BJP Meeting : హైదరాబాద్ లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాల్లో పాల్గొనేందుకు బీజేపీ జాతీయ నేతలందరూ హైదరాబాద్ లో వాలిపోయారు. అయితే వీరిలో సీనియర్ నేతల నుంచి సినీ యాక్టర్ల వరకూ ఉన్నారు. ఈ సమావేశాల్లో ఫైర్ బ్రాండ్స్ విజయశాంతి, కుష్బూ అందరి దృష్టిని ఆకర్షించారు. సినిమాలు వదిలి రాజకీయాల్లోకి వచ్చిన విజయశాంతి బీజేపీలో చేరారు. ముఖ్యమైన మీటింగ్ లకు మాత్రమే హాజరయ్యే విజయశాంతి... హైదరాబాద్‌ లో జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతుండటం అందులోనూ ప్రధాని మోదీ, అమిత్‌ షా వంటి నేతలు హాజరవుతుండటంతో విజయశాంతి ఇక్కడ ప్రత్యక్షం అయ్యారు. 






ఇద్దరూ ఒకే సినిమాలో 


ఇక కాంగ్రెస్‌ నుంచి బీజేపీలోకి మారిన కుష్బూ కూడా ఈ సమావేశాలకు విచ్చేశారు. వచ్చీ రాగానే మాటలతో ఆపై డాన్సులతో కార్యకర్తల్లో జోష్‌ నింపారు. ఈ ఇద్దరు వెండితెరపై ఎలా సీన్లు పండించారో తెలిసిందే. అంతేకాదు ఇద్దరూ కలిసి ఓ సినిమా కూడా చేశారు.  సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా నటించిన మన్నన్‌ అనే సినిమాలో హీరోయిన్లుగా విజయశాంతి, కుష్బూ కలిసి నటించారు. 1992లో ఈ సినిమా వచ్చింది.  ఇదే సినిమా తెలుగులో చిరంజీవి ఘరానా మొగుడుగా వచ్చింది. ఆ సినిమాలో కలిసి కనిపించిన ఈ గ్లామర్‌ భామలు మళ్లీ ఇన్నేళ్లకి ఇలా ఓకే పార్టీలో ఓకే వేదికపై కనిపించడం కార్యకర్తల్లో ఉత్సాహాన్నినింపుతోంది.






మాటల తూటాలు 


ఈ మహిళా నేతల మాటల పవర్‌ ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. అందులోనూ సీఎం కేసీఆర్‌ పేరు వినపడితే చాలు విజయశాంతి ఎలా రియాక్ట్‌ అవుతారన్నది తెలిసిందే! వీళ్లు నోరు విప్పితే విమర్శల వరద అని టాక్. అలా మాటలు, చేతలతో కాషాయం ఫైర్‌ బ్రాండ్స్ గా పిలిపించుకుంటున్న విజయశాంతి, కుష్బూలు సీఎం కేసీఆర్‌ పై ఎలాంటి మాటల తూటాలు పేల్చనున్నరాన్నది ఆసక్తికరంగా మారింది.