Rains In Hyderabad News | హైదరాబాద్‌: ఉపరితల ఆవర్తనం ప్రభావంతో హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ముఖ్యంగా దక్షిణ, పశ్చిమ హైదరాబాద్ ఏరియాలలో మోస్తరు నుంచి భారీ వర్షం కురవనుందని వాతావరణ నిపుణులు తెలిపారు. హైదరాబాద్‌లో పంజాగుట్ట, కూకట్ పల్లి, బోయిన్ పల్లి, కోఠి, అత్తాపూర్, మెహిదీపట్నం, చాదర్ ఘట్, చార్మినార్ ప్రాంతాల్లో వాన కురుస్తోంది. వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోవడంతో వాహనదారులతో పాటు వాకర్స్ ఇబ్బంది పడుతున్నారు. వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోవడంతో ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతోంది.






ఇంట్లో ఉండే వారు అవసరమైతే తప్పా, రోడ్ల మీదకు రాకపోవడం మంచిదని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు. మరోవైపు బయటకు వెళ్లిన వారు ఇళ్లకు తిరుగు ప్రయాణం అయిన సమయంలో వర్షం పడటంతో ఇబ్బంది పడుతున్నారు. మ్యాన్ హోల్స్, నాలాలు లాంటివి చూసుకుని నడవాలని, వాహనాలు నడపాలని జాగ్రత్తలు చెబుతున్నారు. వర్షాకాలం మొదలుకావడంతో సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల అధికారులతో సమావేశమై ఎక్కువ వరద నీరు చేరే ప్రాంతాలని గుర్తించి, అందుకు పరిష్కారం చూడాలని ఆదేశించారు.