భాగ్యనగర వాసులకు ఎండల నుంచి భారీ ఉపశమనం కలిగింది. హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురుస్తోంది. పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడుతోంది. పంజాగుట్ట, అమీర్‌పేట్‌, ఎస్సార్‌నగర్‌ లలో జోరుగా వర్షం కురిసింది. ఈ ఏరియాలతో పాటు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌, మాసబ్ ట్యాంక్, లక్డికాపూల్, మెహిదిపట్నం, టోలీచౌకీ, గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్, హైటెక్ సిటీ, మణికొండ, సికింద్రాబాద్‌లో కుండపోత వర్షం కురిసింది. 


ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడటంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పలు ప్రాంతాల్లో రోడ్లు జలమయం కావడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తింది. హైదరాబాద్ లోని పలు జంక్షన్లలో ట్రాఫిక్ ఎక్కడిక్కడ నిలిచిపోయింది. పని ముగించుకుని ఇంటికి బయలుదేరిన నగరవాసులు వర్షంలో చిక్కుపోయారు. వర్షపు నీటితో లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.  వాతావరణ అధికారులు సూచించినట్లుగానే హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. 






తెలంగాణలో మూడు రోజుల వరకు వాతావరణ విశ్లేషణ, వాతావరణ హెచ్చరికలు: 
ఈ రోజు, రేపు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షంలు అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది మరియు ఎల్లుండి కొన్ని చోట్ల వచ్చే అవకాశం ఉంది.


వాతావరణ హెచ్చరికలు
ఈ రోజు, రేపు తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు మరియు మెరుపులతో  కూడిన వర్షంలు అక్కడక్కడ మరియు ఎల్లుండి ఉరుములు మరియు మెరుపులతో  పాటు  ఈదురు గాలులు ( గాలి  గంటకు 30 నుండి 40 కి మీ వేగంతో )కొన్ని జిల్లాలలో వచ్చే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.






హైదరాబాద్ వెదర్ రిపోర్ట్..
‘‘హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘాలు పట్టి ఉంటుంది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో సాయంత్రం లేదా రాత్రి సమయంలో ఉరుములతో కూడిన మేఘాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 37 డిగ్రీలు, 25 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. దక్షిణ, ఆగ్నేయ దిశ నుంచి గాలులు గంటకు 6 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొ్న్నారు. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 36.9 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 25 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 64 శాతం నమోదైంది.