‘‘బీఎల్ సంతోష్ ఏం తప్పు చేశారు... ఆయనకు మీ లెక్క ఆస్తిపాస్తుల్లేవు. కుటుంబం కుటుంబం లేదు. విదేశాల్లో మీలెక్క పెట్టుబడుల్లేవు. బ్యాంకు ఖాతాల్లేవు. ఎవరో చెప్పారని కేసులు పెట్టి అవమానిస్తారా? నీ రాజకీయ లబ్ది కోసం, నీ కుటుంబం కోసం ప్రజల ద్రుష్టిని మళ్లించేందుకే ప్రచారక్ వ్యవస్థనే కించపరుస్తావా? అసలు మనిషివేనా? ఖబడ్దార్... కేసీఆర్ నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు‘‘అని అంటూ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. దేశ ప్రజలే కుటుంబంగా భావిస్తున్న ప్రధాని మోదీపైనా, దేశం, ధర్మం కోసం కుటుంబాల్లేకుండా సేవ చేస్తున్న ప్రచారక్ లపై కేసీఆర్ అనుచిత ఆరోపణలు చేయడం సిగ్గు చేటన్నారు.
హైదరాబాద్ శివారులోని లియోనియా రిసార్ట్స్ లో ఈరోజు రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు జరిగాయి. ఇందులో భాగంగా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా... ఎంపీ సోయం బాపూరావు, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు, సోయం బాపూరావు, మాజీ ఎంపీలు నర్సయ్య గౌడ్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, చాడ శ్రీనివాస్ రెడ్డి సంపూర్ణంగా బలపరుస్తూ కొన్ని సూచనలు చేశారు. అనంతరం బండి సంజయ్ ప్రసంగిస్తూ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు.....
• బీజేపీ నిర్వహిస్తున్న ప్రశిక్షణా శిబిరాలు దేశవ్యాప్తంగా నిర్వహిస్తూ అనేక అంశాలపై చర్చిస్తూ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు యత్నిస్తోంది. ఈరోజు దేశంలో 7 వేల పార్టీలు ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ అయ్యాయి. బీజేపీ ఏనాడూ అడ్డదారుల్లో అధికారంలోకి రావాలని కోరుకోలేదు. ఏకాత్మ మానవతావాదమే మూల సిద్ధాంతం ద్వారా మాత్రమే అధికారంలోకి రావాలనుకుంటున్నం. అందుకోసం ఎంతోమంది పోరాటాలు చేశారు. ప్రాణత్యాగం చేశారు. అధికారంలోకి రావాలనే వారి కల సాకారం అవుతోంది.
• తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకువాలని పోరాటాలు చేస్తూ బలిదానమయ్యారు. టీఆర్ఎస్ మూర్ఖత్వపు పాలన అంతమయ్యే వరకు ప్రాణాలతో ఉండాలని మందాడి వంటి ఎందరో నేతలు పరితపించారు. కమ్యూనిస్టుల, టీఆర్ఎస్ గూండాల దాడికి ఎంతోమంది బలయ్యారు.
• బీజేపీ మాజీ ఎమ్మెల్యేలు గుజ్జుల రామక్రిష్ణారెడ్డి, ధర్మారావు, పేరాల శేఖర్, దుగ్యాల ప్రదీప్ కుమార్, కాసం వెంకటేశ్వర్లు, రమేశ్ ఆనాడు ఎంతగానో పోరాడారని, దాడులకు భయపడలేదు. నమ్మిన సిద్ధాంతం కోసం పూర్తి సమయం కేటాయించారు. గొప్ప కార్యకర్తలున్న పార్టీ బీజేపీ మాత్రమే.
• టీఆర్ఎస్ పార్టీ చేసిన త్యాగమేంటి? సామాన్య ప్రజలు తెలంగాణ కోసం బలిదానం చేస్తే... వాటిని తన ఖాతాలో వేసుకుంటూ అధికారం చెలాయిస్తూ మోసం చేస్తున్న పార్టీ టీఆర్ఎస్. చనిపోయిన వాళ్లందరికీ టీఆర్ఎస్ కార్యకర్తలుగా చెప్పుకునే నీచస్తాయికి దిగజారారు.
• సిద్ధాంతం, విధానం, పద్దతి లేని పార్టీ టీఆర్ఎస్. తెలంగాణ ఏర్పాటులో బీజేపీ ప్రధాన భూమిక పోషించింది. చిన్న రాష్ట్రాలకు బీజేపీ అనుకూలం. ‘‘స్మాల్ రాష్ట్రాలు... స్ట్ర్రాంగ్ కంట్రీ’’ బీజేపీ నినాదం.
• సుష్మాస్వరాజ్ మద్దతు లేకుంటే పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందేది కాదు... విజయశాంతి పార్లమెంట్ లో జై తెలంగాణ అని గర్జిస్తుంటే... పార్లమెంట్ కు రాకుండా ఇంటికే పరిమితమైన సిగ్గులేని నేత కేసీఆర్.
• శక్తివంతమైన భారత్ బీజేపీ నినాదం...ఆర్దిక, రక్షణ రంగాలతోపాటు అభివ్రుద్ది రంగాల్లో యూపీఏ హయాం అంతా అవినీతిమయమే. ప్రపంచంలో కుప్పకూలే 5 ప్రధాన దేశాల్లో నాడు భారత్ ఉండేది... మోదీ ప్రభుత్వం వచ్చాక.. నేడు పరిస్థితి మారింది. ప్రపంచంలో టాప్ 5 అభివ్రుద్ధి చెందిన దేశాల్లో భారత్ చోటు స్థానం సాధించింది. ఆర్ధికంగా అభివ్రుద్ధి చెందిన దేశాల్లో 3వ దేశంగా భారత్ స్థానం సంపాదించింది.
• భారత్ ఆర్దిక వ్రుద్ధి రేటు శరవేగంగా పెరుగుతోంది. 2047వరకు ఈ దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 100 ఏళ్లు అయ్యే నాటికి అభివ్రుద్ధి చెందిన అగ్రగామి దేశంగా భారత్ ప్రపంచ దేశాల సరసన చోటు సంపాదించుకోవడం తథ్యం. ప్రపంచదేశాలన్నీ భారత్ ను ఫాలో అవుతున్నాయి.
• ఇగ తెలంగాణ విషయానికొస్తే... తెలంగాణ ఏర్పడే నాటికి ధనిక రాష్ట్రం, మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం. కేసీఆర్ పాలనలో చిప్ప చేతికిచ్చి అడుక్కునే స్థాయికి దిగజార్చారు. పుట్టబోయే బిడ్డపై లక్షా 50 వేల అప్పు చేశారు. పెండ్లి చేసుకున్న పిల్లల్ని కనలేని దుస్థితి.
• కేసీఆర్ పాలన పుణ్యమా అని ఏటా 30 వేల కోట్ల వడ్డీ చెల్లిస్తున్నారు. మళ్లీ అవకాశమిస్తే... మరో 5 లక్షల కోట్ల అప్పు చేసి అప్పుల కట్టడానికే పరిమితమవుతారే తప్ప ప్రజలకు చేసిందేమీ లేదు. కేసీఆర్ పాలన బోర్డు తిప్పేసిన ఫైనాన్స్ సంస్థ మాదరిగా ఉంది. జీతాలిచ్చే పరిస్థితి లేదు.
• పక్కనున్న కర్నాటక రాష్ట్రం 60 వేల కోట్ల విదేశీ పెట్టుబడులు తీసుకొస్తే... తెలంగాణ తెచ్చింది 4 వేల కోట్లు మాత్రమే. అసలు పెట్టబడులు ఎందుకు రావడం లేదు? సీఎం కుటుంబానికి కమీషన్లు, వాటా ఇస్తేనే తప్ప పెట్టుబడులు రాలేని దుస్థితి. ఇక్కడికి ఏది రావాలన్నా... ‘‘నాకేంటి’’అనే భావనే తప్ప తెలంగాణ సమాజానికి మేలు జరగాలనే ఆలోచన కేసీఆర్ కు లేదు.
• కేంద్ర నిధులను దారి మళ్లిస్తున్నరు. సంక్షేమ పథకాలను తప్పుదోవ పట్టిస్తున్నడు. కేసీఆర్ దుర్మార్గాలను గ్రహించిన కేంద్రం నేరుగా గ్రామ పంచాయతీలకు నేరుగా నిధులు మంజూరు చేస్తూ... నిధులు దారి మళ్లకుండా చర్యలు తీసుకుంటుంటే... దానిని కూడా టీఆర్ఎస్ తప్పుపడుతుండటం సిగ్గు చేటు.
• కేంద్ర ప్రభుత్వం లక్షలాది మందికి ఉద్యోగాలిస్తుంటే...తెలంగాణలో నిరుద్యోగులకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వడం లేదు. గత నెలలో మోదీ ప్రభుత్వం 75 వేల మంది ఉద్యోగ నియామక పత్రాలందజేసింది. ఈరోజు కూడా ఏకంగా 71 వేల మందికి ఏకకాలంలో ఉద్యోగ నియామక పత్రాలు అందజేయడంతోపాటు ఏడాదిన్నరలో 10 లక్షల ఉద్యోగాలివ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. మరి కేసీఆర్ చేసిందేమిటి? ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా?
• సీఎం కేసీఆర్ చేతగాని పాలనవల్ల, కుట్రలవల్ల తెలంగాణకు సరైన న్యాయం జరగడం లేదు. ప్రధాని మోదీ ఇదే మాట చెప్పారు. స్వచ్చ భారత్ పేరుతో మరుగుదొడ్లు, అర్హులందరికీ ఇండ్లు, గ్యాస్ కనెక్షన్లు, ఉచిత బియ్యం అందిస్తున్న ఘనత మోదీదే. చీకట్లో ఉన్న 18 వేల గ్రామాలకు కరెంట్ కనెక్షన్లు ఇచ్చి వెలుగులు నింపిన ఘనత మోదీదే. ఎరువులు, విత్తనాలు, పనిముట్లపై సబ్సిడీలివ్వడంతోపాటు ఎకరాకు రూ.6వేల సాయం అందిస్తున్న ప్రభుత్వం మోదీదే.
• కేంద్రంలో ప్రతినెలా 1వ తేదీన ఉద్యోగులకు జీతాలొస్తాయి. కానీ రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదు. హరితహారం, స్మశాన వాటికలకు నిధులిస్తోంది కేంద్రమే. ఈ దేశంలో దళిత, గిరిజన, మైనారిటీ బిడ్డలను రాష్ట్రపతిగా చేసిన ఘనత బీజేపీదే.
• బిశ్వాల్ కమిటీ 1.91 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ప్రకటిస్తే.. ఒక్కటి కూడా భర్తీ చేయని ప్రభుత్వం టీఆర్ఎస్ దే. ఉద్యోగులకు ప్రమోషన్లు లేవు. బదిలీల్లేవు. కేసీఆర్ మూలంగా ఉన్నత ఉద్యోగాలు చేసే వాళ్లు డిమోషన్ల పేరుతో అంతకంటే తక్కువ ఉద్యోగాల్లో నియమిస్తూ అవమానపరుస్తున్నారు.
• 317 జీవో పేరుతో ఉద్యోగులను చెట్టుకొకరిని పుట్టకొకరిని చేసి 34 మంది చావులకు కారకుడైన కేసీఆర్ నిస్సిగ్గుగా ఆ జీవోను సమర్ధించుకోవడం సిగ్గు చేటు. బీజేపీ ప్రశ్నిస్తే తప్ప జీతాలివ్వలేని దుస్థితి తెలంగాణలో నెలకొంది. కొమ్ముకాసే ఉద్యోగ సంఘాల నేతలను ఫాంహౌజ్ కు పిలిపించుకుని బెదిరిస్తూ లోబర్చుకునే దుస్థితి.
• దళితులను, బీసీలను, గిరిజనులను మోసం చేస్తున్న వ్యక్తి కేసీఆర్. ఆయన పాలనలో ఏ బీసీ, ఎస్సీ, ఎస్టీ సంతోషంగా లేరు. ఆర్టీసీ ఉద్యోగులను రాచిరంపాన పెడుతున్నరు. వారి తరపున పోరాడిన అశ్వథ్తామరెడ్డి వంటి నాయకులపై కేసులు పెట్టి వేధిస్తున్నారు.
• కార్మికుల పక్షాన పోరాడతామని చెప్పుకునే కమ్యూనిస్టులు తమ సిద్ధాంతాలను సీఎం కేసీఆర్ కాళ్ల వద్ద పెట్టడం సిగ్గు చేటు.
• కాంగ్రెస్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఢిల్లీ నుండి గల్లీదాకా కాంగ్రెస్ అంతమైంది. వాళ్లకు వాళ్లే కూల్చుకుంటారు.
• రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్, కమ్యూనిస్టులతోపాటు అన్నీ పార్టీలు టీఆర్ఎస్ తో కలిసి బీజేపీని ఓడించేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ మేరకు కేసీఆర్ సంకేతాలు పంపుతున్నారు. మునుగోడులో ఆయా పార్టీలన్నీ కలిసినా 10 వేల ఓట్లకు మించి మెజారిటీ రాకపోవడంతో కేసీఆర్ గందరగోళంలో పడ్డారు.
• ఎవరెన్ని కుట్రలు చేసినా... బీజేపీ మాత్రం ప్రజల పక్షాన పోరాడుతొంది. ఇచ్చిన హామీలు అమలయ్యేదాకా ఒత్తిడి తెస్తోంది.
• బీజేపీ విధివిధానాలతో ముందుకు వెళుతోంది. కేసీఆర్ చేసిందేమీలేదు. ఒకవేళ పొరపాటున మళ్లీ అదికారంలోకి వస్తే అప్పుల కుప్ప పెరగడం తప్ప చేసేదేమీలేదు.
• తెలంగాణలో అప్పులు తీరాలంటే... అన్ని విధాలా అభివ్రుద్ది చెందాలంటే డబుల్ ఇంజిన్ సర్కార్ రావాల్సిందే...
• రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాల్లో ప్రజలకు ఉపయోగపడే ఏ ఒక్క పథకాన్ని రద్దు చేసే ప్రసక్తే లేదు. అవసరమైతే వాటని మరింత మెరుగ్గా అమలు చేసి అందరికీ వర్తింపజేస్తాం. గతంలో టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీ హయాంలో అమల్లోనున్న సంక్షేమ పథకాలను కొనసాగిస్తాం.
• పాదయాత్రలో పేర్కొన్నట్లుగా అర్హులందరికీ ఉచిత విద్య, వైద్యం అందిస్తాం. నిలువనీడలేక నిరుపేదలందరికీ పక్కా గ్రుహాలు నిర్మించి ఇస్తాం. అకాల వర్షాలవల్ల నష్టపోయిన పంటటకు ఫసల్ బీమా యోజన కింద పరిహారం అందిస్తాం.
• అనేక ఉద్యమాలు చేస్తూ తెలంగాణలోని రాక్షస, గడీల పాలనను అంతమొందించేందుకు బీజేపీ నిజాయతీగా సమష్టి పోరాటాలు చేస్తోంది. వీటిని గుర్తించాల్సిన అవసరం తెలంగాణ సమాజంపై ఉంది.
• వక్రభాష్యాలు చెప్పి నమ్మించి మోసం చేసి రాష్ట్రాన్ని ఆర్దికంగా దివాళా తీసి అప్పులపాల్జేసిన కేసీఆర్ మళ్లీ మోసపు హామీల పేరుతో అధికారంలోకి రావాలనుకుంటున్నడు.
• దేశ ప్రజలే కుటుంబంగా భావిస్తున్న ప్రధానిపై కేసీఆర్ అనుచిత ఆరోపణలు చేస్తున్నారు. పెళ్లికి దూరమై ప్రజలకు సేవ చేసేందుకు, కేసీఆర్ లాంటి మూర్ఖుల కబంధ హస్తాల నుండి తెలంగాణను రక్షించేందుకు ప్రచారక్ లుగా పనిచేస్తున్నారు. అలాంటి గొప్ప ప్రచారక్ వ్యవస్థను బెదిరిస్తూ కేసులు పెడుతుండటం సిగ్గు చేటు. అలాంటి వాళ్ల జోలికొస్తే ఖబడ్దార్...
• ఏం తప్పు చేశాడు బీఎల్ సంతోష్ జీ... ఆయనకు మీ లెక్క ఆస్తిపాస్తుల్లేవు. కుటుంబం లేదు. విదేశాల్లో పెట్టుబడుల్లేవు. బ్యాంకు ఖాతాల్లేవు. ఆయనపై కేసు పెడతారా? ఎవడో స్వామిజీ కోన్ కిస్కా చెప్పారని కేసులు పెట్టి అవమానిస్తారా? నీ రాజకీయ లబ్ది కోసం, నీ కుటుంబం కోసం ప్రజల ద్రుష్టిని మళ్లించేందుకే ప్రచారక్ వ్యవస్థనే కించపర్చావంటే... అసలు కేసీఆర్ మనిషివే కావని గుర్తుంచుకో...
• మీడియా వ్యక్తులకు నా విజ్ఝప్తి... దయచేసి ప్రచారక్ వంటి గొప్ప వ్యక్తులకు చెడ్డపేరొచ్చేలా వార్తలు రాయొద్దు. దేశం, ధర్మం కోసం పనిచేసే ప్రచారక్ లు కుటుంబం లేకుండా దేశమే కుటుంబంగా భావించి సేవ చేసే వాళ్లు.
• సీఎం కేసీఆర్ బీజేపీని అడ్డుకోలేక అడ్డదారులు తొక్కి బదనాం చేసేందుకు కుట్ర చేస్తున్నడు. అందులో భాగంగానే ప్రధాని వంటి వారిపైనా సంస్కార హీనంగా మాట్లాడుతున్నడు.
• అట్లాంటి కేసీఆర్ వంటి వ్యక్తులను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ప్రజల్లోకి కేసీఆర్ దుష్టపన్నాగాలను వివరించండి. ఆ దిశగా యుద్దం చేద్దాం. కేంద్ర సంక్షేమ పథకాలను వివరిద్దాం.
• ప్రజలకు భరోసా కల్పించేందుకే 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర చేయబోతున్నాం. కేసీఆర్ అడ్డుకోవాలని చూస్తున్నడు. కేసీఆర్.. మీ తాత అడ్డొచ్చినా యాత్ర ఆగదు. బైక్ ర్యాలీలు నిర్వహిస్తాం.
• ఎప్పుడు ఎన్నికలెప్పుడొచ్చినా గెలుపు బీజేపీదే. నీ నిజాం రాచరిక పాలనను అడ్డుకుంటాం. గొల్లకొండ కోటపై కాషాయ జెండాను రెపరెపలాడిస్తాం. యుద్దానికి బీజేపీ కార్యకర్తలు సిద్ధం. నీ కుట్రలను ఎక్కడికక్కడ అడ్డుకుని తీరుతాం. తెలంగాణ సమాజాన్ని కాపాడుకుంటాం. నీ గడీలు బద్దలు కొడతాం. నీ కుటుంబ అవినీతిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. పేదల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం.
• ఒక్కసారి బీజేపీకి అధికారం ఇవ్వండి. అభివ్రుద్ధి చెందిన తెలంగాణగా మారుస్తాం. ఏ ఆశయం కోసం తెలంగాణ తెచ్చుకున్నామో ఆ ఆశయ సాధన దిశగా పనిచేస్తాం.
• ఈ సమావేశాలకు ఎంపీ సోయం బాపూరావు, జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్, ఏపీ జితేందర్ రెడ్డి, గరికపాటి మోహన్ రావు, విజయశాంతి, జి.వివేక్, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, ప్రధాన కార్యదర్శులు జి.ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్, బంగారు శ్రుతి తదితరులు హజరయ్యారు.