆసుపత్రుల వైపు వెళ్లొచ్చు.


రాణిగంజ్‌, నల్లగుట్ట, పీవీఎన్‌ఆర్‌ మార్గ్‌ నుంచి వచ్చే వాహనాలను రసూల్‌పుర వైపు వెళ్లనివ్వరు. అటువైపుగా వచ్చే వాహనాలు రాంగోపాల్‌పేట పోలీస్ స్టేషన్, సింధి కాలనీ, ఫుడ్‌ వరల్డ్‌, హనుమాన్‌ ఆలయం మీదుగా వచ్చి లెఫ్ట్ తీసుకొని రసూల్‌పుర వైపు వెళ్లే వీలుంది.


సికింద్రాబాద్‌ వైపు నుంచి కిమ్స్‌ హాస్పిటల్ వైపు వచ్చే వాహనాలు హనుమాన్‌ ఆలయం నుంచి లెఫ్ట్ తీసుకుని, ఫుడ్‌ వరల్డ్‌, సింధీ కాలనీ, రాంగోపాల్‌పేట పోలీస్ స్టేషన్ మీదుగా లెఫ్ట్ కు తిరిగి కిమ్స్‌ వైపు వెళ్లవచ్చు. లేదా సీటీఓ ఫ్లైఓవర్‌ నుంచి లెఫ్ట్ తీసుకొని రాణిగంజ్‌ మీదుగా వచ్చి రైట్ తీసుకొని కిమ్స్‌ హాస్పిటల్ వైపు వెళ్లవచ్చు.


అంబులెన్స్‌లు లేదా రోగులను బేగంపేట ఫ్లైఓవర్‌ వైపు నుంచి కిమ్స్‌ వైపునకు తీసుకువెళ్లాలంటే సీటీఓ ఫ్లైఓవర్‌ వరకు వెళ్లి యూటర్న్‌ తీసుకుని రాంగోపాల్‌పేట పోలీస్ స్టేషన్ నుంచి కిమ్స్‌ హాస్పిటల్ వైపు వెళ్లడానికి వీలుంటుంది. భారీ వాహనాలు మినిస్టర్‌ రోడ్‌ వైపు వెళ్లాలంటే రాణిగంజ్‌ మార్గంలో నుంచి వెళ్లాల్సి ఉంటుంది.


బేగంపేట ప్రధాన మార్గంలో నెలలతరబడి ట్రాఫిక్ మళ్లింపు


బేగంపేట కరాచీ బేకరీ సమీపంలోని పికెట్‌ నాలాపై బ్రిడ్జి పునర్నిర్మాణ పనుల కారణంగా దాదాపు 2 నెలలకుపైగా రాకపోకలను మళ్లించిన సంగతి తెలిసిందే. ప్రధానంగా ఎస్పీ రోడ్డు, మినిస్టర్‌ రోడ్డు, సికింద్రాబాద్‌ వైపు రాకపోకలు సాగించేవారు ట్రాఫిక్‌ ఆంక్షలను అనుభవించాల్సి వచ్చింది. ఏప్రిల్ నెల నుంచి దాదాపు ఆగస్టు నెల వరకూ పనులు సాగాయి. దీంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. బేగంపేట ఫ్లైఓవర్‌ నుంచి వచ్చేవారు కిమ్స్‌ హాస్పిటల్‌ వైపు వెళ్లే వాహనదారులు రసూల్‌పురా ‘టి’ జంక్షన్‌ వద్ద కుడి మలుపు తీసుకోవడానికి అనుమతి లేకుండా చేశారు. ఈ మార్గంలో కేవలం సీటీఓ జంక్షన్, సికింద్రాబాద్‌ వైపు వెళ్లేందుకు మాత్రమే అనుమతించారు.