Raksha Bandhan 2024 | హైదరాబాద్ లో బేగం బాజార్ అంటే దాదాపు తెలియని వారు ఉండరు. అదే బేగం బాజార్ ను ఆనుకుని ఉన్న రాఖీ బజార్ అంటే అతి తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఎందుకంటే రాఖీ పండుగ సమయంలో మాత్రమే ఇక్కడ సందడి వాతావరణం కనిపిస్తుంది. పండుగకు ఓ నెల రోజుల ముందు నుంచి రంగు రంగుల రాఖీలతో ఇక్కడ వీధి మొత్తం సందడిగా మారిపోతుంది. హైదరాబాద్ వాసులు మాత్రమే కాదండోయ్, తెలుగు రాష్ట్రాలలోని వివిధ జిల్లాల నుండి ఇక్కడ రాఖీ బజార్ లో రాఖీలు కొనేందుకు వస్తుంటారు. అంతలా ప్రత్యేకత ఏముంది ఈ రాఖీ బజార్ లో అనే సందేహం సహజమే. 




ఈ రాఖీ బజార్ లో వేలాది రాకీ డిజైన్స్, మోడల్స్ దొరకడమే కాదు. బయట మార్కెట్ తో పోల్చితే అత్యంత తక్కువ ధరలోనే ఇక్కడ రాఖీలు లభిస్తాయి. ఈ రాఖీ బజార్ లో ముప్ఫై రూపాయలు ఉండే రాఖీ, బహిరంగ మార్కెట్ లో నూరు నుంచి రెండు వందల రూపాయలు పలుకుంది. ధరలు మాత్రమే తక్కువ కాదండోయ్ ఇక్కడ బాహుబలి రాఖీ, జంబో రాఖీ, వన్ గ్రామ్ గోల్డ్ రాఖీ ఇలా ఆకట్టుకునే పేర్లతో, కట్టిపడేసే డిజైన్స్ లో రాఖీలు లభిస్తాయి. అందుకే ఈ రాఖీ బజార్ అంటే తెలుగు రాష్ట్రాలకే మాత్రామే కాదండోయ్ మహారాష్ట్ర వంటి పొరుగు  రాష్ట్రాలకు సైతం మహా క్రేజ్.


రాఖీ బజార్ లో మూడు తరాలుగా రాఖీ తయారీ వ్యాపారంపై ఆధారపడిన రవీందర్ తో ఏబీపీ దేశం మాట్లాడింది. రవీందర్ ఏమన్నారంటే..


మా తాత, మా తండ్రి, ఇప్పుడు మేము ఇక్కడ రాఖీ తయారు చేసి విక్రయాలు చేస్తున్నాము. హోల్ సేల్ గా రాఖీలు అమ్ముతాము. చివరి వారం రోజులు ఈ ఏడాది వ్యాపారం చాలా బాగుంది. గత ఏడాదితో పోల్చితే సేల్ బాగా పెరిగింది. మా వద్ద రెండు రూపాయల నుండి ఐదు వందల రూపాయల వరకూ రాఖీలు ఉంటాయి. మహారాష్ట్ర నుంచి సైతం మా వద్ద రాఖీలు కొనేందుకు వస్తుంటారు. స్టోన్ రాఖీ, జరీ రాఖీలు మా ప్రత్యేకత. రెండు రోజుల్లో మోడల్స్ మారిపోతుంటాయి. కొత్త మోడల్స్ వస్తుంటాయి. తెలుగు రాష్ట్రాల నుండి  మావద్ద హోల్ సేల్ గా రాఖీలు కొని లోకల్ గా మార్జిన్ తో వ్యాపారస్తులు అమ్ముకుంటారు. మేము మాత్రమే కాదు మా తరువాత జనరేషన్ కూడా రాఖీ తయారీ, అమ్మకాలపై ఆధారపడి  జీవిస్తున్నామని తెలిపారు.


రాఖీ బజార్ లో వ్యాపారి వినాయక్ సింగ్ ను ఏమంటున్నారంటే..


రాఖీ తయారీలో మాది మూడవ తరం. మా వద్ద  రాఖీ, బహుబలి రాఖీ ఇలా ఒక్కరూపాయి రాఖీ నుంచి పన్నెండు వందల వరకూ వివిధ మోడల్స్ లో రాఖీలు లభిస్తాయి. గత ఏడాది సేల్స్ సరిగా లేకపోవడంతో ఈ ఏడాది ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. ఇక్కడ రాఖీ బజార్ లో కనిపించే వ్యాపారులే కాదు, ఇళ్ల వద్ద వందల మంది మహిళలు రాఖీ తయారీపై ఆధారపడి జీవిస్తున్నారు. ఈసారి వేగంగా రాఖీ అమ్మకాలు జరిగిపోయాయి. మా వద్ద నుంచి పూనే, తమిళనాడు సైతం రాఖీలు సరఫరా చేస్తామని వివరించారు.


Also Read: రక్షాబంధన్ ఎలా మొదలైంది - రాఖీ కట్టేందుకు ఆగష్టు 19న శుభముహూర్తం ఎప్పుడు!