హైదరాబాద్‌లో గణేష్ శోభాయాత్రకు సర్వం సిద్దమైంది. తెలుగు రాష్ట్రాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్న నిమజ్జనం పండుగ మరికొద్ది గంటల్లో ప్రారంభంకానుంది. మొదట హైదరాబాద్‌లో ముఖ్యంగా హుసేన్‌ సాగర్‌లో గణేష్ నిమజ్జన విషయంలో ప్రభుత్వం నిబంధనల పేరుతో ఆటంకాలు సృష్టించాలని చూస్తోందని భాగ్యనగర ఉత్సవ కమిటీ నిరసనకు దిగింది. దీక్షకు పూనుకుంది. ఇదిలా ఉంటే కోర్టు ఆదేశాల నేపథ్యంలో సాగర్‌లో కేవలం మట్టి విగ్రహాలు మాత్రమే నిమజ్జనం చేయాలంటూ ప్రభుత్వం చెబుతోంది. ఎట్టకేలకు హుసేన్ సాగర్‌లో భారీ ఏర్పాట్లను చేయడంతో నిమజ్జన వివాదం తాత్కాలికంగా సద్దుమణిగింది. 


హుసేన్ సాగర్ వద్ద ఇప్పటికే నలభైకుపైగా భారీ క్రేన్‌లను ఏర్పాటు చేయడంతోపాటు వివిధ శాఖల సమన్వయంతో భక్తులకు ఇబ్బందులు కలుగకుండా సర్వం సిద్ధం చేస్తున్నారు. తొమ్మిది రోజులపాటు భాగ్యనగరంలో వివిధ మండపాల్లో కొలువుదీరిన గణనాథుడు తొమ్మిదివ తేది ( శుక్రవారం) నిమజ్జనానికి తరలిరానున్నాడు. నిమజ్జన పండగ సందర్భంగా తెలంగాణా ప్రభుత్వం నగరంలో ప్రభుత్వ కార్యాలయాలకు, పాఠశాలలకు సెలవులు ప్రకటించింది.


వేలాదిగా గణపతి విగ్రహాలు ట్యాంక్ బండ్ వైపు తరలిరానున్న వేళ ఆయా మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు,దారి మళ్లింపు చేశారు.  శోభాయాత్ర ర్యాలీ రూట్ మ్యాప్ ను విడుదల చేశారు నగర ట్రాఫిక్ పోలీసులు..


నగరంలో శోభాయాత్ర సాగే మార్గాలు ఇలా..


ఉప్పల్ వైపు నుంచి ప్రారంభమయ్యే బొజ్జగణపయ్య శోభాయాత్ర ఉప్పల్, రామంతపూర్, అంబర్‌పేట్, శివంరోడ్, ఓయూ వద్ద ఎన్‌సిసి, దుర్గాబాయిదేశ్‌ముఖ్ హాస్పిటల్, హిందీ మహావిద్యాలయ క్రాస్ రోడ్స్ మీదుగా వచ్చి ఫీవర్ హాస్పిటల్ బర్కత్‌పురా క్రాస్ రోడ్స్, నారాయణగూడ క్రాస్ రోడ్స్ నుంచి అటుగా ఆర్టీసి క్రాస్ రోడ్స్ నుంచి వచ్చే ఊరేగింపులో కలుస్తుంది. దిల్‌సుఖ్ నగర్ నుంచి విగ్రహాలు ఐఎస్ సదన్, సైదాబాద్, చంచల్ గూడ, నల్గొండ క్రాస్ రోడ్ల నుంచి వచ్చే ఊరేగింపులో కలుస్తాయి. కొన్ని పెద్ద విగ్రహాలు మూసారాంబాగ్ మీదుగా అంబర్ పేట్ వైపు సాగుతాయి. తార్నాక వైపు నుంచి వచ్చే విగ్రహాలు ఉస్మానియా యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ రోడ్డు, అడిక్‌మెట్, విద్యానగర్ మీదుగా ఫీవర్ హాస్పిటల్ వద్దకు వచ్చి కలుస్తాయి.


గణేష్ శోభాయాత్ర కేశవగిరి నుంచి ప్రారంభమవుతూ చాంద్రాయణగుట్ట, ఎంబిఎన్ ఆర్ క్రాస్ రోడ్ మీదుగా ఫలక్‌నుమా రైల్ ఓవర్ బ్రిడ్జి నుంచి అలియాబాద్, నాగుల్చింత, చార్మినార్, మదీనా, అఫ్జల్‌గంజ్-SA బజార్, ఎమ్.జే.మార్కెట్ మీదుగా అబిడ్స్, బర్కర్‌షీర్, అబిడ్స్ ఎన్టీఆర్ మార్గ్, విపిఎన్‌ఆర్ మార్గ్(నెక్లెస్ రోడ్)కు చేరుతుంది. టోలిచౌకి వైపు నుంచి వచ్చే శోభాయాత్ర టోలీ చౌకి, రేతిబౌలి, మెహదీపట్నం వైపు నుంచి ఊరేగింపుగా మాసబ్ ట్యాంక్, అయోధ్య జంక్షన్, నిరంకారి భవన్, పాత PS సైఫాబాద్, ఇక్బాల్మినార్ మీదుగా ఎన్టీఆర్ మార్గ్ వరకు చేరుకుంటాయి. సికింద్రాబాద్ వైపు నుంచి వచ్చే గణేష్ విగ్రహాలు సికింద్రాబాద్, ఆర్‌పి రోడ్, ఎంజీరోడ్, కర్బలా మైదాన్, కవాడిగూడ, ముషీరాబాద్ ఎక్స్‌రోడ్, ఆర్‌టిసి క్రాస్ రోడ్, నారాయణగూడ క్రాస్ రోడ్, హిమాయత్‌నగర్ వై జంక్షన్ మీదుగా వెళ్లి లిబర్టీ వద్ద ప్రధాన ఊరేగింపులో కలుస్తుంది.చిల్కలగూడ క్రాస్ రోడ్స్ నుంచి వచ్చే విగ్రహాలు ముషీరాబాద్‌లో వద్ద కలుస్తాయి.


ఎర్రగడ్డ నుంచి వచ్చే శోభాయాత్ర ఎర్రగడ్డ మీదుగా ఎస్‌ఆర్‌నగర్‌,అమీర్‌పేట,పంజాగుట్ట,ఖైరతాబాద్‌ నుంచి సాగర్ వద్దకు చేరుకుంటాయి. మెహదీపట్నం నుంచి వచ్చే ఊరేగింపు నిరంకారిభవన్‌లో చేరి ఎన్టీఆర్‌ మార్గ్‌కు చేరుకుంటాయి. టప్పాచబుత్ర, ఆసిఫ్‌నగర్ వైపు నుంచి వచ్చే విగ్రహాలు, సీతారాంబాగ్, బోయిగూడ కమాన్, వోల్గా హోటల్, గోషామహల్ బరాదరి, అలాస్కా మీదుగా ఎమ్‌జె మార్కెట్‌లోని ప్రధాన ఊరేగింపులో చేరి అక్కడి నుంచి అబిడ్స్, బషీర్‌బాగ్, లిబర్టీ, అంబేద్కర్ విగ్రహం నుంచి ఎన్టీఆర్ మార్గ్, పివిఎన్ ఆర్ మార్గ్(నెక్‌లాస్ రోడ్)కు చేరుకుంటాయి. 


రాచకొండ పరిధిలోని సరూర్ నగర్, నల్లచెరువుకట్ట, ఉప్పల్, సఫిల్‌గూడ వంటి ఇతర ట్యాంక్ లపైనా నిమజ్జనం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. శుక్రవారం ఉదయం నుంచి మరుసటి రోజు అనగా శనివారం 10గంటల వరకూ నగరంలో ముఖ్యంగా శోభాయాత్ర సాగుతున్న ప్రాంతాల్లో ఇతర వాహనాలను అనుమతించరు. ఒకవేళ నిమజ్జనం పూర్తి కావడంలో ఆలస్యం జరిగితే ఈ మార్గాల్లో ట్రాపిక్ ఆంక్షలు పొడిగించే అవకాశం ఉంది.