హైదరాబాద్ లోని రియల్ ఎస్టేట్ రంగంలో గణనీయమైన వృద్ధి నమోదైంది. 2020 నుంచి కరోనా కారణంగా కుంటుపడ్డ ఆ రంగం అతి త్వరలోనే నిలదొక్కుకోగలిగింది. 2022 ఏడాది ప్రారంభం అయిన ఈ 8 నెలల్లోనే అమ్ముడైన రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లెక్కలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఈ ఏడాది మొదటి నుంచి ఇప్పటి దాకా 8 నెలల్లోనే 22 వేల 680 కోట్ల రూపాయల విలువైన 46,078 రెసిడెన్షియల్‌ కాంప్లెక్స్‌లు అమ్ముడు అయ్యాయి. గత ఆగస్టు నెలలోనే 5,181 రెసిడెన్షియల్‌ ప్రాపర్టీలు రిజిస్టర్‌ అయ్యాయి. అంతకుముందు జులై నెలతో పోల్చితే ఇది 20 శాతం ఎక్కవ. 


జులైలో నెలలో ఆషాఢ మాసం వల్ల మంచి పనికి అంతగా శుభం కాదనే ఉద్దేశంతో ఇళ్ల కొనుగోళ్లు, రిజిస్ట్రేషన్లకు ప్రజలు పెద్దగా ఆసక్తి చూపలేదు. ఆ నెల గడిచే వరకూ ఆగి చాలా మంది జనాలు ఆగస్టులో కొనుగోళ్లు పెట్టుకున్నారు. దాంతో ఒక్క నెలలోనే రూ.2,658 కోట్ల విలువైన అమ్మకాలు జరిగినట్లయింది.


హైదరాబాద్ లో కొనుగోళ్లు అంటే నాలుగు జిల్లాలు హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి కలిపి పై లెక్కలు నమోదయ్యాయి. రెసిడెన్షియల్ యూనిట్స్‌లో 25 లక్షల నుంచి 50 లక్షల మధ్య ధర ఉన్నవి 55 శాతం ఒక్క ఆగస్టులో అమ్ముడు అయ్యాయి. వెయ్యి స్క్వేర్ ఫీట్స్ లో ఉండే ఫ్లాట్లు దాదాపు 83 శాతం ఉన్నట్లుగా ఓ నివేదికలో స్పష్టం అయింది. వెయ్యి నుంచి 2 వేల స్క్వేర్ ఫీట్స్ ఉండే యూనిట్స్ కూడా అధికంగానే అమ్ముడు అయ్యాయి. 


పెరిగిన ఇళ్ల ధరలు
మరోవైపు, ఇళ్ల ధరలు బాగానే పెరిగాయి. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో దేశంలో హైదరాబాద్ తో పాటు 42 నగరాల్లో ఇళ్ల ధరలు పెరిగినట్లుగా ఓ నివేదిక స్పష్టం చేసింది. అదే సమయంలో 5 నగరాల్లో ఇళ్ల ధరలు తగ్గాయి. 3 నగరాల్లో ధరలు స్థిరంగా ఉన్నాయి. నేషనల్ హౌసింగ్ బ్యాంక్ హౌసింగ్ ప్రైస్ ఇండెక్స్ ఇటీవల ఈ సమాచారం వెల్లడించింది. 


నేషనల్ హౌసింగ్ బ్యాంక్ సమాచారం ప్రకారం.. 8 ప్రధాన మెట్రో నగరాల్లో వార్షిక ప్రాతిపదికన ఇండెక్స్ పెరిగింది. ఇందులో అహ్మదాబాద్ (13.5 శాతం), చెన్నై (12.5 శాతం), హైదరాబాద్ (11.5 శాతం), ఢిల్లీ (7.5 శాతం), కోల్‌కతా (6.1 శాతం), పుణె (3.6 శాతం), బెంగళూరు (3.4 శాతం), ముంబయి (2.9 శాతం) ఉన్నాయి. 


అయితే నవీ ముంబైలోని హౌసింగ్ ప్రైస్ ఇండెక్స్ లో వార్షిక ప్రాతిపదికన పెద్ద తేడా ఉంది. కోయంబత్తూరులో 16.1 శాతం పెరిగింది. అదే సమయంలో నవీ ముంబైలో 5.1 శాతం క్షీణించింది. హౌసింగ్ ప్రైస్ ఇండెక్స్ లో 2017-18ని బేస్ ఇయర్‌గా తీసుకుంటారు. ఇది త్రైమాసిక ప్రాతిపదికన 50 నగరాల్లో ప్రాపర్టీ ధరల తీరును ట్రాక్ చేస్తుంది. ఏది ఏమైనప్పటికీ ద్రవ్యోల్బణం కారణంగా మెట్రో నగరాల్లో ఇల్లు కొనడం చాలా కష్టంగా మారింది.