పార్టీని వీడేవాళ్లంతా చెప్పే ఒకే ఒక్క మాట కాంగ్రెస్‌కి ఇప్పుడు పోరాడే దమ్ములేదు. రెండోది రేవంత్ రెడ్డి వల్లే పార్టీని వీడుతున్నామని చెప్పడం. ఈ రెండు ప్రధాన కారణాలపై ఎందుకు అధిష్ఠానం మౌనంగా ఉంది? తెలంగాణ ఇచ్చిన, తెచ్చిన కాంగ్రెస్ పరిస్థితి ఎందుకు రాష్ట్రంలో కనిపించకుండా పోతోంది? రాహుల్ పాదయాత్రతో ఆగాల్సిన పార్టీ వలసలు ఇంకా ఎందుకు కొనసాగుతున్నాయి? ఒక్క రేవంత్ కోసం ఇంతమంది సీనియర్లను కాంగ్రెస్ ఎందుకు వదులుకుంటోంది ? అర్థం కాని ప్రశ్నలా ..ఆలోచింప చేసే విషయాలా?
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పరిస్థితి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అసలు ఇక ఆ పార్టీ గురించి చర్చించడం వేస్ట్ అన్న మాట హస్తం నేతల నుంచే వినిపించడం ఆశ్చర్యం కలిగించే విషయం. పక్కన ఉన్న బీజేపీ కానీ, టీఆర్ఎస్ అయితే అసలు కాంగ్రెస్ ఊసే ఎత్తడంలేదు. ఇక ఒకరు కాదు ఇద్దరు కాదు పార్టీని వీడుతున్న సీనియర్లంతా చెబుతున్న ఒకే ఒక్క మాట ఇక తెలంగాణని హస్తగతం చేసుకునే బలం పార్టీకి లేదు. రేవంత్ రెడ్డి వల్లే పార్టీ నాశనమవుతోంది. అధిష్ఠానాన్ని ఆయన తప్పుదోవ పట్టిస్తున్నారు. రాష్ట్ర వ్యవహారాల నేతలు సైతం రేవంత్ రెడ్డితో కలిసి పార్టీని బలహీనపరుస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇప్పుడీ మాటలే మరోసారి రాజకీయవర్గాల్లో హైలెట్ గా మారాయి.
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకి దూరంగా ఉన్న సీనియర్లు, రేవంత్ కి వ్యతిరేకంగా ఉన్న నేతలంతా ఒక్కొక్కరు పార్టీని వీడుతున్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించి, కొన్నాళ్లు పాటు బలం, బలగాన్ని పెంచుకున్న నేతలంతా ఇప్పుడు పార్టీని వదిలేస్తున్నారు. రాష్ట్రంలో పార్టీ బలహీనంగా ఉందన్న విషయం తెలిసి కూడా అండగా ఉండాల్సిన సమయంలో మాకెందుకు అని రోడ్డున పడేశారని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే తెలంగాణ రాష్ట్ర వ్యవహారాలను ప్రియాంకగాంధీ చూస్తారన్న వార్తల వస్తున్నా కూడా ఈ సీనియర్ల వలసలు ఆగకపోవడం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది.
పార్టీని వీడుతున్న నేతలంతా పీసీసీ అధినేత రేవంత్‌ని టార్గెట్ చేస్తున్నప్పటికీ అధిష్ఠానం ఎందుకు మౌనంగా ఉంది? టీకాంగ్రెస్‌లోని కుమ్ములాటలు తెలిసి కూడా ఎందుకు రేవంత్ పై చర్యలు తీసుకోవడం లేదు ? అన్నదానిపై పలు వాదనలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్‌లో వృద్ధలీడర్లు చాలామందే ఉన్నారు. వీరి వల్ల పార్టీకి ఎలాంటి ప్రయోజనం లేదన్న నిర్ణయానికి వచ్చేసిందట అధిష్ఠానం. అనుభవాన్ని ఉపయోగించుకోవాలనుకున్నా అది పార్టీకి ఆశించిన స్థాయిలో లభించడం లేదట. అందుకే వెళ్లిపోతున్నవారిని ఆపేకన్నా ఉన్నవారిని ఆదరించడం బెస్ట్ అని అధిష్ఠానం డిసైడ్ అయ్యిందట. యువతకి అవకాశం ఇవ్వడంతో పాటు రెండోశ్రేణి నాయకులను ప్రోత్సహించాలన్న ఆలోచనకు వచ్చిందట. అందులో భాగంగానే రాహుల్, ప్రియాంకలతోపాటు కొత్త అధ్యక్షుడు ఖర్గే త్వరలో తెలంగాణ రానున్నారని సమాచారం. వచ్చే ఎన్నికలను కాకుండా భవిష్యత్‌ని దృష్టిలో పెట్టుకొని వెళ్లిపోయే వాళ్లని పట్టుకొని వేలాడే కన్నా వస్తామని ఆసక్తి చూపించే వారినే అక్కున చేర్చుకోవాలని కాంగ్రెస్ నిర్ణయించిందట. అంతేకాదు మరికొన్ని రోజుల్లో నోరుపారేస్తుకునే నేతలను కూడా సాగనంపే ఆలోచనలో ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి.