హైదరాబాద్‌లో నేడు పెద్ద ఎత్తున ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. ముఖ్యంగా బేగంపేట మీదుగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వెళ్లేవారికి నేడు ఇబ్బందులు తప్పవు. పరేడ్ గ్రౌండ్ చుట్టుపక్కల దాదాపు 3 నుంచి 4 కిలో మీటర్ల పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. ఎందుకంటే నేడు పరేడ్‌ గ్రౌండ్‌లో బీజేపీ విజయ సంకల్ప సభ జరగనుంది. ప్రధాని మోదీ హాజరు కానున్న ఈ సభకు పెద్ద ఎత్తున బీజేపీ నేతలు, కార్యకర్తలు హాజరు కానున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. కొన్ని రోడ్లను పూర్తిగా నిలిపివేయడం సహా, మళ్లింపులు ఎక్కువగా ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. కాబట్టి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వెళ్లేవారు కొన్ని గంటల ముందుగానే చేరుకోవాలని సూచించారు.


పంజాగుట్ట లేదా అమీర్ పేట్ మీదుగా సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌కు వెళ్లాలనుకునే వారు పంజాగుట్ట, వీవీ స్టాట్యూ, ఐ మ్యాక్స్‌, తెలుగు తల్లి ఫ్లైఓవర్, లోయర్‌ ట్యాంక్‌ బండ్, ఆర్టీసీ క్రాస్‌ రోడ్, ముషీరాబాద్‌ క్రాస్‌ రోడ్, గాంధీ హాస్పిటల్ మీదుగా సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ ప్లాట్ ఫాం నెం 10 కి చేరుకోవాలి. ఇదే మార్గం నుంచి పంజాగుట్ట వైపునకు చేరుకోవాల్సి ఉంటుంది. 


ఉప్పల్ వైపు నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకోవాల్సిన వారు ఉప్పల్, తార్నాక, ఆలుగడ్డబావి, చిలకల్ గూడ జంక్షన్ నుంచి ప్లాట్ ఫాం 10 ద్వారా స్టేషన్‌కు చేరుకోవాలి. బేగంపేట్, ప్యాట్నీ, ప్యారడైజ్‌ జంక్షన్, జనరల్ బజార్, రాణిగంజ్, రసూల్ పుర, ప్రకాశ్ నగర్ ప్రాంతాలు నేడు అత్యంత రద్దీగా ఉంటాయి కాబట్టి, నేడు మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి 10 గంటల మధ్య ఎంజీ రోడ్, ఆర్పీ రోడ్ and ఎస్‌డీ రోడ్‌ల వైపు వెళ్లకపోవడం మంచిదని హైదరాబాద్ సీపీ ఓ ప్రకటన విడుదల చేశారు.






తివోలి X రోడ్ నుంచి ప్లాజా X రోడ్ మధ్య రహదారి మూసివేస్తామని తెలిపారు. ఈ క్రింది జంక్షన్‌లలో ట్రాఫిక్ రద్దీ ఉంటుందని భావిస్తున్నట్లు సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. స్వీకార్‌ ఉప్‌కార్ జంక్షన్, సికింద్రాబాద్ క్లబ్, తిరుమలగిరి x రోడ్, తాడ్‌బండ్ x రోడ్, సెంటర్ పాయింట్, డైమండ్ పాయింట్, బోయినపల్లి X రోడ్ వద్ద కూడా ట్రాఫిక్ ఉంటుందని సీపీ వెల్లడించారు.


కోంపల్లి వైపు నుంచి..
మేడ్చల్/బాలానగర్ నుంచి సికింద్రాబాద్ వైపు వచ్చే వాహనాలను బోయినపల్లి X రోడ్డు వద్ద డెయిరీ ఫామ్ రోడ్డు - హోలీ ఫ్యామిలీ చర్చి – తిరుమలగిరి – RK పురం - నేరెడ్‌మెట్ – మల్కాజిగిరి - మెట్టుగూడ నుంచి సికింద్రాబాద్ వైపునకు మళ్లిస్తారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 వరకు హైదరాబాద్ లో భారీ ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి.


రాజ్ భవన్ రోడ్డు మూసివేత
మరోవైపు, రాజ్ భవన్ రోడ్డును ఆదివారం సాయంత్రం నుంచి మరసటి రోజు ఉదయం వరకూ మూసివేయనున్నారు. ప్రధాని మోదీ విజయ సంకల్ప సభలో పాల్గొన్న అనంతరం నేడు రాత్రికి రాజ్ భవన్‌లోనే బస చేయనున్నారు. భద్రతా కారణాల రీత్యా రాజ్ భవన్‌ రోడ్డులోకి ట్రాఫిక్ అనుమతించబోమని పోలీసులు స్పష్టం చేశారు.