బంజారాహిల్స్ లో ప్రాణం కాపాడిన ట్రాఫిక్ కానిస్టేబుల్...
కరెంట్ షాక్ తగిలిన వ్యక్తి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ శంకర్ బోలా ..
బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1 న కరెంట్ షాక్ తో కొట్టుకుంటున్న వ్యక్తి..
కరెంట్ షాక్ నుండి తప్పించిన ప్రాణాలు కాపాడిన ట్రాఫిక్ కానిస్టేబుల్..
బంజారాహిల్స్ ట్రాఫిక్ కానిస్టేబుల్ శంకర్ బోలా ను అభినందించిన అధికారులు


కరెంట్ షాక్ కొట్టిన ఓ వ్యక్తికి ట్రాఫిక్ కానిస్టేబుల్ ప్రాణాలకు తెగించి మరీ కాపాడారు. అనంతరం సీపీఆర్ చేసి ఆ వ్యక్తికి ప్రాథమిక చికిత్స అందించారు. సీపీఆర్ నిర్వహించ‌డంతో ఆ బాధితుడు స్పృహ లోకి వ‌చ్చాడు. అనంత‌రం ఆ వ్యక్తిని అంబులెన్స్ 108లో ఉస్మానియా ఆస్పత్రికి మెరుగైన చికిత్స కోసం త‌ర‌లించారు. ఈ ఘ‌ట‌న బంజారాహిల్స్‌లోని తాజ్ కృష్ణా హోట‌ల్ స‌మీపంలో మంగ‌ళ‌వారం సాయంత్రం చోటు చేసుకుంది.  కరెంట్ షాక్ నుంచి కాపాడటంతో పాటు సీపీఆర్ చేసి వ్యక్తి ప్రాణం కాపాడిన ట్రాఫిక్ కానిస్టేబుల్ శంకర్ బోలాను బంజారాహిల్స్‌ ట్రాఫిక్‌ ఇన్‌ స్పెక్టర్ నరసింహరాజుతో పాటు ఉన్నతాధికారులు అభినందించారు.


అసలేం జరిగిందంటే..
ఓ వ్యక్తి అప్పటికే బాగా మద్యం సేవించి ఉన్నాడు. మంగళవారం సాయంత్రం నగరంలోని బంజారాహిల్స్‌లోని తాజ్ కృష్ణా హోట‌ల్ స‌మీపంలో తిరుగుతున్నాడు. మ‌ద్యం మ‌త్తులో ఉన్న అతడు ఏం చేస్తున్నాడో కూడా సోయి లేదు. రోడ్డు పక్కన ఉన్న ఓ ఎల‌క్ట్రిక్ ఫ్యూజ్ బాక్సు తెరిచి అందులో చేతులు పెట్టాడు మందుబాబు. పవర్ సప్లై ఉండటం, వైర్లను పట్టుకోవడంతో మద్యం మత్తులో ఉన్న వ్యక్తికి కరెంట్ షాక్ కొట్టింది. విద్యుత్ షాక్‌కు గురై మందుబాబు విల‌విల్లాడిపోయాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడ విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ శంకర్ ఇది గమనించారు.


కరెంట్ షాక్‌తో విలవిల్లాడుతున్న వ్యక్తిని చాకచక్యంగా వ్యవహరించి ప‌క్కకు లాగేశాడు ట్రాఫిక్ పోలీసు. అంతటితో ఆగకుండా అతడి ప్రాణాలు కాపాడేందుకు శతవిధాలా ప్రయత్నించారు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న కరెంట్ షాక్ బాధితుడికి ట్రాఫిక్ కానిస్టేబుల్ శంక‌ర్ సీపీఆర్ చేసి అతడి ప్రాణాలు కాపాడారు. బాధితుడి ఛాతిపై నొక్కుతూ అతడు కోమాలోకి వెళ్లకుండా చూశారు. స్థానికులు, పోలీసుల నుంచి సమచారం అందుకున్న అంబులెన్స్ కొద్దిసేపటికే అక్కడికి వచ్చింది. ఆ వ్యక్తిని మెరుగైన చికిత్స కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. సమయస్ఫూర్తిగా వ్యవహరించి కరెంట్ షాక్ నుంచి ప్రాణాలకు తెగించి వ్యక్తిని విడిపించడంతో పాటు సీపీఆర్ చేసి మరొకరి ప్రాణాలు కాపాడిన ట్రాఫిక్ పోలీసు శంకర్ ను ఉన్నతాధికారులతో పాటు ప్రజలు ప్రశంసిస్తున్నారు.


గోల్డెన్ అవర్ కీలకం ! 
గుండెపోటు వచ్చినప్పుడు, కరెంట్ షాక్ కొట్టి ఎవరైనా చలనం లేకుండా ఉన్నట్లయితే మొదటి గంట సమయం వేస్ట్ చేయవద్దు. దీనినే గోల్డెన్ అవర్ అంటారు. ఈ సమయంలో చేసే ప్రాథమిక చికిత్స ప్రాణాలు కాపాడుతుంది.  గుండె పోటుకు గురైన వ్యక్తి స్పృహ కోల్పోతే వెంటనే CPR మొదలుపెట్టాలి. వ్యక్తి శ్వాస తీసుకోవడం ఆగిపోయినా, లేక పల్స్ ఆగిపోయినట్టు అనిపించినా గుండెకు రక్తం ఆగకుండా CPR ఇవ్వాలి. వ్యక్తి ఛాతీ మధ్యలో రెండు చేతులతో గట్టిగా ఒత్తాలి. ఎంత వేగంగా ఒత్తాలంటే నిమిషానికి వంద సార్లు ఒత్తాలి. ఇలా చేయడం వల్ల ఆగిపోయిన గుండె కొట్టుకునే అవకాశం ఎక్కువ అని వైద్య నిపుణులు సూచిస్తుంటారు.