Traffic CI Shyam Sundar: భర్తతో గొడవ పడిన ఓ మహిళ చనిపోవాలని నిర్ణయించుకుంది. తానొక్కతే ఆత్మహత్య చేసుకుంటే పిల్లలు అనాథలై పోతారని భావించిన ఆమె పిల్లలను తీసుకొని ఇంటి నుంచి బయటకు వచ్చింది. దగ్గరలోని చెరువు వద్దకు వెళ్లి పిల్లలతో సహా కలిసి నీళ్లలో దూకి చనిపోవాలనుకుంది. అయితే ఈ ముగ్గురిని అక్కడే ఉన్న ఓ పోలీసులు గమనించారు. వారు అలా చెరువులో దూకగానే పోలీసులు కూడా దూకి వారిని కాపాడారు.
అసలేం జరిగిందంటే..?
హైదరాబాద్ జిల్లా బండ్లగూడ జాగర కార్పొరేషన్ హైదర్ షా కోట్ ప్రాంతానికి చెందిన కుర్మమ్మ తన భర్తతో గొడవ పడింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె చనిపోవాలనుకుంది. పిల్లలను భర్త వద్దే వదిలి వెళ్తే.. వారు అనాథలైపోతారని భావించింది. అలా జరగడం ఇష్టం లేని కుర్మమ్మ పిల్లలతో సహా బయటకు వచ్చింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హిమాయత్ సాగర్ చెరువులో దూకేందుకు యత్నించింది. అయితే కొంచెం దూరంలో ఉన్న ట్రాఫిక్ సీఐ శ్యాంసుందర్ రెడ్డి విషయాన్ని గుర్తించారు. వెంటనే ఆయన కూడా చెరువులో దూకి తల్లితో పాటు పిల్లలను కాపాడారు. సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ఆపై వారిని రాజేంద్రనగర్ పోలీసులకు అప్పగించారు.
ఆ తర్వాత ఆత్మహత్యకు పాల్పడ్డ మహిళకు రాజేంద్ర నగర్ పోలీసులు కౌన్సిలింగ్ ఇప్పించారు. మహిళ, ఇద్దరు పిల్లలను కాపాడి ఓ కుటుంబాన్ని నిలబెట్టిన ట్రాఫిక్ సీఐ శ్యాం సుందర్ రెడ్డి, సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.
ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న వివాహిత..
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో విషాదం చోటుచేసుకుంది. ఓ వివాహిత క్షణికావేశంలో తన ఇద్దరు పిల్లలతో కలిసి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆమెకు వివాహమై ఏడేళ్లు అయింది. అత్తింటి వారితో చిన్నచిన్న సమస్యలు, మనస్పర్థలున్నట్లు తెలుస్తోంది. ఏం జరిగిందో ఏమో ఆమె తీవ్ర నిర్ణయం తీసుకుంది. చనిపోవాలని నిర్ణయించుకుంది. తాను మరణిస్తూ అభంశుభం ఎరుగని ఐదేళ్లు కూడా నిండని బిడ్డలనూ వెంట తీసుకెళ్లింది. ఈ విషాద ఘటన అందరిని కలచివేసింది.
కుటుంబ కలహాలతో..
ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలం పిప్పిరి గ్రామానికి చెందిన వేదశ్రీ (23)కు, ఇచ్చోడ మండల కేంద్రానికి చెందిన ప్రశాంత్ తో 2015లో వివాహమైంది. ప్రశాంత్ ఓ ప్రైవేటు ఫైనాన్స్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు ప్రజ్ఞ(5), వెన్నెల (3). ఇచ్చోడలో అద్దె ఇంట్లో కాపురం ఉంటున్నారు. భర్త యథావిధిగా ఉద్యోగానికి వెళ్లగా, ఇంట్లోనే ఉన్న వేదశ్రీ గురువారం సాయంత్రం కుమార్తెలను వెంటబెట్టుకుని వంట గదిలోకి వెళ్లింది. పిల్లలతోపాటు తనపైనా పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుంది. ఇంటి లోపలి నుంచి పొగలు రావడాన్ని గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. వారు హుటాహుటిన వచ్చి తలుపులు పగలగొట్టారు. తల్లీబిడ్డలు మంటల్లో కాలిపోతున్నట్టు గుర్తించి మంటలు ఆర్పారు. అప్పటికే వేదశ్రీ మృతి చెందగా, కొన ఊపిరితో ఉన్న చిన్నారులను అంబులెన్స్ లో ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తొలుత ప్రజ్ఞ, రెండు గంటల తర్వాత వెన్నెల మరణించారు. వేదశ్రీకి, అత్తింటి వారికి మధ్య మనస్పర్దలున్నట్టు, ఈ క్రమంలోనే వేరుకాపురం పెట్టినట్టు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.