తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మంగళవారం రాత్రి (నవంబర్ 22) ప్రసంగిస్తుండగా ఓ సందర్భంలో భావోద్వేగానికి గురైనట్లుగా కనిపించింది. హైదరాబాద్ శివారులోని ఓ రిసార్ట్స్‌లో నిర్వహించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతుండగా ఈ పరిణామం జరిగింది. ఆ సమయంలో ఆయన కేసీఆర్‌పై విమర్శలు చేస్తున్నారు. బీజేపీ ప్రధాన కార్యదర్శి, సంఘ్ ప్రచారక్ అయిన బీఎల్ సంతోష్‌కు టీఆర్ఎస్ ప్రభుత్వం నోటీసులు ఇవ్వడంపై విమర్శలు చేస్తుండగా బండి సంజయ్ కన్నీళ్లు పెట్టుకున్నారు. సంఘ్ ప్రచారక్‌లను కేసీఆర్ అవమానపరుస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. ఏదో పదవి కావాలని బీఎల్ సంతోష్ అనుకోలేదని, ఆస్తులు కూడబెట్టలేదని, ఆయనకు వ్యాపారాలు లేవని అన్నారు. టీఆర్ఎస్ నేతలు ఢిల్లీ లిక్కర్ స్కామ్ నుంచి బయటపడడానికే అవమానిస్తున్నారని బండి సంజయ్ వాపోయారు. బీఎల్ సంతోష్ జోలికి వస్తే ఊరుకోబోమని తేల్చి చెప్పారు. ఈ వ్యాఖ్యలు చేస్తుండగా బండి సంజయ్ కళ్లలో నీళ్లు తిరిగాయి.
ఇదే విషయం అన్ని మీడియా ఛానెళ్లలో ప్రముఖంగా వచ్చింది. అయితే, తాను కన్నీళ్లు పెట్టుకున్న అంశంపై బండి సంజయ్ క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు మీడియా ప్రతినిధులతో విడిగా మాట్లాడారు. తాను నిజంగా కన్నీళ్లు పెట్టుకోలేదని, ఎవరో ఓ ఫోకస్ లైటును పోడియంకు ఎదురుగా పెట్టడం వల్ల ఆ కాంతి తన కళ్లలో పడి నీళ్లు తిరిగాయని చెప్పారు. ఫోకస్ లైటు అదే పనిగా తన కళ్లలో పడడంతో నీళ్లు తిరిగాయని బండి సంజయ్ క్లారిటీ ఇచ్చారు.
ప్రసంగంలో బండి సంజయ్ మాట్లాడుతూ.. ‘‘బీఎల్ సంతోష్ ఏం తప్పు చేశారు... ఆయనకు మీ లెక్క ఆస్తిపాస్తుల్లేవు. కుటుంబం కుటుంబం లేదు. విదేశాల్లో మీలెక్క పెట్టుబడుల్లేవు. బ్యాంకు ఖాతాల్లేవు. ఎవరో చెప్పారని కేసులు పెట్టి అవమానిస్తారా? నీ రాజకీయ లబ్ది కోసం, నీ కుటుంబం కోసం ప్రజల ద్రుష్టిని మళ్లించేందుకే ప్రచారక్ వ్యవస్థనే కించపరుస్తావా? అసలు మనిషివేనా? ఖబడ్దార్... కేసీఆర్ నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు’’ అంటూ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. దేశ ప్రజలే కుటుంబంగా భావిస్తున్న ప్రధాని మోదీపైనా, దేశం, ధర్మం కోసం కుటుంబాల్లేకుండా సేవ చేస్తున్న ప్రచారక్ లపై కేసీఆర్ అనుచిత ఆరోపణలు చేయడం సిగ్గు చేటన్నారు.
హైదరాబాద్ శివారులోని లియోనియా రిసార్ట్స్ లో ఈరోజు రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు జరిగాయి. ఇందులో భాగంగా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా... ఎంపీ సోయం బాపూరావు, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు, సోయం బాపూరావు, మాజీ ఎంపీలు నర్సయ్య గౌడ్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, చాడ శ్రీనివాస్ రెడ్డి సంపూర్ణంగా బలపరుస్తూ కొన్ని సూచనలు చేశారు.
ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర 28 నుంచి
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఇప్పటికే నాలుగు విడతల పాదయాత్ర పూర్తి చేశారు. ఈనెల 28 నుండి బండి సంజయ్ 5వ విడత పాదయాత్ర ప్రారంభించాలని నిర్ణయించారు. నిర్మల్ నియోజకవర్గంలోని అడెల్లి పోచమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం 5వ విడత పాదయాత్ర ప్రారంభిస్తారు. కరీంనగర్ లో ముగింపు సభ నిర్వహిస్తారు. డిసెంబర్ 15 లేదా 16 వరకు పాదయాత్ర సాగుతుంది. సీఎం కేసీఆర్ కుటుంబ- అవినీతి -నియంత పాలనకు వ్యతిరేకంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఇప్పటి వరకు 4 విడతలు పాదయాత్ర చేసి 13 ఎంపీ, 48 అసెంబ్లీ నియోజకవర్గాలతోపాటు మొత్తం 21 జిల్లాల్లో 1178 కి.మీల మేర నడిచినట్లు బీజేపీ ప్రకటించింది. ఐదో విడత పాదయాత్రను అక్టోబర్‌లోనే చేయాలనుకున్నారు. కానీ మునుగోడు ఉపఎన్నికల కారణంగా వాయిదా వేసుకున్నారు.