ఉస్మానియా ఆస్పత్రికి సంబంధించిన ఓల్డ్ బిల్డింగ్ లో ఓ పాము అక్కడున్నవారిని కంగారు పెట్టించింది. పాత భవనంలో కనిపించిన ఈ పాము కనిపించడంతో డాక్టర్లు, మెడికల్ స్టూడెంట్స్ భయానికి గురై పరుగులు పెట్టారు. శనివారం ఉందయం 10 గంటలకు ఉస్మానియా ఓల్డ్ బిల్డింగ్ లో జనరల్‌ సర్జరీ విభాగం దగ్గర ఈ పాము కనిపించింది. వెంటనే మెడికల్ స్టూడెంట్స్ హాస్పిటల్ సెక్యూరిటీ సిబ్బంది, అధికారులకు సమాచారం అందించారు. వారు వెంటనే స్నేక్‌ సొసైటీ ప్రతినిధులను హుటాహుటిన పిలిపించారు. 


వారు చాకచక్యంగా పామును పట్టేసుకోవడంతో అక్కడున్న డాక్టర్లు, మెడికల్ స్టూడెంట్స్ ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలా ఉండగా వర్షాకాలం వచ్చిందంటే ఉస్మానియాలో పాముల బెడద విపరీతంగా ఉంటోందని, ఆస్పత్రిని ఆనుకొని మూసీ నది ఉండడంతో అందులో నుంచి పాములు వస్తున్నట్టు విద్యార్థులు చెబుతున్నారు. ఆస్పత్రి పరిసర ప్రాంతాల్లో కూడా పాములు చాలా సార్లు కనిపించాయని చెప్పారు.


ఏదో రకం సమస్యలతో ఎప్పుడూ ఉస్మానియా ఆస్పత్రి వార్తల్లో నిలుస్తూ ఉండే సంగతి తెలిసిందే. ఇటీవలే మే నెలాఖరులో ఓ అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆస్పత్రి మార్చురీలో సిబ్బంది దౌర్జన్యం ప్రదర్శించారు. ఓ శవం విషయంలో మార్చురీ సిబ్బంది లంచం డిమాండ్‌ చేశారు. ప్రశ్నించినందుకు బాధిత కుటుంబ సభ్యులపై జులుం కూడా ప్రదర్శించారు.  దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ కూడా అయింది.


హైదరాబాద్‌లోని చాదర్‌ ఘాట్‌ ప్రాంతానికి చెందిన మజీద్‌ అనే ఓ వ్యక్తి ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉండడం వల్ల ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు మజీద్‌ మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అయితే, రూ.వెయ్యి ఇస్తేనే మృతదేహాన్ని తీసుకుంటామని మార్చురీ సిబ్బంది చెప్పారు. దీంతో డబ్బులు ఎందుకు ఇవ్వాలని బాధితులు గొడవకు దిగారు. 


సిబ్బంది ఏకంగా రూ.వెయ్యి రూపాయలు డిమాండ్‌ చేస్తూ మృతుడి బంధువులతో గొడవకు దిగారు. డబ్బులు ఇవ్వాల్సిందేనంటూ వారిపై అధికారం చెలాయించాడు. దీంతో తాగిన మత్తులో మార్చురీ సిబ్బంది బీభత్సం సృష్టించారు. మార్చురీ సిబ్బంది తీరుతో కోపోద్రిక్తులై స్థానికులు ఉస్మానియా ఆస్పత్రి వద్ద ఆందోళన చేశారు.