Hyderabad: సులువుగా డబ్బులు సంపాధించాలనే ఉద్దేశంతో చాలా మంది డ్రగ్స్ సరఫరాలకు పాల్పడుతున్నారు. తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. వీటిని అరికట్టేందుకు పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. రోజుకో చోట ఇలాంటి కేసులు వెలుగులోకి వస్తున్నాయి. అయితే తాజాగా సైబరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో.. అక్రమంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు. కోట్లాది రూపాయల విలువ చేసే కొకైన్ ను స్వాధీనం చేసుకొని ఐదుగురిని అరెస్ట్ చేశారు. 


అసలేం జరిగిందంటే?


సైబరాబాద్ లో అక్రమంగా భారీగా మత్తు పదార్థాలు రవాణా చేస్తున్న డ్రగ్స్ ముఠాను సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. కోట్లాది రూపాయల విలువ చేసే కొకైన్ ను సీజ్ చేశారు. డ్రగ్స్ సరఫరాలో కింగ్ పిన్ గా ఉన్న చింతా రాకేష్ ను కూడా అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ముఠా.. ఇంజినీరింగ్ విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఇంది ఎంత కాలం నుంచి సాగుతుంది, దీని వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఏయే ప్రాంతాల్లో డ్రగ్స్ అక్రమా రవాణా చేస్తున్నారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డ్రగ్ కింగ్ పిన్ తో పాటు  మరో నలుగురు అరెస్ట్ అవ్వడంతో.. త్వరలోనే మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 


ఫిబ్రవరిలోనూ ఇలాంటి ఘటనే - ఈజీ మనీ కోసం


సులువుగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశ్యంతో డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఐదుగురు యువకులను కూకట్ పల్లి ఎస్ఓటీ పోలీసులు అరెస్టే చేశారు. 24 ఏళ్ల పవన్ కుమార్ అనే ఓ వ్యక్తి.. బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాడు. మరోవైపు అధిక మొత్తంలో డబ్బులు సంపాదించేందుకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడు. ఈ క్రమంలోనే నైజీరియన్ దగ్గర నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసి తీసుకొచ్చి హైదరాబాద్ లో విక్రయిస్తుంటాడు. ఈ క్రమంలోనే కూకట్ పల్లిలోని రంగదాముని చెరువు సమీపంలో పవన్ కుమార్ వేరే వాళ్లకు డ్రగ్స్ అమ్ముతుండగా.. ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. అతడితో పాటు డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న  హరి కృష్ణ(21), కిరణ్ తేజ(20), సాయి కుమార్(24), రఘు(23) అనే నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు నదిలా అలీ అనే వ్యక్తి పరారీలో ఉన్నట్లు బాలానగర్ డీసీపీ శ్రీనివాసరావు వెల్లడించారు. నిందితుల వద్ద నుండి 18 గ్రాములు ఎండీఎంఏ డ్రగ్స్ తో పాటు నాలుగు సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నామని వివరించారు. వాటి విలువ లక్ష రూపాయల వరకు ఉంటుందని డీసీపీ వెల్లడించారు. వారంతా యువకులేనని, ఉన్నత చదువు పూర్తయ్యాక జాబ్ సెర్చింగ్ కోసం చూస్తున్న సమయంలో ఈజీ మనీ కోసం ఇలాంటి పని చేశారని పోలీసులు వెల్లడించారు.


సులువుగా డబ్బులు సంపాధించాలనే ఉద్దేశంతో ఇలాంటి పనులు చేస్తే.. జీవితాలే పాడవుతాయని పోలీసులు చెబుతున్నారు. విద్యార్థులు ఎవరూ ఇలాంటి పనులు చేయొద్దని సూచిస్తున్నారు. బాగా చదువుకొని ఉద్యోగాలు తెచ్చుకోవాలని కానీ... ఇలాంటి అక్రమ పనులకు పాల్పడి జైలుకు వెళ్లకండని హితవు పలికారు.