తెలుగు దేశం పార్టీలో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న నటి దివ్యవాణి కొంత కాలం క్రితం అందులో నుంచి బయటికి వచ్చిన సంగతి తెలిసిందే. పార్టీలోని పెద్దలు తనకు తగిన గౌరవం ఇవ్వడం లేదని ఆరోపిస్తూ అసహనంతో ఆమె బయటకు వస్తున్నట్లు ప్రకటించారు. అయితే, నటి దివ్యవాణి ఇప్పుడు తెలంగాణ రాజకీయాలవైపు చూస్తున్నట్లుగా తెలుస్తోంది. గురువారం ఉదయం ఆమె బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను ఆయన నివాసానికి వెళ్లి కలిశారు. షామీర్ పేటలోని ఈటల రాజేందర్ నివాసంలో ఆయన్ను కలిసిన సందర్భంగా బీజేపీలో చేరతానని ఆమె ఈటలను కోరినట్లు తెలుస్తోంది. అయితే, అధిష్ఠానంతో చర్చించి నిర్ణయం చెబుతామని ఈటల చెప్పినట్లుగా సమాచారం. 


ఇప్పటికే సినీ గ్లామర్ ను పార్టీలోకి ఆహ్వానించి తమకు అనుకూలంగా మలచుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే అమిత్ షాతో ఎన్టీఆర్, జేపీ నడ్డాతో నితిన్ భేటీ అయ్యారు. ఇక జయసుధ కూడా కమలం తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా మరో నటి దివ్యవాణి బీజేపీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.


దివ్యవాణి టీడీపీని వీడుతున్నట్లుగా గత జూన్ నెల 2న ప్రకటించారు. ఆ రోజు అసహనంతో ప్రెస్ మీట్ పెట్టారు. టీడీపీ అధికార ప్రతినిధిగా, ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న నటి దివ్యవాణి అంతకు రెండు రోజుల ముందే (మే నెలాఖరులో) టీడీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.


ఏడాదిగా సరైన మర్యాద ఇవ్వడం లేదనే..
టీడీపీ నుంచి వైదొలుగుతున్నందుకు కన్నీరు పెట్టుకున్నారు. తనకు ఏడాది కాలంగా పార్టీలో సరైన గుర్తింపు లేదని చెప్పారు. ఓ నేతను ప్రశ్నించినందుకు నేతలంతా తనను దూరం పెట్టారని అన్నారు. తనను ఎవరు ఎన్ని మాటలు అన్నా తాను పట్టించుకోబోనని, కానీ ఎవరైనా చంద్రబాబును మాట అంటే మాత్రం తాను తట్టుకోలేనని అన్నారు.


‘‘బుద్ధి లేని వాళ్లు.. బుద్ధి లేని మాటలు మాట్లాడుతున్నారు. ఏదో ప్యాకేజీ అందిందని అందుకే రాజీనామా చేయడం లేదని విమర్శించారు. మహానాడులో తన పేరు రాలేదని, అందుకే ఇప్పుడు హైలెట్ చేసుకుంటోందని కొందరు మూర్ఖులు మాట్లాడుతున్నారు. వారి మాటలు నేను పట్టించుకోను. చివరి నిమిషం వరకూ క్లారిటీ తీసుకునేందుకే నేను ఆగాను. దివ్యవాణి అంటే బాపు బొమ్మ అనేది మర్చిపోయి నాపై విమర్శలు చేశారు. సినిమా ఇండస్ట్రీలో గాజు బొమ్మలాగా ఉండేదాన్ని. పెద్ద పెద్ద హీరోలతో కేవలం స్వాభిమానం చంపుకోలేక మాత్రమే నటించలేదు. అలాంటి నాపై విమర్శలు చేస్తున్నారు. పార్టీలో చేరిన కొద్ది రోజులకే ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్నాను. ఒక మంచి నేత వద్ద పని చేస్తే ప్రజలకు సేవ చేసే అవకాశం వస్తుందనే ఆశయంతో టీడీపీలో చేరాను.’’


‘‘ఈ మధ్య కాలంలో 40 ఏళ్ల టీడీపీ అనే కార్యక్రమం తెలంగాణలో జరిగింది. అందులో కూడా నాకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదు. నాకు జరిగిన అన్యాయాన్ని చంద్రబాబుకు చెప్తామంటే కలిసే అవకాశం ఇవ్వట్లేదు. మహిళా అధ్యక్షురాళ్లకి, పొలిట్ బ్యూరో సభ్యులకు నియోజకవర్గాలు అప్పజెప్పారు. కానీ, అధికార ప్రతినిధి అయిన నేను ప్రెస్ మీట్ల కోసం అడుక్కోవాల్సిన పరిస్థితి నాకు ఎదురైంది. ఆఖరికి ఓ కార్యక్రమానికి టీడీపీ కార్యక్రమానికి హాజరవుతుంటే.. ఓ బాయ్ నన్ను ఆపేశాడు. మిమ్మల్ని రానివ్వద్దని అన్నారు. టీడీ జనార్థన్ అనే వ్యక్తిని నేను ప్రశ్నించినందుకు నాకు నరకం చూపిస్తున్నారు.’’ అని దివ్యవాణి ఆవేదన వ్యక్తం చేశారు.