Traffic Restrictions In Hyderabad:హైదరాబాద్‌లో గణేష్ ఉత్సవాల సందడి మొదలైపోయింది. ఏ గల్లీలో చూసిన ఏ కాలనీలో చూసిన గణపతి విగ్రహాలు కొలువుదీరుతున్నాయి. హైదరాబాద్ వ్యాప్తంగా ఉత్సాహంగా సాగుతున్న వేళ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ప్రజలకు పూజా కమిటీలకు ఎలాంటి సమస్య రాకుండా ఉండేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు సూచిస్తున్నారు. 


గణేష్ ఉత్సవాల వేళ హైదరాబాద్‌లో ఈ ఉదయం నుంచి ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. ఈ ఆంక్షలు ఉత్సవాలు పూర్తి అయ్యి గణపతి విగ్రహాలన్నీ గంగమ్మ ఒడికి చేరే వరకు ఉంటాయి. అంటే సెప్టెంబర్ 17  అర్థరాత్రి వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయి. 


Also Read: కమల్ హాసన్ సినిమాలో ఖైరతాబాద్ వినాయకుడు- ఒక్క అడుగుతో మొదలై గణేష్‌ గురించి తెలుసా?


హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు ఖైరతాబాద్‌, ట్యాంక్‌బండ్, నెక్లెస్ రోడ్డు, మింట్ కాంపౌండ్ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నాయి. ఆ ప్రాంత ప్రజలే ట్రాఫిక్ ఆంక్షలు తెలుసుకొని మసులుకోవాలని ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని చెబుతున్నారు పోలీసులు. 







ఇవే ట్రాఫిక్ ఆంక్షలు 



  • ఖైరతాబాద్‌లో కొలువుదీరిన వినాయక విగ్రహం నుంచి రాజీవ్‌ గాంధీ విగ్రహం మీదుగా మింట్‌ కాంపౌండ్‌ వైపుగా వాహనాలను అనుమతివ్వడం లేదు. 

  • ఖైరతాబాద్‌ గణేష్‌ ను చూసేందుకు పాత సైఫాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ నుంచి  వచ్చే వాళ్లను రాజ్‌దూత్‌ లైన్‌లోకి అనుమతించడం లేదు. 

  • అలాగే ఇక్బాల్‌ మినార్‌ నుంచి మింట్‌ కాంపౌండ్‌ లేన్‌ వైపుగా వాహనాలను అనుమతివ్వడం లేదు. 

  • ఎన్టీఆర్‌ మార్గ్‌, ఖైరతాబాద్‌ ఫ్లైఓవర్‌, నెక్లెస్‌ రోడ్‌ నుంచి మింట్‌ కాంపౌండ్‌ వైపుగా కూడా వాహనాల ప్రవేశాన్ని నిషేధించారు. 

  • నిరంకారి నుంచి తెలుగు తల్లి జంక్షన్‌ లేదా ఖైరతాబాద్‌ ఫ్లై ఓవర్‌ వైపు వెహికల్స్‌ను రానివ్వడం లేదు. 

  • ఖైరతాబాద్‌ పోస్టాఫీస్‌ లేను ఖైరతాబాద్‌ రైల్వే గేటు మీదుగా కూడా వాహనాలు వెళ్లేందుకు అనుమతి లేదు. 

  • అయితే ఖైరతాబాద్‌ గణేషుడిని చూసేందుకు వచ్చే వారి కోసం ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు చేశారు పోలీసులు. నెక్లెస్ రోటరీ, ఎన్టీఆర్ గార్డెన్ మీదుగా వచ్చే వాహనాల కోసం ఐమాక్స్ థియేటర్ పక్కన అంబేద్కర్ స్క్వేర్ పార్కింగ్ స్థలం, ఎన్టీఆర్ గార్డెన్ పార్కింగ్ స్థలాలు, ఐమాక్స్ ఎదురుగా, సరస్వతి విద్యా మందిర్ హైస్కూల్ ప్రాంగణం, రేస్ కోర్స్ రోడ్ పార్కింగ్ ప్లేస్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అటు నుంచి వచ్చిన వాళ్లు అక్కడ పార్క్ చేసుకోవచ్చు. 


Also Read: 70 ఏళ్ల మహాగణపతికి 70 అడుగుల విగ్రహం- ఖైరతాబాద్ గణేషుడి విశేషాలు తెలుసా?